వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎం గతిశక్తి ఆధ్వర్యంలోని నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ 82వ సమావేశంలో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మూల్యాంకనం


రైలు, రోడ్డు ప్రాజెక్టులను సమీక్షించిన ఎన్‌పీజీ

Posted On: 29 OCT 2024 10:23AM by PIB Hyderabad

పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగమైన నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్‌పీజీ) 82వ సమావేశం ఈ నెల 24న జరిగింది. ఈ కార్యక్రమానికి పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) అదనపు కార్యదర్శి శ్రీ రాజీవ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షత వహించారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టులను ప్రతిపాదించిన వర్గాలతో పాటు, భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్ (బీఐఎస్ఏజీ-ఎన్)కు చెందిన ప్రతినిధులు, సంబంధిత రాష్ట్రాల నోడల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఎం గతిశక్తి జాతీయ సమగ్ర ప్రణాళిక (పీఎంజీఎస్ఎన్‌ఎంపీ)కు అనుగుణంగా బహుళ విధ పద్ధతుల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, సరకు రవాణా సామర్థ్యాన్ని పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించారు.

పీఎం గతిశక్తి సిద్ధాంతాలకు అనుగుణంగా వివిధ రకాల మౌలిక సదుపాయాలు, ఆర్థిక, సామాజిక కేంద్రాలకు రవాణా మార్గాలు, వివిధ రవాణా వ్యవస్థల మధ్య సమన్వయంతో సహా మొత్తం ఏడు ప్రాజెక్టులను ఏకకాలంలో అమలు చేయడంపై ఎన్‌పీజీ సమీక్షించింది. సరకు రవాణా సామర్థ్యాలను పెంచడం, ప్రయాణ సమయాలను తగ్గించడం, సేవలు అందిస్తున్న ప్రాంతాలకు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు అందించడం ద్వారా ఈ ప్రాజెక్టులు జాతీయ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుల విలువ, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వివరంగా:

ఎ. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రాజెక్టులు (ఎంవోఆర్)

1. ఝార్సుగూడ నుంచి సాసన్ వరకు 3, 4 రైల్వే లైన్లు, ఒడిశా

ఝార్సుగూడ-సంబల్పూర్ సెక్షన్ మధ్య మొత్తం 64 కి.మీ.ల మేర ఈ రైల్వేలైనును విస్తరిస్తారు. ఒడిశా పారిశ్రామిక కారిడార్‌లోని కీలక ప్రాంతాలైన తాల్చేర్ బొగ్గు గనులు, ఐబీ వ్యాలీ (సుందర్ ఘడ్)లను కలుపుకొని దీన్ని విస్తరిస్తారు. 2027 నాటికి బొగ్గు రవాణా సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలన్న ‘మిషన్ 3000 ఎంటీ’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ప్రాజెక్టు సహకరిస్తుంది. ఇది సరకు రవాణా వ్యవస్థ సామర్థ్యాన్ని, రవాణా సదుపాయాలను పెంచేందుకు దోహదపడుతుంది. ఈ ఇంధన కారిడార్ ఝార్సుగూడ, రెంగాలి, లపంగాల్లోని పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానిస్తుంది. నౌకాఎగుమతులు, దిగుమతుల కోసం పారదీప్, ధమ్రా నౌశాశ్రయాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. బహుళ విధ రవాణా మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ఈ మార్గం పీఎం గతిశక్తితో అనుసంధానమైంది. రెంగలి, లపంగా, బృందామాల్ లోని గిడ్డంగులను, 49వ జాతీయ రహదారి, 10వ రాష్ట్ర రహదారులను కలుపుతుంది.

