పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామీణాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 446.49 కోట్ల విలువైన పదిహేనో ఆర్థిక సంఘం గ్రాంటు: రూ. 1598.80 కోట్ల గ్రాంట్లను అందుకొన్న ఉత్తర్ ప్రదేశ్


గ్రామీణ స్థానిక సంస్థల సాధికారతకే ఈ యునైటెడ్ గ్రాంట్‌లు నిర్దిష్ట ప్రాంతాల సమస్యలను తీర్చడానికే వీటి మంజూరు

Posted On: 24 DEC 2024 8:58AM by PIB Hyderabad


కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ‘పదిహేనో ఆర్థిక సంఘం (XV ఎఫ్‌సీ) గ్రాంట్ల’తోపాటు యునైటెడ్ రెండో వాయిదా రూపంలో  రూ.1598.80 కోట్లను ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసింది.  ఈ నిధులు ఆ రాష్ట్రంలో అర్హత కలిగిన మొత్తం 75 జిల్లా పంచాయతీలు, 826 బ్లాక్ పంచాయతీలతోపాటు 57,691 గ్రామ పంచాయతీలకు ఇస్తారు.  కాగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో పదిహేనో ఆర్థిక సంఘం (XV ఎఫ్‌సీ) గ్రాంట్లు, అదే ఆర్థిక సంవత్సరానికి యునైటెడ్ గ్రాంట్లలో రెండో వాయిదా రూపంలో రూ. 420.9989 కోట్లే కాక,  నిలిపి ఉంచిన యునైటెడ్ గ్రాంట్ల ఒకటో వాయిదా రూ.25.4898 కోట్లను కూడా విడుదల చేశారు.  ఈ నిధులను అర్హత కలిగిన 13,097 ఎన్నికైన గ్రామ పంచాయతీలకూ, 650 బ్లాక్ పంచాయతీలకూ రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లా పంచాయతీలకూ ఇస్తారు.

 
కేంద్ర ప్రభుత్వం పదిహేనో ఆర్థిక సంఘం (XV ఎఫ్‌సీ) గ్రాంట్లను రాష్ట్రాలలో గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయాలని పంచాయతీరాజ్ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖల (తాగునీరు, పారిశుధ్యంల విభాగం) ద్వారా సిఫార్సు చేస్తే, ఆర్థిక శాఖ ఆ నిధులను విడుదల చేస్తుంది.  కేటాయించిన గ్రాంట్లను ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు వాయిదాల రూపంలో ఇవ్వాలని సిఫార్సు చేసి, ఆ ప్రకారం విడుదల చేస్తారు.  

 
యునైటెడ్ గ్రాంట్లను పంచాయతీ రాజ్ సంస్థలు (పీఆర్ఐలు), గ్రామీణ స్థానిక సంస్థలు (ఆర్ఎల్‌బీలు) రాజ్యాంగ పదకొండో షెడ్యూలులో ఉల్లేఖించిన ఇరవై తొమ్మిది (29) అంశాల కింద జీతాలు, ఇతర సిబ్బంది ఖర్చులు మినహా నిర్దిష్ట ప్రాంతాల ముఖ్యావసరాలను తీర్చడానికి వినియోగించుకొంటాయి.  టైడ్ గ్రాంట్లను పారిశుధ్య నిర్వహణ, ఓడీఎఫ్ స్థితి నిర్వహణల వంటి ప్రాథమిక సేవల కోసం ఉపయోగించవచ్చు. ఇంకా దీనిలో గృహ వ్యర్థాల నిర్వహణ, శుద్ధి, మానవ విసర్జనలు, ఇతరత్రా వ్యర్థాల నిర్వహణకు తోడు, తాగునీటి సరఫరా, వాననీటి ఇంకుడుగుంతల నిర్వహణ, వాటర్ రీసైక్లింగ్ వంటివి కూడా కలిసి ఉంటాయి.

 
భారతదేశంలో క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరచే ప్రధాన ప్రయత్నంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం పదిహేనో ఆర్థిక సంఘం గ్రాంట్లను నేరుగా పంచాయతీ రాజ్ సంస్థలకు (పీఆర్ఐలు), రూరల్ లోకల్ బాడీలకు (ఆర్ఎల్‌బీలు) మళ్ళించి, తద్వారా గ్రామీణ స్థానిక పాలన ముఖచిత్రంలో పెను మార్పులు తీసుకువస్తోంది.  ఈ వ్యూహాత్మక ఆర్థిక సాధికారత కల్పన స్థానిక పాలనలో ఒక క్రాంతిని తెస్తూ, జవాబుదారుతనాన్ని పెంచి, పల్లెస్థాయిలో స్వయంసమృద్ధిని పెంచి పోషిస్తున్నది.  ప్రధాని చెబుతున్న ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ (అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసాన్ని గెల్చుకోవడం, అందరి ప్రయత్నాలు) అనే ఆశయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ప్రజల ప్రాతినిధ్యాన్ని విస్తరిస్తూ, వృద్ధి ఫలాలను అన్ని వర్గాలవారికీ చేరేవేయడంలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది.  సాధికారతను పొందిన ఈ స్థానిక సంస్థలు మార్పునకు ఒక శక్తిమంతమైన ఇంజిన్లుగా పనిచేస్తూ, ప్రతి ఒక్క గ్రామం తన సొంత భవితను తీర్చిదిద్దుకొంటూ దేశ సమృద్ధిలో తన వంతు పాత్రను పోషించి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) గమ్యాన్ని భారత్ చేరుకొనేటట్టుగా ఈ సంస్థలు సారథ్య బాధ్యతను తీసుకొంటున్నాయి.

 

****


(Release ID: 2087582) Visitor Counter : 31


Read this release in: English , Urdu , Hindi , Tamil