భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
ప్రపంచ దేశాలకు సేవలందిస్తూ.. ‘విపత్తు హెచ్చరిక’ వ్యవస్థల్లో అగ్రగామిగా నిలిచిన భారత్ : డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రపంచవ్యాప్తంగా తీరప్రాంతాల భద్రతకు తోడ్పాటు.. విపత్తులను ఎదుర్కొనే దీటైన వ్యవస్థలతో ముందుకెళ్తున్న భారత్: డాక్టర్ జితేంద్ర సింగ్
‘డీప్ సీ మిషన్’ వంటి వినూత్న పథకాలతోపాటు ఈ రంగానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యం
శరవేగంగా పురోగతి సాధిస్తున్న ఇన్ కోయిస్: ఈ తరహా సంస్థల్లో ప్రపంచంలోకెల్లా అత్యాధునికమైనదిగా గుర్తింపు
‘వికసిత భారత్’ లక్ష్యం దిశగా మహాసముద్రాల అన్వేషణ కీలకం: మంత్రి
మహా సముద్రాలపై పరిశోధన, విపత్తు సంసిద్ధతల్లో భారత పురోగతిని ఇన్ కోయిస్ లో ప్రముఖంగా ప్రస్తావించిన డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
26 DEC 2024 3:16PM by PIB Hyderabad
విపత్తు హెచ్చరికలో భారత్ నేడు అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా అవతరించిందనీ, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకూ సేవలందిస్తోందనీ కేంద్ర శాస్త్ర-సాంకేతికతల శాఖ సహాయ (స్వతంత్ర హోదా), భౌగోళిక విజ్ఞాన శాఖ, పీఎంవో సహాయక, అణుశక్తి శాఖ, అంతరిక్ష శాఖ, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 2004లో సంభవించిన హిందూ మహా సముద్ర సునామీకి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఇన్ కోయిస్ (భారత జాతీయ మహాసముద్ర సమాచార వ్యవస్థా కేంద్రం)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
2004లో సునామీ విషాదం అనంతరం ఏర్పడిన ఇన్ కోయిస్.. 2014 తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నుంచి లభించిన స్థిరమైన సహకారం, ఆయన ఈ సంస్థకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల వేగంగా పురోగతి సాధించిందని మంత్రి గుర్తుచేశారు. ఈ తరహా సంస్థల్లో ప్రపంచంలో అత్యాధునికమైనదిగా గుర్తింపు పొందిందన్నారు.
‘డీప్ సీ మిషన్’ సహా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన సముద్ర సంబంధిత కార్యక్రమాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. సముద్ర పరిశోధన, విపత్తుల సన్నద్ధతలో భారత్ సాధించిన పురోగతిని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి విపత్తు హెచ్చరిక వ్యవస్థలను అందించడంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తోందని మంత్రి ఉద్ఘాటించారు. భద్రత, సుస్థిరతలను పెంపొందించడంలో శాస్త్రీయ పురోగతి పాత్ర అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు.
భారత్ లో 10,749 మందినీ, ప్రపంచవ్యాప్తంగా 2,30,000 మంది ప్రాణాలను బలిగొన్న విపత్కర సునామీ విలువైన పాఠాలు నేర్పిందనీ, అనంతరం ఈ పరిస్థితిలో మార్పు తెచ్చే దిశగా విధానాలు రూపొందాయనీ డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. “ఈ విషాదం.. ఇన్ కోయిస్ వంటి సంస్థల స్థాపన ఆవశ్యకతను తెలియజేసింది. జీవన భద్రత, జీవనోపాధికి భరోసానివ్వడంలో భారత నిబద్ధతకు ఇప్పుడీ సంస్థ నిదర్శనంగా నిలుస్తోంది’’ అన్నారు.
అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన భారత ముందస్తు సునామీ హెచ్చరిక వ్యవస్థ భారత విపత్తు సన్నద్ధతకు మూలాధారంగా నిలిచింది.
యునెస్కోతో ప్రస్తుత సహకారాన్నీ, అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో సామాజిక పునరుద్ధరణను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్న సునామీ సంసిద్ధతా చర్యలనూ మంత్రి ప్రస్తావించారు. ఈ కార్యక్రమం కింద 24 భారతీయ సమూహాలను గుర్తించడాన్ని.. సమాజ కేంద్రీకృత విధానానికి నిదర్శనంగా పేర్కొన్నారు.