2. సంబల్‌పూర్ నుంచి జర్పాడా రైల్వే మార్గం(3, 4 లైన్లు), ఒడిశా

ఒడిశా పారిశ్రామిక ప్రాంతంలోని ఐబీ వ్యాలీ, తాల్చేర్ బొగ్గు గనులతో సహా బొగ్గు సరఫరా వ్యవస్థలో కీలక మార్గంగా సంబల్‌పూర్, జర్పాడా మధ్య 127.2 కి.మీ. మేర ఈ రైల్వే మార్గం విస్తరణ జరుగుతుంది. 2027 నాటికి బొగ్గు రవాణా సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలన్న ‘మిషన్ 3000 ఎంటీ’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ప్రాజెక్టు సహకరిస్తుంది. ఝార్సుగూడ, లపంగా, రెంగలి, పారాదీప్‌లోని ప్రధాన అల్యూమినియం ఉత్పత్తి కర్మాగారాలతో సహా ప్రధాన పారిశ్రామిక క్లస్టర్లు ఈ రైలు మార్గం ద్వారా ప్రయోజనం పొందుతాయి. పారదీప్, ధమ్రా నౌకాశ్రయాలకు ఈ రైలు మార్గం అనుసంధానమై, ఎలాంటి అవరోధాలు లేని బహుళ విధ రవాణా వ్యవస్థను అందించి ప్రాంతీయంగా ఇంధన రంగాన్ని బలోపేతం చేస్తుంది. పీఎం గతిశక్తి నియమాలకు అనుగుణంగా విస్తృత పారిశ్రామిక ప్రయోజనాలకోసం ఈ ప్రాజెక్టును ఎన్‌హెచ్-55, ఎన్‌హెచ్-53కి అనుసంధానమవడం ద్వారా రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది.

3. తిరుపతి-కాట్పాడి డబుల్ లైన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు

మొత్తం 104.39 కి.మీల మేర విస్తరించే ఈ ప్రాజెక్ట్ తిరుపతి, కాట్పాడి మధ్య రైలు మార్గాన్ని మెరుగుపరుస్తుంది. ప్రస్తుతమున్న సింగిల్ లైన్ సెక్షన్‌లో ఎదురవుతున్న అడ్డంకులను తగ్గించి, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తుంది. ప్రధానమైన పారిశ్రామిక ప్రాంతాల మీదుగా  వెళుతున్న ఈ కారిడార్‌లో రేణిగుంట సమీపంలోని రెండు పారిశ్రామిక పార్కులు (తిరుపతి నుండి సుమారు 15 కి.మీ), ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) (తిరుపతి నుంచి 85 కి.మీ) ఉన్నాయి. ఈ ప్రాంతంలో ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రంగా ఉన్న సెజ్‌లో అనేక ఎగుమతి-ఆధారిత యూనిట్లు నిర్వహిస్తున్నారు. చిత్తూరు సమీపంలో గ్రానైట్ పరిశ్రమకు రేణిగుంట సమీపంలో ఉండటం వల్ల మెరుగైన సరుకు రవాణాకు అవకాశాలను అందిస్తుంది. అదనంగా, ఈ ప్రాజెక్ట్ పీఎం గతిశక్తి నియమావళికి అనుగుణంగా కృష్ణపట్నం (తిరుపతి నుంచి  104 కి.మీ), చెన్నై పోర్టు (తిరుపతి నుంచి 140 కి.మీ) ఓడ రేవులకు రవాణా సౌకర్యాలను  పెంపొంది స్తుంది. తద్వారా ప్రయాణీకులను, వస్తువులను గమ్యస్థానాలకు సులభంగా తరలించవచ్చు. ఫలితంగా పర్యాటకం, స్థానిక పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి.

