సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
10 NOV 2024 4:13PM by PIB Hyderabad
పింఛనుదారులు డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకుని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల (డీఎల్ సీ)లను దాఖలు చేసేందుకు దేశవ్యాప్తంగా ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (డీఎల్ సీ) కాంపెయిన్ 3.0’ను పింఛను, పింఛనుదారుల సంక్షేమ విభాగం (డీఓపీపీడబ్ల్యూ) నిర్వహిస్తోంది.
పింఛనుదారులు జీవించి ఉన్నట్లుగా ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయడానికి డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకునే వీలు ఉండాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించిన మేరకు ‘జీవన్ ప్రమాణ్’ను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
డీఎల్ సీ కాంపెయిన్ 3.0ను ఈ సంవత్సరంలో నవంబరు 1 నుంచి నవంబరు 30 వరకు మన దేశంలో 800 నగరాలు, పట్టణాల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రచార ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల, ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ ఓ), స్వతంత్రప్రతిపత్తి సంస్థల పింఛనుదారులంతా వారి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను పింఛను అందిస్తున్న బ్యాంకుల్లోగానీ లేదా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ)లో గాని సమర్పించవచ్చును.
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం 80 ఏళ్లు లేదా అంతకు మించిన వయస్సు కలిగిన సూపర్ సీనియర్ పెన్షనర్లు వారి ఇంట్లో నుంచే డీఎల్ సీని సమర్పించేందుకు అవకాశం ఉంది. వారికి ఇంటి వద్దే సేవల్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం పింఛనుదారులకు పింఛనును అందజేస్తున్న అన్ని బ్యాంకులు, సీజీడీఏ, ఐపీపీబీ, యూఐడీఏఐ.. డీఎల్ సీ ప్రచార ఉద్యమాన్ని దేశం అంతటా అమలుపరచడానికి కలిసికట్టుగా ముందుకు వచ్చి కృషి చేయనున్నాయి.
ప్రచార ఉద్యమంలో భాగంగా, డీఎల్ సీ మెగా శిబిరాన్ని రక్షణ మంత్రిత్వ శాఖలోని సీజీడీఏ సమన్వయంతో హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ డీఎల్ సీ ప్రచార ఉద్యమ పురోగతి క్రమాన్ని సమీక్షించడానికి కార్యదర్శి (పింఛనులు) శ్రీ వి. శ్రీనివాస్ అధ్యక్షతన పింఛను, పింఛనుదారుల సంక్షేమ విభాగానికి (డీఓపీపీడబ్ల్యూ) చెందిన బృందం ఈ నెల 12న హైదరాబాదుకు రానుంది. ఈ సందర్భంగా రక్షణ శాఖ అధికారులు, బ్యాంకుల అధికారులు, పింఛనుదారులు, నమోదైన పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు అంటే, జనరల్ ఆఫీసెస్ పెన్షనర్స్ అసోసియేషన్ (హైదరాబాద్, తెలంగాణ), ఐఎస్ఆర్ఓ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరమ్ (ఐఆర్ఈఎఫ్.. హైదరాబాద్, తెలంగాణ), ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడరేషన్ (సికిందరాబాద్, తెలంగాణ)ల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం కూడా ఉంటుంది.
పింఛనుదారులు ఆధార్ వివరాలను సరి చేయడానికీ, ఇందుకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు, సాంకేతిక సమస్యలు ఎదురైతే వాటిని చక్కదిద్దడానికి యూఐడీఎఐకి అధికారులు కూడాఈ శిబిరంలో పాలుపంచుకోనుంది.
ఈ కార్యక్రమానికి సీజీడీఏ, కమాండెంట్ ఎమ్ సీఈఎమ్ఈ, ఈఎమ్ఈ సేనాదళాల కల్నల్ కమాండెంట్ లతో పాటు టీఏఎస్ఏ కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వంటి రక్షణ శాఖ కు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా వచ్చి, పింఛనుదారులతో మాట్లాడనున్నారు.
డీఎల్ సీ దాఖలుకు ప్రవేశపెట్టిన ముఖ ప్రమాణీకరణ (ఫేస్ ఆథెంటికేషన్) ను ఉపయోగించుకొనే పద్ధతిని మారుమూల ప్రాంతాలలోని పింఛనుదారులకు కూడా అందుబాటులోకి తీసుకు పోయి, ఆ పద్ధతిని వారు అర్థం చేసుకొని వారి ఇళ్ల నుంచే అనుసరించేలా చేయడానికే ఈ ప్రచార ఉద్యమాన్ని తలపెట్టారు. డిజిటల్ పద్ధతులను ఉపయోగించుకొంటే, పింఛనుదారులు వారి లైఫ్ సర్టిఫికెట్లను ఏ సమయంలో అయినా, ఎక్కడ నుంచి అయినా సరే దాఖలు చేయగలుగుతారు. ఇది పింఛనుదారులకు, మరీ ముఖ్యంగా వయస్సు మీద పడ్డ వాళ్లకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ, దివ్యాంగ పింఛనుదారులకు ఇది ఉపయోగపడుతుంది.
ఈ తరహా శిబిరాలను తెలంగాణలోని 35 నగరాలు, జిల్లాల్లో మొత్తం 60 చోట్ల నిర్వహించే అవకాశం ఉంది. దాదాపు 50 మంది ఉన్నత స్థాయి అధికారులు తెలంగాణ నిర్వహిస్తున్న ప్రచార ఉద్యమంలో పాల్గొంటున్నారు. తెలంగాణలో 80,000 మందికి పైగా పింఛనుదారులు బ్యాంకుల నుంచి పింఛనును అందుకొంటున్నారు. సీజీడీఏ తన వంతుగా తెలంగాణలోను, ఆంధ్ర ప్రదేశ్ లోను వివిధ స్థానాలలో 73,000 మందికి పైగా పింఛనుదారుల కోసం ఎస్ పీఏఆర్ఎస్ హెచ్ (‘స్పర్శ్’) పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
ఈ ప్రచార ఉద్యమాన్ని దేశమంతటా విజయవంతం చేయడానికి పింఛను మరియు పింఛనుదారుల సంక్షేమ విభాగం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.
***