పర్యటక మంత్రిత్వ శాఖ
విజయవాడలో డిసెంబరు 6 నుంచి 8 వరకు కృష్ణవేణి సంగీత నీరాజనం రెండో సంచిక సంగీతం, సంస్కృతి, పర్యాటక రంగాల సమ్మేళనం
సంగీత, పర్యాటక వారసత్వాన్ని ప్రోత్సహించడం ఈ ఉత్సవాల ధ్యేయం
35 కార్యక్రమాలు.. 140 మంది ప్రతిభాన్విత కళాకారులు
Posted On:
05 DEC 2024 12:55PM by PIB Hyderabad
కృష్ణవేణి సంగీత నీరాజనం రెండో సంచికకు విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం ఆడిటోరియం ప్రధాన వేదిక కానుంది. ఈ కార్యక్రమాన్ని 2024 డిసెంబరు 6 నుంచి 8 వరకు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా కర్ణాటక సంగీతం, సాంప్రదాయక నైపుణ్యాలు, వంటకాలు ఈ ఉత్సవంలో విశేష ఆకర్షణలుగా నిలవనున్నాయి. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని అపూర్వ రీతిన ప్రదర్శించనున్న ఈ ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక, జౌళి శాఖలతోపాటు ఆంధ్రప్రదేశ్ పర్యాటక విభాగం సహకారంతో- కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది.
ఈ ఉత్సవంలో మొత్తం 35 ప్రదర్శనలు చోటుచేసుకోనున్నాయి. అనుభవజ్ఞులైన సంగీత విద్వాంసులు, వర్ధమాన కళాకారులు సహా 140 మంది ప్రతిభావంతులైన కళాకారులు ఈ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విజయవాడలో మూడు వివిధ ప్రముఖ వేదికల్లో 2024 డిసెంబరు 6 నుంచి 8 వరకు ఈ ఉత్సవం జరగనుంది. ఆ వేదికలు.. :
1. తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం: ఇది ఉత్సవ ప్రధాన వేదికగా ఉంటుంది.
2. దుర్గాఘాట్: ఇక్కడ డిసెంబరు 7 ఉదయం 8:30 గంటలకు త్యాగరాజ పంచరత్న కృతుల ఆలాపన.
3. కనక దుర్గ దేవాలయం: ఇక్కడ డిసెంబరు 8న ఉదయం 8:30 గంటలకు దేవీకృతుల కార్యక్రమం ఉంటుంది.
ప్రతి రోజూ అపురూప సంగీతానుభవాన్ని ఆస్వాదించవచ్చు:
మొదటి రోజు (డిసెంబరు 6) 11 మనోహరమైన ప్రదర్శనలు ఉంటాయి. వాటిలో నాగస్వరం, హరికథ, గాత్ర కచేరీలు, ఇంకా నామ సంకీర్తనం భాగంగా ఉంటాయి.
రెండో రోజు (డిసెంబరు 7) మరో 11 కార్యక్రమాలను సమర్పిస్తారు. పంచరత్న కృతులు, వేణుగానం తదితర కార్యక్రమాలు వీటిలో భాగంగా ఉంటాయి.
మూడో రోజు (డిసెంబరు 8) అబ్బురపరిచే 13 ప్రదర్శనలు ఉంటాయి. వీటిలో దేవీకృతులు, మాండొలిన్ కచేరీతోపాటు, త్యాగరాజ దివ్య నామ కృతులు ఉంటాయి.
దిగ్గజ తెలుగు వాగ్గేయకారుల కృతులతోపాటు, కర్ణాటక సంగీత సాహిత్య సౌరభాన్ని ఈ ఉత్సవం వెదజల్లనుంది. ఇలా చేసి, ఒకవైపు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని చాటుతూనే, మరోవైపు భారతదేశ శాస్త్రీయ సంప్రదాయాలతో ప్రేక్షక లోకాన్ని మురిపించడమే ఉత్సవం ఉద్దేశం.