4. జార్ఖండ్ రాష్ట్రంలో రైల్వే లైన్ల డబ్లింగ్ పనుల నిమిత్తం రెండు ప్రాజెక్టులు

(i) కొడెర్మ-అరిగడ రైల్వే లైన్

(ii) శివపూర్-కథౌటియా రైల్వే లైన్

జార్ఖండ్ రాష్ట్రంలోని కొడెర్మ-అరిగడ, శివపూర్-కథౌటియా డబ్లింగ్ పనులను వరుసగా 133.38 కి.మీ, 49.08 కి.మీ. మేర విస్తరించే ఈ ప్రాజెక్టు, బొగ్గు రవాణా చేసే కీలక ప్రాంతాలలో సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారిస్తుంది. రవాణా వ్యవస్థలో ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించి, సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకున్న పరిష్కారాలను ఎన్‌పీజీ చర్చించింది. అలాగే సరుకు రవాణాతో పాటు, ఈ ప్రాంతానికి చేకూరే ఆర్థిక ప్రయోజనాలలో పెరుగుదలను అంచనా వేసింది.

బి. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ(ఎంవోఆర్‌టీహెచ్) చేపడుతున్న ప్రాజెక్టులు

1. ప్రయాగ్‌రాజ్-జౌన్పూర్-ఆజామ్‌ఘడ్-దోహ్రిఘాట్-గోరఖ్పూర్ రహదారి, ఉత్తరప్రదేశ్

ప్రయాగ్‌రాజ్, జౌన్పూర్, ఆజామ్‌ఘడ్, దోహ్రిఘాట్, గోరఖ్పూర్ నగరాల్లో  కొత్త, ప్రస్తుత ప్రాంతాలను అనుసంధానిస్తూ 144 కి.మీ. మేర ఈ ప్రాజెక్టు చేపడతారు. కీలక పట్టణాల్లో బైపాస్‌ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ రద్దీని తగ్గించి, సరకు, ప్రయాణీకుల రవాణాను సులభతరం చేయడమే లక్ష్యంగా నిర్దేశించారు. వివిధ పద్ధతుల్లోని రవాణా సౌకర్యాలకు మెరుగురచి, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా త్వరితగతిన భూసేకరణ చేపట్టి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పీఎం గతిశక్తి నియమాలను అనుసరిస్తారు.

2. ఘాజీపూర్ - సయ్యద్ రాజా రోడ్ సెక్షన్, ఉత్తర ప్రదేశ్

41.53 కి.మీ మేర కొత్త ప్రాంతాలకు సమాంతరంగా రూపొందించిన ఈ కారిడార్ ఘాజీపూర్‌ను, వ్యూహాత్మక రవాణా హబ్‌లతో అనుసంధానించి ఆర్థిక మండళ్లకు సరకు రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తుంది. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీసీఐఎల్), పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఘాజీపూర్ సిటీ లాంటి రైల్వే స్టేషన్లు, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ద్వారా విమానయానం తదితర రవాణా మార్గాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. అదనంగా, ఎన్‌హెచ్-19 ద్వారా వారణాసి ఇన్‌ల్యాండ్ వాటర్‌వే టెర్మినల్ ప్రత్యామ్నాయ సరకు రవాణా మార్గంగా పనిచేస్తుంది. ఈ ప్రాంతంలో వాణిజ్యాన్ని క్రమబద్ధీకరించేందుకు, రవాణా ఖర్చులను తగ్గించడానికి పీఎం గతిశక్తి నియమావళికి అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుంది.

ఈ ప్రాజెక్టులు పూర్తయిన పిమ్మట, భారతీయ మౌలిక వసతుల వ్యవస్థను మెరుగుపరిచేందుకు దోహదపడతాయి. అవరోధాలు లేని రవాణా సౌకర్యాల ప్రయోజనాలు ప్రతి ప్రాంతానికి లభిస్తాయి. భిన్నతరహా రవాణా వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా, క్లిష్టమైన మౌలిక సదుపాయాల మధ్య అంతరాలను తొలగించడం ద్వారా, ఈ ప్రాజెక్టులు సమగ్రమైన, స్థిరమైన అభివృద్ధి దిశగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తాయి.



 

****




(Release ID: 2069673) Visitor Counter : 25


Read this release in: English , Urdu , Hindi , Tamil