సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇఫీ 2024: గ్రాఫికల్ కోతీ, సంగీతం, మ్యాజిక్: ప్రేక్షకుల్ని సంభ్రమానికి గురిచేసిన ‘బెటర్ మ్యాన్’
‘బెటర్ మ్యాన్’ చూపించే జీవితపు సంక్లిష్టతలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనీ,
సంగీతం, ఇచ్చిన మెసేజ్ ద్వారా స్ఫూర్తి పొందుతారనీ ఆశిస్తున్నా: పాల్ కర్రీ
‘‘మీరు జారిపోయే మంచు మీద స్కేటింగ్ చేస్తే... మీరు డ్యాన్సు కూడా చేస్తారు’’. ఇన్స్ స్టాగ్రామ్ లో దర్శకుడు మైఖేల్ గ్రేసీ చెప్పిన ఈ మాటలతో... బెటర్ మ్యాన్ 55వ భారత చలన చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్న తొలి సినిమాగా తన దైన ముద్రను వేయడమే కాకుండా, ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులతో కూడిన స్పందనను అందుకుంది. గ్రాఫిక్స్ కోతిని ప్రధాన పాత్రగా చేసి ఓ ప్రముఖ సంగీతకారుడు రాబీ విలియమ్స్ పాక్షిక జీవిత చరిత్రకు దృశ్యరూపమివ్వడం ఒక అనూహ్య ప్రయోగం.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్రానికి సంబంధించిన విశేషాలను నిర్మాత పాల్ కర్రీ వెల్లడించారు. ‘‘నిజాయితీతో ఒక భిన్నమైన సినిమా చెయ్యాలని మేం భావించాం. రాబీ విలియమ్స్ వంటి ప్రముఖుడిని కోతి రూపంలోకి తీసుకోవడం, ఒక జంతువు మనిషిగా మారేందుకు ప్రయత్నించడం... నిజానికి బాగుండదు. పైగా ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లు కూడా. కానీ దేనికీ భయపడకుండా, మునుపెన్నడూ సాధించనిది మేం సాధించాం. కష్టాలను పక్కన పెడితే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబడుతోంది’’ అన్నారు కర్రీ.
బెటర్ మ్యాన్.. కేవలం ఒక మ్యూజికల్ బయోపిక్ కాదు... అంతకు మించి అందులో చాలా ఉందన్నారు... కర్రీ. తనను తాను తెలుసుకోవడం దగ్గర నుంచీ మనిషి మనుగడ గురించిన గొప్ప కథ అందులో ఉందన్నారు. అడ్డంకుల నుంచి తప్పించుకోవడంలో దాగిన మజా ఉందనీ, మనిషిలో దాగిన మనిషిని మనం కౌగిలించుకోవడం వంటిదనీ, సంగీతంతోపాటు కల్పిత ప్రపంచంలో సాగిపోయే గొప్ప ప్రయాణమని ఆయన అన్నారు. విజువల్ అఫెక్టులను రూపొందించేందుకు వందల మంది కళాకారులు కష్టపడ్డారని తెలిపారు.
సంగీతాన్నీ, నృత్యాన్నీ, సినిమాటోగ్రఫీని పడుగుపేకల్లా కలిపేస్తూ ‘‘షాట్స్ చిత్రీకరణలో అతనో మాస్టర్’’ అంటూ దర్శకుడు మైఖేల్ గ్రేసీ కళా నైపుణ్యాన్ని నిర్మాత కర్రీ మెచ్చుకున్నారు. ‘‘రాబీ విలియమ్స్ నిజ జీవితంలో స్నేహితుడు- మైఖేల్. అందువల్ల ఇది సినిమాకు చిక్కదనాన్నీ, ఆధిక్యతనూ తెచ్చిపెట్టింది. ఇవన్నీ కలిసి బెటర్ మ్యాన్ సినిమాను కథ అనడం కంటే అంతకు మించినదనే చెప్పాలి. ఒక జఠిలమైన వ్యక్తి కథను గొప్పగా రక్తికట్టించిన సందర్భం... అని కర్రీ చెప్పారు.
ప్రధాన కథానాయకుడి ప్రేమికురాలిగా నటించిన రాచెల్లీ బానో కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.
‘‘పేరు ప్రతిష్ఠలు తెచ్చుకుంటున్న ఒక యువకుడి అంతఃసంఘర్షణ... ఒక నటిగా ఈ కథతో నేను మమేకం అయ్యాను. రాబీ విలియమ్స్ సంగీతానికి చెందిన మేధావిగా కాకుండా, సహజంగా మనందరం ఎదుర్కొనే ఘర్షణ ఇందులో ఉంది. మనం ఎక్కడ నుంచైనా వచ్చి ఉండొచ్చు. కానీ ఆయా పాత్రల్లో మనం కనిపిస్తాం’’ అని బానో వివరించారు. ‘‘ఇండియా, ఆస్ట్రేలియా, లేదా ప్రపంచంలోని ఏ దేశమైనా కావొచ్చు, ఈ సినిమాలో హీరో ప్రయాణం.. సార్వజనీనం. బెటర్ మ్యాన్ లో చూపించే జీవితపు సంక్లిష్టతలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సంగీతం, సినిమా అందించే మెసేజ్ .. స్ఫూర్తిని అందిస్తాయి’’ అని అన్నారు నిర్మాత కర్రీ.
ఇఫీ 2024 చిత్రోత్సవం ప్రారంభ సినిమాగా బెటర్ మ్యాన్.. చిత్రోత్సవానికే హైలైట్ గా నిలిచింది. కాన్సెప్ట్, ఆకట్టుకునే దృశ్యాలే కాకుండా, భావోద్వేగాల పరంగానూ ఈ సినిమా భిన్నమైన శైలిలో సాగిన కథనంగా నిలిచింది. సంప్రదాయాలను సవాలు చేయడంతోపాటు, భిన్నమైన ఆలోచనలకు అద్దం పడుతుంది - బెటర్ మ్యాన్.
(Release ID: 2076354)
Visitor Counter : 7