సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
పార్లమెంట్ ప్రశ్న: వయోవృద్ధుల సంక్షేమం
Posted On:
03 DEC 2024 2:07PM by PIB Hyderabad
వయో వృద్ధులకు అవసరమైన సాయం, భద్రతను అందించేందుకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అటల్ వయో అభ్యుదయ యోజన (ఏవీవైఏవై) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో ఏడు విభాగాలుంటాయి:
వయోధికులకు ఏకీకృత కార్యక్రమం (ఐపీఎస్ఆర్‌సీ): సీనియర్ సిటిజన్ హోంలు (వృద్ధాశ్రమాలు), నిరంతరం పర్యవేక్షించే కేర్ హోంలు తదితరమైన వాటిని నిర్వహిచేందుకు ప్రభుత్వేతర/స్వచ్ఛంద సేవా సంస్థలకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందిస్తుంది. నిరుపేదలైన సీనియర్ సిటిజన్లకు ఆశ్రయం కల్పించడం, పోషకాహారం, వైద్యసేవలు, వినోదం తదితరమైన సదుపాయాలను ఉచితంగా అందజేస్తారు.
సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రణాళిక (ఎస్ఏపీఎస్ఆర్‌సీ): వృద్ధుల సంక్షేమానికి ‘సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రణాళిక (ఎస్ఏపీఎస్‌ఆర్‌సీ)’ ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల స్థాయిలో ప్రణాళికను అమలు చేస్తాయి. దీని ద్వారా చేపట్టే అవగాహన కార్యక్రమాలు, కాటరాక్ట్ సర్జరీలు మొదలైనవాటికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు అందిస్తుంది.
ఎల్డర్ లైన్: టోల్ ఫ్రీ నంబర్ 14567 జాతీయ హెల్ప్ లైన్‌ను ఎల్డర్ లైన్ పేరుతో 01.10.2021న ప్రారంభించారు. సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం అందించడం, వారి సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలు, పథకాలపై అవగాహన కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రీయ వయోశ్రీ యోజన (ఆర్‌వీవై): ఈ పథకంలో భాగంగా నెల ఆదాయం రూ. 15,000కు మించని, వయసు మీద పడటం వల్ల ఎదురయ్యే వైకల్యం/బలహీనతతో ఇబ్బంది పడుతున్న సీనియర్ సిటిజన్లకు భౌతిక సహాయం, సహాయ పరికరాలు అందించి వారు సాధారణ స్థితికి వచ్చేలా తోడ్పాటు అందించే లక్ష్యంతో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ‘రాష్ట్రీయ వయోశ్రీ యోజన (ఆర్‌వీవై)’ను అమలు చేస్తోంది. ఈ పథకం 01.04.2017న ప్రారంభమైంది. ‘ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ (ఏఎల్ఐఎంసీవో)’ (సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ) ద్వారా ఈ పథకం అమలవుతోంది.
సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజిన్(ఎస్ఏజీఈ)- అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్యలకు వినూత్న పరిష్కారాల ద్వారా ఎస్ఏజీఈ పథకం ప్రోత్సాహం అందిస్తుంది. దీని ద్వారా వృద్ధుల సంక్షేమానికి అవసరమైన పరికరాలు, విధానాలను అభివృద్ధి చేసే, సేవలను అందించే అంకుర సంస్థలను గుర్తించి ప్రోత్సహిస్తారు. దీనికి అంకుర సంస్థలను ఎంపిక చేసే ప్రక్రియ పారదర్శకంగా సాగుతుంది. ఈక్విటీ రూపంలో నిధులను అందిస్తారు. సంస్థ ఈక్విటీలో 49 శాతం మించకుండా ప్రభుత్వం పెట్టుబడి అందిస్తుంది.
వృద్ధుల ఆరోగ్య సంరక్షకులకు శిక్షణ: వృద్ధుల ఆరోగ్య సేవల రంగంలో పెరుగుతున్న సంరక్షకుల డిమాండ్, సప్లైల మధ్య అంతరాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. వృద్ధులకు మరిన్ని సేవలు అందించడంతో పాటు, వృద్ధుల ఆరోగ్య సంరక్షణా రంగంలో శిక్షణ పొందిన సంరక్షకులను తయారుచేస్తారు.
సీనియర్ సిటిజన్ల కోసం అమలు చేస్తున్న ఇతర కార్యక్రమాలు: వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు దేశ వ్యాప్తంగా వివిధ పథకాలను అమలుచేస్తున్నారు.
వృద్ధుల సంక్షేమం కోసం ‘తల్లిందండ్రులు, సీనియర్ సిటిజన్ల పోషణ, సంక్షేమ చట్టం 2007 (ఎండబ్ల్యూపీఎస్‌సీ చట్టం)’ ను సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ చట్టంలోని సెక్షన్ 7, సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ హోదాకు తక్కువ కాని అధికారి నేతృత్వంలో రాజ్యాంగ ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తుంది. చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం సీనియర్ సిటిజన్ల పోషణ బాధ్యతను వారి సంతానం/బంధువులు తీసుకొనేలా లేదా బాధ్యత వహించేలా ఆదేశాలు జారీ చేయవచ్చు. సెక్షన్ 24, 25 ప్రకారం సీనియర్ సిటిజన్లకు ఆపద ఎదురయ్యే పరిస్థితుల్లో వదిలిపెట్టడం, వేధించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించి మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా ఐదువేల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు. వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా వారి పట్ల కుటుంబ సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలని ఈ నిబంధన తెలియజేస్తుంది.
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) పథకం ద్వారా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా ఆరోగ్య సేవలను విస్తరించింది. వృద్ధులకు ఆరోగ్య సేవలు అందించేందుకు గాను వృద్ధులకు ఆరోగ్య సంరక్షణకు జాతీయ కార్యక్రమం (ఎన్‌పీహెచ్‌సీఈ) పథకాన్ని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా వృద్ధులకు అందిస్తున్న సేవలు: 1. కమ్యూనిటీ ఆధారిత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విధానం, 2. పీహెచ్‌సీ/సీహెచ్‌సీ స్థాయిలో సేవలు, 3. పది పడకల వార్డులతో జిల్లా ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాల కల్పన 4. ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ప్రాంతీయ వృద్ధుల కేంద్రాలను మరింత బలోపేతం చేయడం 5. మీడియా, జానపదాలు, ఇతర మార్గాల ద్వారా సమాచారం, అవగాహన, సమాచార ప్రసారం (ఐఈసీ) 6. వృద్ధ్యాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలపై పరిశోధన, ఎన్‌పీహెచ్‌సీఈ అమలుపై నిరంతర పర్యవేక్షణ, స్వతంత్ర మూల్యాంకనం 7. 2016-17లో రాష్ట్రీయ వరిష్ట జన స్వాస్థ్య యోజనగా రూపాంతరం చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా 17 ప్రాంతీయ వృద్ధాప్య ఆరోగ్య సేవా కేంద్రాలను, రెండు జాతీయ వృద్ధాప్య కేంద్రాలను నెలకొల్పారు.
లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి శ్రీ బీఎల్ వర్మ ఈ సమాచారాన్ని లిఖిత పూర్వకంగా అందించారు.
*****
(Release ID: 2080438)
Visitor Counter : 50