భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం పరిశ్రమ-విద్యా భాగస్వామ్యాన్ని

వేగవంతం చేయడంపై చర్చించిన పీఎం-ఎస్‌టీఐఏసీ 26వ సమావేశం

Posted On: 18 OCT 2024 6:49PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ నేతృత్వంలో ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ (పీఎం-ఎస్‌టీఐఏసీ) 26వ సమావేశం జరిగింది.

 

ఈ సమావేశంలో పీఎం-ఎస్‌టీఐఏసీ సభ్యులతో పాటు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థల అధికారులు హాజరయ్యారు. పరిశోధన, ఆవిష్కరణల్లో ప్రస్తుత స్థితిగతులు, ఆమోదయోగ్యమైన భాగస్వామ్య విధానాలు, వాటి స్థానికంగా సందర్భోచిత పద్దతులు, సమర్థవంతమైన విధానాల అమలుపై చర్చించారు.

 

ఈ సమావేశంలో... నీతి ఆయోగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సభ్యులు- డాక్టర్ వీకే సారస్వత్, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయ శాస్త్రీయ కార్యదర్శి- డాక్టర్ పర్వీందర్ మైనీ, బయో టెక్నాలజీ విభాగ కార్యదర్శి- డాక్టర్ రాజేష్ ఎస్ గోఖలే పాల్గొన్నారు. వీరితో పాటు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి- లీనా నందన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి, ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి- డాక్టర్ ఎస్.సోమనాథ్, వైద్య పరిశోధన శాఖ కార్యదర్శి, ఐసీఎంఆర్- డీజీ డాక్టర్ రాజీవ్ బల్, సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, సీఎస్ఐఆర్, డీజీ- డాక్టర్ ఎన్. కలైసెల్వి, రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శి- డాక్టర్ సమీర్ వి కామత్, డీఆర్డీవో చైర్మన్- అజిత్ కుమార్ మొహంతి, అణుశక్తి శాఖ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి- ఎస్ కృష్ణన్, శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి- ప్రొఫెసర్ అభయ్ కరాండికర్, ఇన్-స్పేస్ చైర్మన్- డాక్టర్ పవన్ గోయెంకా పాల్గొన్నారు.

 

దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల నుంచి కూడా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐఐఎస్సీ బెంగళూరు డైరెక్టర్- ప్రొఫెసర్ గోవిందన్ రంగరాజన్, ఐఐటీ బాంబే డైరెక్టర్- ప్రొఫెసర్ శిరీష్ కేదార్, బిట్స్ పిలానీ ప్రాంగణాల ఉప సంచాలకులు- ప్రొఫెసర్ వి.రాంగోపాల్ రావు, ఐఐటి గాంధీనగర్ డైరెక్టర్- ప్రొఫెసర్ రజత్ మూనా హాజరయ్యారు.

 

పారిశ్రామిక సంస్థల నుంచి, నాస్కామ్ అధ్యక్షురాలు- శ్రీమతి దేబ్జానీ ఘోష్, అధ్యక్షుడు- శ్రీ రాజేష్ నంబియార్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్, ఫౌండర్- శ్రీమతి కిరణ్ మజుందార్ షా, ఇన్వెస్ట్ ఇండియా సంస్థ సీఈఓ, ఎండీ- శ్రీమతి నివృతి రాయ్, ఫిక్కీ ఇన్నోవేషన్ కమిటీ కో చైర్- శ్రీమతి ఆనంది అయ్యర్, ఫౌండేషన్ ఫర్ అడ్వాన్సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు- శ్రీ ఆశిష్ ధావన్, సెంటర్ ఫర్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఎకనామిక్ రీసెర్చ్ సీఈఓ- శ్రీ జనక్ నబర్ పాల్గొని వారి ఆలోచనలు పంచుకున్నారు.

సీఎస్ఐఆర్, మాజీ డైరెక్టర్ జనరల్- డాక్టర్ రఘునాథ్ అనంత్ మషేల్కర్, సీఐఐ మాజీ- చైర్మన్ డాక్టర్ నౌషాద్ ఫోర్బ్స్ వారి అభిప్రాయాలను సమావేశంలో తెలిపారు.

 

ప్రొఫెసర్ సూద్ మాట్లాడుతూ- పరిశోధన, ఆవిష్కరణల్లో, ముఖ్యంగా అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) ద్వారా పరిశ్రమ-విద్యా రంగ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ లక్ష్యసాధనలో భాగంగా- పరిశోధన, ఆవిష్కరణ కార్యకలాపాల ఫలితంగా వచ్చే సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వం సంపూర్ణ పాత్ర పోషించాలని కోరారు.

