సహకార మంత్రిత్వ శాఖ
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు పెట్రోల్/డీజిల్ డీలర్ షిప్
Posted On:
18 DEC 2024 5:16PM by PIB Hyderabad
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) కార్యకలాపాల విస్తృతిని పెంచి.. వాటిని ఆర్థికంగా బలంగా, స్థిరంగా నిలపడం కోసం ఎల్పీజీ పంపిణీదారులుగా దరఖాస్తు చేసుకోవడానికి వాటికి అనుమతినిచ్చారు. పీఏసీఎస్ లకు ఎల్పీజీ పంపిణీకి అర్హత కల్పిస్తూ పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ తన మార్గదర్శకాలను సవరించింది.
విస్తృతమైన క్షేత్రస్థాయి యంత్రాంగం, గ్రామీణ సమాజాల్లో విశ్వసనీయత ఉన్న పీఏసీఎస్ లు మారుమూల ప్రాంతాల్లో ఎల్పీజీ పంపిణీలో అంతరాలను అధిగమించడంలో బాగా దోహదపడతాయి. ఎల్పీజీ సరఫరా పరిధిని పెంచడం మాత్రమే కాకుండా, ఎక్కడో ఉన్న పంపిణీదారులపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. ఇది గ్రామీణ కుటుంబాలకు సౌలభ్యాన్ని కలిగిస్తుంది.
చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీలు) ‘ఎల్పీజీ పంపిణీదారు ఏకీకృత మార్గదర్శకాల’ ప్రకారం పీఏసీఎస్ ల ద్వారా అధీకృతుడైన వ్యక్తికి శిక్షణ ఇస్తారు. పూర్వారంభ క్విజ్/ పరీక్షలో 80 శాతం అర్హత మార్కుల ద్వారా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పీఏసీఎస్ లకు ఎల్పీజీ పంపిణీ బాధ్యతలను అప్పగించడానికి ముందే.. నిల్వ సౌకర్యాలు, ఆరంభ మూలధన సన్నద్ధత వంటి తగిన వనరులను ఓఎంసీలు ధ్రువీకరించుకుంటాయి. తద్వారా కార్యకలాపాలు సమర్థవంతంగా, సురక్షితంగా సాగుతాయి.
పీఏసీఎస్ ల ద్వారా ఎల్పీజీ పంపిణీని ప్రవేశపెట్టడం వల్ల.. వంట చెరకు వంటి సాంప్రదాయక వంట పద్ధతుల స్థానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని అందించడం ద్వారా గ్రామీణ కుటుంబాలకు చేయూత లభిస్తుంది. ఆరోగ్య ప్రమాదాలను, పర్యావరణ క్షీణతను ఇది తగ్గిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం ద్వారా, వాటి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడం ద్వారా పీఏసీఎస్ లను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుంది. ఎల్పీజీ సులభంగా లభించడం, సమయం - శ్రమ ఆదా కావడం ద్వారా రైతులు నేరుగా లబ్ధి పొందుతారు. ఉత్పాదక వ్యవసాయ కార్యకలాపాల కోసం ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.
రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు.
****
(Release ID: 2086041)
Visitor Counter : 10