ఈ సందర్భంగా అనేక మంది ఉన్నతాధికారులు పాలుపంచుకోనున్నారు. వారిలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ గోపి ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గౌరవ అతిథిగా రానున్నారు. ఈ ఉత్సవానికి హాజరయ్యే ప్రముఖుల్లో విజయవాడ పార్లమెంటు సభ్యుడు శ్రీ కేశినేని శివనాథ్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్‌లు ఉంటారు. వేదికపై ఆసీనులయ్యే వారిలో విజయవాడ సెంట్రల్ శాసన సభ్యుడు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఎన్. బాలాజి, ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్‌పర్సన్ శ్రీమతి పి. తేజస్వి, ఏపీ నాటక అకాడమి చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ, పర్యాటక మంత్రిత్వ శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీ జ్ఞాన్ భూషణ్‌లు ఉంటారు.
ఉత్సవ సంబరాల్లో భాగంగా జౌళి మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక వారసత్వ ప్రధాన ప్రదర్శనను నిర్వహించనుంది. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన మంగళగిరి కాటన్, ఉప్పాడ జమ్‌దానీ, ధర్మవరం పట్టు, పోచంపల్లి ఇక్కత్ వంటి ప్రసిద్ధిపొందిన చేనేత చీరెలు సహా జీఐ-గుర్తింపు కలిగిన ఉత్పాదనలు కొలువుదీరనున్నాయి. కొండపల్లి చెక్కబొమ్మలు, కలంకారీ చిత్రకళ, నర్సాపూర్ లేసులు, చెక్కతో చేసిన వంటింటి సామగ్రి, తోలుబొమ్మలు చూపరులకు ఈ ప్రాంతాల చేతివృత్తి కళాకారుల పనితనాన్ని గమనించే అవకాశాన్ని అందించనున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ వంటింటి సంప్రదాయాలను వివరించే ఒక ఆహార పదార్థాల స్టాల్‌ను తిరుపతిలోని ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ ఈ ఉత్సవంలో ఏర్పాటుచేయనుంది. ఇక్కడ సందర్శకులు చక్కటి ప్రాంతీయ వంటకాలు రుచి చూడవచ్చు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ టూరిజం ఒక ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటుచేసి, రాష్ట్రంలో పేరెన్నికగన్న పర్యాటక స్థలాల గురించి, చాలా మందికి తెలియని అపురూప ప్రదేశాల గురించి సమాచారాన్ని తెలియజేయనుంది.
కృష్ణవేణి సంగీత నీరాజనం ఒక ఉత్సవానికన్నా మించిన ఆకర్షణను కలిగి ఉంటుంది. ఇక్కడ సంగీతం, సంస్కృతి, పర్యాటక రంగాల పొందికైన సమ్మేళనాన్ని చూడవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదను ప్రదర్శిస్తూ ‘‘సంగీత ప్రధాన పర్యటన’’ను ప్రోత్సహించాలన్నదే ఈ ఉత్సవ ధ్యేయం. రాష్ట్రాన్ని ఒక ప్రముఖ ఆకర్షణ కేంద్రంగా నిలబెట్టాలని ఈ ఉత్సవాన్ని ఏర్పాటుచేస్తున్నారు.
మూడు రోజులపాటు జరిగే సాంస్కృతిక సంబరం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. సంగీత ప్రియులు సాంస్కృతిక కళాభిమానులు, పర్యటకులు తప్పనిసరిగా పాలుపంచుకోవలసిన సందర్భం ఇది.
మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అత్యంత వైభవంగా కళ్ళెదుట నిలిపే ఈ ఉత్సవాన్ని చూడడానికి తరలి రావలసిందిగా విజయవాడ నివాసులను, ఇతర సందర్శకులను, యాత్రికులను పర్యాటక శాఖ ఆహ్వానిస్తున్నది. ఈ ఉత్సవ కార్యక్రమాలను పర్యాటక శాఖ యూట్యూబ్ చానల్ '@ministryoftourismgoi' లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
వివరాలకు ఈ కింది లింకును చూడగలరు:
https://krishnavenimusicfest.com
***
(Release ID: 2081156)
Visitor Counter : 39