సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సుపరిపాలన దినోత్సవం
జీవితాల్లో వెలుగులు.... ప్రతి ఇంటికీ కుళాయి నీళ్లు
Posted On:
25 DEC 2024 11:31AM by PIB Hyderabad
తన ఇంట్లో కొత్త కుళాయి నుంచి వస్తున్న శుద్ధమైన నీటి ధారలను చూసి ముస్కాన్ అనే చిన్నారి ఆనందంతో చప్పట్లు కొట్టింది. దంహేడీ గ్రామంలో కనిపించిన సంబురమిది.. కుళాయిల ద్వారా నీటిని అందించడం ద్వారా అక్కడి ప్రజల జీవితాల్లో అనూహ్యమైన పరివర్తన వచ్చింది. ఉద్వేగానికి లోనైన ఆమె తల్లి.. ఈ సందర్భానికి గుర్తుగా ఓ చిన్న పూజ చేశారు. ఈ కుళాయి కేవలం ఓ సౌలభ్యం మాత్రమే కాదనీ, అంతకు మించినదనీ ఆమెకు తెలుసు. గౌరవానికీ, ఆరోగ్యానికీ ఇది ఆధారం. ఉజ్వల భవితకు అదొక భరోసా. ముస్కాన్ వరకైతే.. ఇక నీటి కోసం తల్లి ఇబ్బంది పడుతుందన్న చింత లేకుండా తాను ఆడుకోవచ్చు. మరోవైపు ఆ తల్లికి సమయం ఆదా కావడంతోపాటు పిల్లల ఆరోగ్యం గురించిన చింతను తగ్గించింది. ఓ ఇంటికి నీటిని అందించడమన్న ఈ చిన్న చర్య.. సుపరిపాలన ద్వారా ప్రజాజీవనం ఎంతలా అభ్యున్నతి చెందుతుందో సూచిస్తుంది.
ఈ పరివర్తన సుపరిపాల దినోత్సవ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 25న ఈ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. పరిపాలన అంటే కేవలం నిర్వహణ మాత్రమే కాదనీ, ప్రతి పౌరుడి జీవితాన్నీ మెరుగుపర్చడమేనని ఈ రోజు మనకు గుర్తుచేస్తుంది. జవాబుదారీతనం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఉన్న సుపరిపాలన సూత్రాలకు శ్రీ వాజ్‌పేయీ నాయకత్వం ఉదాహరణగా నిలిచింది.
ఆయన దార్శనికతకు అనుగుణంగా ఏటా డిసెంబరు 19 నుంచి 25 వరకు ప్రభుత్వం సుపరిపాలన వారోత్సవాలను (సుశాసన్ సప్తాహ) నిర్వహిస్తోంది. పారదర్శకమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన పాలనను బలోపేతం చేయడంపై ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం. జిల్లాల నుంచి గ్రామాల వరకు సుపరిపాలన భావనను వ్యాపింపజేస్తూ.. పరిపాలన పారదర్శకంగా, ప్రభావవంతంగా, జవాబుదారీతనంతో కూడినదిగా ఉండేలా చూడడం ఈ వారోత్సవాల లక్ష్యం. ప్రజల జీవితాల అభ్యున్నతి దిశగా పరిపాలనను అందించడంపై.. తన నిబద్ధతను వివిధ కార్యకలాపాల ద్వారా ప్రభుత్వం చాటుతోంది.
పరిపాలన అంటే.. ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాలను సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా అమలు చేయడం. సుపరిపాలన భావన మరింత విస్తృతమైనది. భాగస్వామ్యం, సమానత్వం, సుస్థిరతలపై ఇది ప్రధానంగా దృష్టిసారిస్తుంది. ఐక్య రాజ్య సమితి ప్రకారం సుపరిపాలనకు ఎనిమిది ప్రధాన లక్షణాలున్నాయి. అవి: - భాగస్వామ్యంతో కూడి ఉండాలి, ఏకాభిప్రాయ ఆధారితం, జవాబుదారీతనం, పారదర్శకత, స్పందించేదిగా ఉండాలి, ప్రభావశీలత, సమత, సమ్మిళితత్వం. అవన్నీ చట్టబద్ధమైన పాలనకు కట్టుబడి ఉండాలి. అత్యంత వెనుకబడిన వారూ తమ గొంతు వినిపించగల అవకాశంతోపాటు.. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వ నిర్ణయాలుండేలా ఈ సమగ్ర యంత్రాంగం భరోసా ఇస్తుంది.