 

నీతి ఆయోగ్, సైన్స్, టెక్నాలజీ సభ్యులు- డాక్టర్ వి.కె.సారస్వత్ మాట్లాడుతూ దేశంలో పరిశోధనలు, ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి పరిశ్రమలు, విద్యా రంగం సహకరించగల ప్రాధాన్యతా రంగాలను గుర్తించాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ఉత్పత్తి ఆధారిత దేశంగా మార్చే రూపకల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని... విద్యా రంగ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాన్ని పెంపొందించడం, విద్యా- పరిశ్రమ రంగాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, స్వదేశీ పరిశోధనాభివృద్ధిపై నమ్మకాన్ని పెంపొందించేలా కృషి చేయాలని అన్నారు. దేశంలో పరిశోధనాభివృద్ధి వాతావరణాన్ని కల్పించేందుకు, ప్రధానంగా విద్యారంగం- పరిశ్రమ మధ్య అనుసంధానతను పెంచాలని పిలుపునిచ్చారు.

 

సమావేశంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం పరిశ్రమ-విద్యారంగ భాగస్వామ్యాల ట్రిపుల్ హెలిక్స్ నమూనాపై నిపుణులు వివరణాత్మక ప్రదర్శనను ఇచ్చారు. ఐసీటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, అంతరిక్షం, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ రంగాల్లో విద్యా-పరిశ్రమల భాగస్వామ్యం కోసం, ఆయా రంగాలను ప్రోత్సహించడానికి వివిధ నమూనాలు, ఎదురయ్యే సవాళ్లు, సంబంధిత సిఫార్సులపై చర్చలు జరిగాయి. పరిశ్రమ-విద్యా భాగస్వామ్యం ద్వారా దేశ వృద్ధిలో గణనీయమైన ప్రభావాలను చూపగల కొన్ని కీలక ప్రాధాన్య రంగాలపై వారు దృష్టి సారించారు. ప్రభావవంతమైన, మెరుగైన ఫలితాలను అందించడానికి ప్రభుత్వం, పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య ఏర్పాటు చేసుకున్న లక్ష్యాల ప్రాముఖ్యతను కూడా చర్చించారు.

ప్రజెంటేషన్ల అనంతరం, ప్రత్యేక ఆహ్వానితులు, పీఎం-ఎస్‌టీఐఏసీ సభ్యులను వేదికపైకి ఆహ్వానించారు. పరిశ్రమ-విద్యారంగ భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ట్రిపుల్ హెలిక్స్ విధానాన్ని విస్తరించడంలో అంకుర సంస్థలు, యాక్సిలరేటర్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పాత్రపై వారు సమాలోచనలు చేశారు. ఇందులో ప్రభుత్వ పాత్రపై వారు చర్చించారు. ప్రభుత్వం వినియోగదారుగా, సదుపాయ సంధాతగా ఉంటూ, మల్టీడిసిప్లినరీ విధానాలతో విద్యా పరిశోధన, పరిశ్రమల మధ్య అనుసంధానతను పెంచాలని సూచించారు. పరిశోధన సంస్థలతో సహా విద్యారంగం- పరిశ్రమల మధ్య ఎలాంటి అంతరాయం లేని విధివిధానాలను వారు సూచించారు. ప్రాథమిక పరిశోధన, అత్యాధునిక సాంకేతికత రెండింటిలోనూ దీర్ఘకాలిక ప్రభుత్వ పెట్టుబడుల ప్రాముఖ్యతను కూడా వారు ప్రధానంగా ప్రస్తావించారు.

 

 

ప్రొఫెసర్ సూద్ తన ముగింపు ప్రసంగంలో మాట్లాడుతూ, పరిశోధనాభివృద్ధి సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు భాగస్వాముల మధ్య ప్రోత్సాహకాలను సమీకరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ప్రస్తుత వనరులు, భవిష్యత్ అవసరాల మధ్య ఉండే అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన, ఆవిష్కరణలు దేశ కీలక అవసరాలను తీర్చేలా చూడాలని సమావేశంలో వక్తలు చేసిన సిఫార్సులను ఆయన మరోసారి ప్రస్తావించారు.

 

***


(Release ID: 2066269) Visitor Counter : 83


Read this release in: English , Urdu , Marathi , Hindi