ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోలీసు డైరెక్టర్ జనరళ్లు/ఇన్స్పెక్టర్ జనరళ్ల 59వ అఖిల భారత సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి

స్మార్ట్ పోలీసింగ్ మంత్రాన్ని విస్తరించిన ప్రధాని – పోలీసుల పనితీరు వ్యూహాత్మకంగా, సూక్ష్మంగా, సమయానుకూలంగా, విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండాలని పిలుపు

డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, ఏఐ కారణంగా దేశంలో ఎదురవుతున్న సవాళ్లను కృత్రిమ మేధ, ‘ఆకాంక్ష భారత్’ల ఏఐ రెట్టింపు సామర్థ్యంతో అవకాశాలుగా మలచుకొని పరిష్కరించాలని పోలీసులకు సూచన

కానిస్టేబుళ్లపై పనిభారాన్ని తగ్గించడానికి సాంకేతికతను ఉపయోగించాలని ప్రధానమంత్రి పిలుపు

‘వికసిత్ భారత్’ దృక్పథానికి అనుగుణంగా ఆధునికీకరణ దిశగా నడవాలని పోలీసులను కోరిన ప్రధానమంత్రి

కొన్ని కీలక సమస్యలను పరిష్కరిచడంలో హ్యాకథాన్ సాధించిన విజయాన్ని చర్చిస్తూ.. జాతీయ పోలీసు హ్యాకథాన్ నిర్వహణ దిశగా సమాలోచనలు జరపాలని సూచించిన ప్రధానమంత్రి

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, వామపక్ష తీవ్రవాదం, సైబర్ నేరాలు, ఆర్థిక భధ్రత, వలసలు, తీరప్రాంత భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో సహా జాతీయ భద్రతకు సవాలుగా నిలుస్తున్న పాత, కొత్త సవాళ్లపై సదస్సులో విస్తృతంగా జరిగిన చర్చలు

Posted On: 01 DEC 2024 7:49PM by PIB Hyderabad

భువనేశ్వర్లో జరిగిన పోలీసు డైరెక్టర్ జనరళ్లు/ఇన్స్పెక్టర్ జనరళ్ల 59వ అఖిల భారత సదస్సులో నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

ముగింపు కార్యక్రమంలో అత్యుత్తమ సేవలు కనబరిచిన ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులకు రాష్ట్రపతి పతకాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందజేశారు. ఈ సదస్సులో భద్రతా సవాళ్లపై జాతీయ, అంతర్జాతీయ కోణాల్లో విస్తృత స్థాయి చర్చలు జరిగాయని తన ముగింపు ప్రసంగంలో పీఎం అన్నారు. ఈ చర్చల నుంచి ఉద్భవించిన ప్రతివ్యూహాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

తన ప్రసంగంలో డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, ఏఐ సాంకేతికత వల్ల ఎదురవుతున్న పెను సమస్యల పట్ల ముఖ్యంగా డీప్ ఫేక్ కారణంగా సామాజిక, కుటుంబ సంబంధాలపై పడుతున్న ప్రభావంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా కృత్రిమ మేధ, ‘ఆకాంక్షాత్మక భారత్’ల ఏఐ రెట్టింపు శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా ఈ సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని పరిష్కరించాలని పోలీసు నాయకత్వానికి సూచించారు.

స్మార్ట్ పోలీసింగ్ మంత్రాన్ని విస్తరించిన ప్రధాని, పోలీసుల పనితీరు వ్యూహాత్మకంగా, సూక్ష్మంగా, సమయానుకూలంగా, విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండాలని పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంత పోలీసింగ్‌లో చేపట్టిన కార్యక్రమాలను మెచ్చుకుంటూ, వాటిని క్రోడీకరించి 100 నగరాల్లో పూర్తిగా అమలు చేయాలని సూచించారు. కానిస్టేబుళ్లపై పని ఒత్తిడి తగ్గిండానికి సాంకేతికతను ఉపయోగించుకోవాలని, వనరుల కేటాయింపునకు పోలీస్ స్టేషన్ ప్రధాన కేంద్ర బిందువుగా మారాలని సూచించారు.

కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో హ్యాకథాన్‌లు సాధించిన విజయాన్ని చర్చిస్తూ, నేషనల్ పోలీస్ హ్యాకథాన్ను నిర్వహించే దిశగా సమాలోచనలు జరపాలని ప్రధానమంత్రి సూచించారు. అలాగే ఓడరేవుల భద్రతపై ప్రధాన దృష్టి సారించి దానికోసం భవిష్యత్ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన అసమానమైన సేవలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. వచ్చే ఏడాది సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా హోంమంత్రిత్వ శాఖ నుంచి పోలీసు స్టేషన్ వరకు మొత్తం భద్రతా వ్యవస్థలో పోలీసు స్థాయిని, వృత్తి నైపుణ్యాన్ని, సామర్థ్యాలను మెరుగుపరిచేలా ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించడం ద్వారా ఆయనకు నివాళులు అర్పించాలని సూచించారు. వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా పోలీసులు ఆధునికీకరణ దిశగా నడిచి, తమను తాము తీర్చిదిద్దుకోవాలని కోరారు.

సదస్సులో భాగంగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, వామపక్ష తీవ్రవాదం, సైబర్ నేరాలు, ఆర్థిక భద్రత, వలసలు, తీరప్రాంత భ్రదత, మాదక ద్రవ్యాల అక్రమరవాణా సహా ఇప్పటికే ఉన్న, కొత్తగా పుట్టుకొస్తున్న భద్రతాపరమైన సవాళ్లపై విస్తృత చర్చలు జరిగాయి. బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వెంట ఎదురవుతున్న భద్రతా సమస్యలు, పట్టణ పోలీసింగ్, హానికరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి పాటించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై సైతం చర్చించారు. అలాగే ఇటీవలే అమల్లోకి వచ్చిన  ప్రధాన క్రిమినల్ చట్టాలు, కార్యక్రమాలు, పోలీసింగ్‌లో అమలు పరచాల్సిన ఉత్తమ పద్ధతులతో పాటు పొరుగుదేశాల భధ్రతాపరిస్థితులపై చర్చలు జరిగాయి. ఈ సమయంలో ప్రధానమంత్రి తన విలువైన ఆలోచనలను, భవిష్యత్తుకు ప్రణాళికను అందించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు, హోం శాఖ సహాయ మంత్రి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి హాజరయ్యారు. హైబ్రిడ్ విధానంలో జరిగిన ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, ఐజీపీలు, సీఏపీఎఫ్/సీపీవో ప్రధానాధికారులు వ్యక్తిగతంగా హాజరవగా, వివిధ ర్యాంకులకు చెందిన 750 మంది అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు.


(Release ID: 2079617) Visitor Counter : 24