సుపరిపాలన భావన భారతీయ సంప్రదాయంలో బలంగా ఇమిడి ఉన్నది. ప్రాచీన భారతదేశంలో రాజులు రాజధర్మానికి కట్టుబడి ఉండేవారు. అది పాలనలో నైతికతకూ, సత్ప్రవర్తనకూ మార్గదర్శక సూత్రాలను అందించేది. మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలు ఆదర్శవంతమైన పాలకుడి లక్షణాలను వివరిస్తాయి. న్యాయం, ధర్మం, ప్రజల సంక్షేమం ప్రాధాన్యాన్ని అవి స్పష్టంగా పేర్కొంటాయి. ఈ ప్రాచీన సూత్రాలు నేటికీ ఆచరణీయమే. పాలన ఎల్లప్పుడూ చిత్తశుద్ధి, కారుణ్యాలతో కూడి ఉండి.. సేవనే లక్ష్యంగా ఉండాలని అవి గుర్తుచేస్తాయి. ‘జల్ జీవన్ మిషన్’ ఈ కాలాతీత విలువలకు ఆధునిక అభివ్యక్తి. సామాజిక న్యాయానికి అనుగుణంగా ఉన్న పరిపాలన వల్ల సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు ఎన్ని ప్రయోజనాలను అందించగలదో దీని ద్వారా స్పష్టంగా వెల్లడవుతుంది.
2019లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జల జీవన్ మిషన్ ను ప్రకటించిన సమయంలో పరిస్థితి భయంకరంగా ఉండేది. గ్రామీణ కుటుంబాల్లో కేవలం 17% ఇళ్లకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయి. 15 కోట్ల కుటుంబాలు నీటి కోసం బయటి వనరులపైనే ఆధారపడి ఉన్నాయి. ఇది అసౌకర్యం మాత్రమే కాదు.. ఇది దినదిన పోరాటం.. ముఖ్యంగా నీటికొరత ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం. ఈ పథకం 12 కోట్ల కొత్త కుళాయి నీటి కనెక్షన్లను అందించింది. దాంతో ఈ ఏడాది డిసెంబరు 23 నాటికి దేశవ్యాప్తంగా కుళాయి నీటి కనెక్షన్ల సంఖ్య మొత్తం 15.38 కోట్లకు చేరడానికి విశేషంగా తోడ్పడింది. నీటి సదుపాయం పొందడానికి ఏ ఇల్లూ మినహాయింపు కాదన్న భరోసాను అందించడం ద్వారా లక్షలాది మందికి ఈ కార్యక్రమం ఆశాజ్యోతిగా మారింది.
జల్ జీవన్ మిషన్ విజయంలో పారదర్శకత, ప్రతిస్పందన అంతర్భాగాలుగా ఉన్నాయి. కుళాయి నీటి కనెక్షన్ల పురోగతిపై వాస్తవిక గణాంకాలు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. విశ్వసనీయ వాతావరణాన్ని సృష్టించడంతోపాటు వనరుల వినియోగం సమర్థవంతంగా జరుగుతుండడాన్ని ఇది సూచిస్తుంది. ఫిర్యాదుల పరిష్కారం, నాణ్యతను పర్యవేక్షించడం కోసం సామూహిక సమావేశాలు వేదికలుగా ఉపయోగపడతాయి. పారదర్శకత, జవాబుదారీతనం సూత్రాల పట్ల ఈ రకమైన నిబద్ధత సుపరిపాలనకు ప్రమాణంగా నిలుస్తుంది. తమ భావాలను వినిపించగలమన్న విశ్వాసాన్నీ, తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకాన్నీ ఇది ప్రజలకు అందిస్తుంది.
