కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జి సేవల ప్రారంభంతో దేశంలోని
మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులోకి వచ్చిన హై-స్పీడ్ సేవలు
‘ఆత్మ నిర్భర్ భారత్’ కింద దేశవ్యాప్తంగా 50,000 ప్రాంతాలకు అనుసంధానత
Posted On:
30 OCT 2024 5:34PM by PIB Hyderabad
దేశంలో డిజిటల్ అనుసంధానాన్ని మెరుగుపరచాలన్న లక్ష్యానికి అనుగుణంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దేశవ్యాప్తంగా 50,000కు పైగా ప్రాంతాలకు స్వదేశీ 4జి సేవలను విస్తరించింది. ప్రభుత్వ ‘ఆత్మ నిర్భర్ పథకం’ ద్వారా ఈ ఘనత సాధ్యమయ్యింది. దేశీయ సాంకేతికత దేశ అనుసంధాన అవసరాలను తీర్చగలదని నిరూపించిన ఈ విజయంలో బీఎస్ఎన్ఎల్ కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), తేజస్ నెట్వర్క్స్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీ-డాట్), ఐటీఐ వంటి ప్రముఖ సంస్థలు సహకారం అందించాయి. సాంకేతికతపరంగా, సంపూర్ణ దేశీయ రూపకల్పన, అభివృద్ధి, కార్యాచరణ వల్ల, బీఎస్ఎన్ఎల్ 4జి సేవలు “పూర్ణ స్వదేశీ” ఆశయాన్ని ప్రతిబింబిస్తూ, భారత్ టెలికాం రంగంలో నూతన అధ్యాయానికి తెర తీశాయి.
అక్టోబర్ 29 నాటికి, బీఎస్ఎన్ఎల్ సుమారు 50,000 ప్రాంతాల్లో సేవల్ని అందించాలని భావించగా, ఇప్పటికే 41,000 ప్రాంతాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. వీటిల్లో, IX.2 దశ కింద 36,747 కేంద్రాలను నెలకొల్పగా, డిజిటల్ భారత్ నిధి ఫండ్ (ఒకప్పటి యూఎస్ఓఎఫ్) సహకారంతో 5,000 ప్రాంతాల్లో 4జి సాచ్యురేషన్ ప్రాజెక్టులను నెలకొల్పారు. మొత్తం 1,00,000 4జి సైట్లు నెలకొల్పాలన్న బీఎస్ఎన్ఎల్ లక్ష్యానికి, సేవల శీఘ్రతర ప్రారంభం బలాన్నిస్తోంది. వేగంగా విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్ సేవా వ్యవస్థకు తాజా పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
బీఎస్ఎన్ఎల్ సంస్థ ఈ ఏడాది జూలై నాటికి 15,000 ప్రాంతాలకు తన సేవలను విస్తరించింది. గత మూడు మాసాల్లో, మరో 25,000 ప్రాంతాలకు 4జి సేవల్ని విస్తరించింది. యావత్తు దేశాన్నీ అనుసంధించాలన్న బీఎస్ఎన్ఎల్ నిబద్ధతకూ, స్వదేశీ సాంకేతికత ప్రభావానికీ ఈ విస్తరణ తార్కాణంగా నిలుస్తోంది.
(Release ID: 2069805)
Visitor Counter : 77