తీరప్రాంతంలో, సమృద్ధిగా ఉన్న వనరులను సుస్థిరమైన మార్గాల్లో అన్వేషించి, వాటిని పరిరక్షించాలని సూచించారు. "సముద్ర లోతుల్లో అన్వేషణ, బయోఈ3 (పర్యావరణం, ఉపాధి, ఆర్థికవ్యవస్థల కోసం బయోటెక్నాలజీ) లాంటి మా కార్యక్రమాలు జీవవైవిధ్యాన్ని పెంపొందించడమే కాకుండా జాతీయ శ్రేయస్సుకు దోహదం చేసే వ్యవస్థను సృష్టిస్తున్నాయి" అని ఆయన చెప్పారు
భవిష్యత్తులో అంతరిక్షం, సముద్ర కార్యకలాపాల్లో ఏకకాలంలో పురోభివృద్ధి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ రెండు రంగాల్లో భారత్ అగ్రగామిగా మారుతుందని మంత్రి ఆకాంక్షించారు. ‘‘సముద్ర అంతర్భాగంలోకి ఒక భారతీయున్ని, అంతరిక్షంలోకి మరొకరిని పంపించేందుకు మేం ప్రణాళిక సిద్ధంచేస్తున్నాం. బహుశా 2026 నాటికి ఈ చారిత్రక మైలురాయిని మనం చేరుకోవచ్చు’’ అని ఆయన ప్రకటించారు.
విధానాలకు, శాస్త్రానికి మధ్య సమన్వయాన్ని డా.జితేంద్ర సింగ్ ప్రశంసిస్తూ, అంతరిక్షం, సముద్ర విజ్ఞాన శాస్త్రం లాంటి రంగాల్లో వేగంగా సాధిస్తున్న అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమే కారణమని అన్నారు.
యునెస్కో కేటగిరీ 2 శిక్షణా కేంద్రాన్ని నిర్వహించే ఇన్‌కాయిస్ ద్వారా అంతర్జాతీయ సహకారంలో భారత్ పోషిస్తున్న చురుకైన పాత్రను డా. జితేంద్ర సింగ్ ప్రధానంగా ప్రస్తావించారు. ఇది సామర్థ్య నిర్మాణ కేంద్రంగా, సముద్ర ఆధారిత విపత్తు నిర్వహణలో విజ్ఞానాన్ని పంచుకునే కేంద్రంగా వ్యవహరిస్తుంది. 2030 నాటికి 100 శాతం సునామీని ఎదుర్కొనే సమాజాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఓషన్ డికేడ్ సునామీ కార్యక్రమంలో ఇన్‌కాయిస్ పోషిస్తున్న చురుకైన భాగస్వామ్యాన్ని ఆయన గుర్తించారు. ‘‘ఇలాంటి కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన తీరప్రాంత సమూహాలను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.
వీటికి అదనంగా ఉప్పెనలు, పెద్ద అలలు లాంటి సముద్ర సంబంధిత ప్రమాదాలతో సహా సునామీ హెచ్చరికలను సమగ్ర బహుళ విపత్తు హెచ్చరికల వ్యవస్థగా ఏకీకృతం చేయాల్సిన అవసరం గురించి మంత్రి ప్రధానంగా చర్చించారు. ఈ తరహా కార్యక్రమాలు భారత సునామీ హెచ్చరికల సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు పెరుగుతున్న సముద్ర విపత్తుల సంక్లిష్టతను పరిష్కరిస్తుంది. "ఇలా ముందుచూపుతో వ్యవహరించే విధానం, భవిష్యత్తులో ఎదురయ్యే విపత్తుల నుంచి ప్రాణాలను, జీవనోపాధి వ్యవస్థలను రక్షిస్తుంది’’ అని ఆయన వివరించారు.
2047 భారత్ లక్ష్యంలో ఇన్‌కాయిస్ ముఖ్య పాత్ర పోషిస్తుందని మంత్రి ప్రసంగాన్ని ముగించారు. ‘‘నిరుపయోగంగా ఉన్న వనరులను అన్వేషించి, విపత్తులను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవడం ద్వారా స్వావలంబన సాధించిన, స్థిరమైన భారత్ ను నిర్మించడంలో ఇన్‌కాయిస్ కీలకపాత్ర పోషిస్తుంది’’ అని స్పష్టం చేశారు.
భౌగోళిక శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా.ఎం. రవిచంద్రన్, ప్రముఖ శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి మార్గం నిర్దేశిస్తూనే, రెండు దశాబ్దాలుగా సాధించిన విజయాలను జరుపుకోవడానికి వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.
***
(Release ID: 2088173)
Visitor Counter : 51