కుళాయిల ద్వారా నీళ్లు రావడమన్న తక్షణ ఫలితానికి మాత్రమే జల్ జీవన్ మిషన్ ఫలితాలు పరిమితం కాలేదు. మహిళలు నీటిని తేవడం కోసం గంటల తరబడి సమయం వెచ్చించాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది. విద్య, ఉద్యోగ కార్యకలాపాలకూ, లేదా విశ్రాంతి తీసుకోవడానికీ వారికి అవకాశం కల్పిస్తుంది. పిల్లలకు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించి, మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా చదవులతోపాటు ఆటపాటలపై దృష్టిపెట్టడానికి అవకాశం కల్పిస్తుంది. మానవ జీవితంలో ఒకదానితో మరొకటిగా ముడిపడి ఉన్న అంశాలను సుపరిపాలన ఏ విధంగా అనుకూలంగా మారుస్తుందో ఈ పరిణామాలు వివరిస్తాయి. వ్యక్తిగత పరిష్కారాలకు బదులు సుపరిపాలన మొత్తం సమాజం అభ్యున్నతిని సాధిస్తుంది.
సమత, సమ్మిళితత్వ సూత్రాలు ఈ కార్యక్రమానికి కేంద్ర బింధువులుగా నిలుస్తాయి. గిరిజన ప్రాంతాలు, వెనుకబడిన సమాజాల్లో స్వచ్ఛమైన నీటి సదుపాయం ఒకప్పుడు తీరని కలగా ఉండేది. జల్ జీవన్ మిషన్ సాధికారతకు చిహ్నంగా మారింది. శుభ్రమైన నీటిని అందించడం అన్న ప్రాథమిక సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. సాధికారత, సమతలను సాధించడం కోసం పరిపాలనను సాధనంగా భావించే తన నిబద్ధతను ప్రభుత్వం పునరుద్ఘాటించింది. సుపరిపాలన సూత్రాలు ఆధారంగా ఉన్న నాయకత్వం విప్లవాత్మక మార్పుల దిశగా ప్రేరణ అందించగలదనడానికి ఈ కార్యక్రమం ఉదాహరణగా నిలుస్తుంది.
ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి జల్ జీవన్ మిషన్‌కే పరిమితం కాలేదు. ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై), ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై), ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రజల వివిధ అవసరాలను తీర్చడం కోసం అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ప్రతిబింబిస్తాయి. తక్కువ ధరలోనే ఇంటి సదుపాయంతోపాటు ఆర్థిక చేయూతను అందించడం నుంచి ఆరోగ్య సేవలతోపాటు వ్యవస్థాపకతను ప్రోత్సహించడం వరకూ.. సుపరిపాలన సమ్మిళిత అభివృద్ధికి ఎలా బాటలు వేస్తుందో ఈ కార్యక్రమాలు చాటుతాయి.
ముస్కాన్ ఇంట్లో నవ్వులు నిండిన తీరు.. సుపరిపాలన ద్వారా ఏం సాధించగలమో ప్రభావవంతంగా వివరిస్తుంది. కొన్ని సమస్యలనే గుర్తించడమో లేదా చిన్నచిన్న బాధ్యతలను నెరవేర్చడమో కాదు.. సుపరిపాలన ప్రతి పౌరుడి జీవితాన్నీ మెరుగుపరుస్తుంది. ఈ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా.. ప్రజల గొంతు వినే, ప్రతిస్పందించే, అభ్యున్నతి కోసం కృషిచేసే పాలనకు జల జీవన్ మిషన్ ఆశాజనకమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇది ఆశ, పురోగతుల కథనం.. అందరి గౌరవానికీ భరోసా. కాలాతీతమైన రాజధర్మ ఆదర్శాలు, సమ్మిళిత అభివృద్ధి దార్శనికత సుపరిపాలనలో ప్రతిధ్వనిస్తాయి.
ఆధారాలు:
v. https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2021/sep/Jal%20Jeevan%20Eng.pdf
v. https://www.unescap.org/sites/default/files/good-governance.pdf
v. https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx
పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(Release ID: 2087965)
Visitor Counter : 20