రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతీయ రైల్వేలకు చెందిన మూడు మల్టీట్రాక్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోద ముద్ర:


అనుసంధానాన్ని కల్పించడం, ప్రయాణ సౌలభ్యానికి బాట పరచడం, లాజిస్టిక్స్ ఖర్చులను,

చమురు దిగుమతులను తగ్గించడం,

వాతావరణంలోకి CO2 విడుదల స్థాయిలను తగ్గించడం ఈ ప్రాజెక్టుల లక్ష్యం


ఈ ప్రాజెక్టులతో ఇప్పుడున్న రైలు మార్గాల సామర్థ్యం, రవాణా నెట్‌వర్క్‌లలో వృద్ధి;
ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ సామర్థ్యంలో మెరుగుదల;

ఫలితంగా సరఫరా వ్యవస్థలో చిక్కులు తొలగి, ఆర్థిక వృద్ధికి రెక్కలు

ఈ మూడు ప్రాజెక్టులకు దాదాపుగా రూ.7,927 కోట్లు ఖర్చు అంచనా;

నాలుగేళ్ళలో ఈ ప్రాజెక్టుల నిర్మాణం కొలిక్కి


ఈ ప్రాజెక్టుల నిర్మాణ కాలంలో సుమారు ఒక లక్ష మానవ దినాల పాటు ప్రత్యక్ష ఉపాధికల్పన

Posted On: 25 NOV 2024 8:53PM by PIB Hyderabad

 

సుమారు రూ.7,927 కోట్ల ఖర్చుతో రైల్వేల మంత్రిత్వ శాఖ తలపెట్టిన మూడు ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఈ రోజు ఆమోదాన్ని తెలిపింది.

ఆ ప్రాజెక్టులు ఏవేవి అంటే:

    i.             జల్‌గాఁవ్ – మన్‌మాడ్ నాలుగో లైను (160 కిలోమీటర్లు)

ii.            భుసావల్ – ఖండ్‌వా మూడో, నాలుగో లైన్లు (131 కి.మీ.)

 iii.            ప్రయాగ్‌రాజ్ (ఇరాదత్‌గంజ్) – మాణిక్‌పూర్ మూడో లైను (84 కి.మీ.) లు ఉన్నాయి.

ప్రతిపాదించిన బహుళ మార్గ ప్రాజెక్టులు రైళ్ల రాకపోకల్లో ఒత్తిడిని సడలించి, రద్దీని తగ్గించనున్నాయి.  చాలా రైళ్ళు ఎప్పుడూ రాకపోకలు జరిపే ముంబయి-ప్రయాగ్‌రాజ్ సెక్షన్‌లలో ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ ప్రాజెక్టులు సమకూర్చనున్నాయి.

ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలనూ, స్వతంత్రోపాధి అవకాశాలనూ పెంచుతూ, సమగ్రాభివృద్ధిని సాధించాలన్న ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోదీ జీ ప్రవచించిన ‘న్యూ ఇండియా’ దార్శనికతను ఈ ప్రాజెక్టులు సాకారం చేయనున్నాయి.

 ప్రజా రవాణాతోపాటే వస్తువుల, సేవల రవాణాకు ఎలాంటి అంతరాయాలు ఎదురవని తరహాలో రాక,పోకలను అందిస్తూ ఏకీకృత ప్రణాళిక ద్వారా బహుళ విధ సంధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించిన పీఎమ్-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో ఈ ప్రాజెక్టులు ఒక భాగం అని చెప్పాలి.

 మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్.. ఈ మూడు రాష్ట్రాల్లో  ఏడు జిల్లాల మీదుగా సాగే ఈ మూడు ప్రాజెక్టులు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను దాదాపుగా 639 కి.మీ. మేరకు విస్తరించనున్నాయి.  అభివృద్ధి చెందాలని తపిస్తున్న రెండు జిల్లాలు.. ఖండ్‌వా, చిత్రకూట్ ల పరిధిలో రమారమి 1,319 గ్రామాలలో దాదాపు 38 లక్షల మంది ప్రజలకు ఈ మల్టి-ట్రాకింగ్ ప్రాజెక్టులు సంధాన సేవలను పెంపొందింపచేయనున్నాయి.

ఈ ప్రాజెక్టులు ప్రయాణికులకు అదనపు రైళ్ళను అందుబాటులోకి తీసుకువస్తూ ముంబయి-ప్రయాగ్‌రాజ్- వారణాసి మార్గంలో సంధానాన్ని వర్ధిల్లచేయనున్నాయి.  ఫలితంగా ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, గయ, షిర్డీ వంటి ధార్మిక స్థలాలే కాక వారణాసి లోని కాశీ విశ్వనాథ్, ఖండ్‌వాలో ఓంకారేశ్వర్, నాసిక్ లో త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాల దర్శనానికి  బయలుదేరే తీర్థయాత్రికులు లాభపడతారు.  అంతేకాకుండా యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలు ఖజురాహో, అజంతా - ఎల్లోరా గుహలు, దేవగిరి కోట, ఆసీర్‌గఢ్ కోట, రీవా కోట, యవల్ వన్యప్రాణి అభయారణ్యం, కియోటీ జలపాతం, పుర్వా జలపాతం వంటి వివిధ పర్యాటక ఆకర్షణ కేంద్రాలకు మెరుగైన సంధానం ఏర్పడి పర్యటన రంగానికి ఊతం అందనుంది.

ఈ మార్గాలు వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, బొగ్గు, ఉక్కు, సిమెంటు ఇతరత్రా సరుకుల రవాణాకు కూడా అతి ప్రధాన మార్గాలు.  సామర్థ్యాన్ని పెంచే పనులను పూర్తి చేయడమంటూ జరిగితే, ప్రతి ఒక్క సంవత్సరంలో అదనంగా 51 మిలియన్ టన్నుల (ఎమ్‌టీ) మేరకు సరకును చేరవేయడానికి వీలవుతుంది.  రైల్వేలు పర్యావరణ మిత్రపూర్వకమైన మాధ్యమం కావడంవల్లనూ, ఇంధనవనరులు మరీ అంత ఎక్కువగా ఖర్చు  అయ్యే అవకాశం లేకపోవడం వల్లనూ ఒక వైపు దేశానికి వస్తు రవాణా కయ్యే ఖర్చులు గణనీయంగా తగ్గడం, మరో వైపు వాతావరణ మార్పు లక్ష్యాల సాధనకు కూడా ఈ ప్రాజెక్టులు తోడ్పడనున్నాయి.  వాతావరణంలోకి కర్బన ఉద్గారాల తీవ్రత ను 271 కోట్ల కిలో గ్రాములకు తగ్గించడంలో ఈ ప్రాజెక్టులు దోహదం చేయనున్నాయి. మరో మాటలో  చెప్పాలంటే, ఇది 11 కోట్ల మొక్కలను పెంచినందువల్ల పర్యావరణానికి ఒనగూరే ప్రయోజనంతో సమానమన్న మాట. 

****


(Release ID: 2077526) Visitor Counter : 45