పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఇండియా కెమ్ (ఇండియన్ కెమికల్ అండ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీ) - 2024 లో భారత పెట్రో కెమికల్
సామర్థ్యాన్ని వివరించిన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరి
భారతదేశానికి ప్రపంచ రసాయన తయారీ కేంద్రంగా మారే సామర్థ్యం ఉంది: మంత్రి పూరి
పెట్రో కెమికల్స్‌ను ప్రోత్సహించడానికి 2025 నాటికి కొత్త పిసిపిఐఆర్ విధానం కింద రూ. పెట్టుబడిగా10 లక్షల కోట్లు
Posted On:
18 OCT 2024 5:42PM by PIB Hyderabad
ఇండియన్ కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ రంగం మార్కెట్ పరిమాణం ప్రస్తుత 220 బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి సుమారు 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఇండియా కెమ్ 2024 సందర్భంగా పెట్రో కెమికల్ పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ప్రసంగించారు. రసాయనాలకు డిమాండ్ దాదాపు మూడు రెట్లు పెరగవచ్చని, 2040 నాటికి భారతదేశంలో పెట్రోకెమికల్స్ పరిశ్రమ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఆయన అన్నారు.
పరిశ్రమ ప్రముఖులను ఉద్దేశించి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ప్రసంగిస్తూ... భారత పెట్రో కెమికల్ రంగం విస్తారమైన సామర్థ్యాన్ని ప్రముఖంగా వివరించారు. 25 నుండి 30 మిలియన్ టన్నుల వార్షిక వినియోగంతో భారతదేశం ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇది అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తలసరి వినియోగం గణనీయంగా తక్కువ. ఈ అంతరం... డిమాండ్ పెరుగుదలకు, పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలను అందిస్తుంది.
రసాయనాల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానంలోనూ, ఆసియాలో మూడో స్థానంలోనూ ఉన్న భారతదేశం 175 దేశాలకు రసాయనాలను ఎగుమతి చేస్తోంది. ఇది దాని మొత్తం ఎగుమతుల్లో 15 శాతం వాటాను కలిగి ఉంది. రసాయనాలు, పెట్రో రసాయనాలు ప్రపంచ చమురు డిమాండు వృద్ధిని పెంచుతాయని, భారత సమీకృత పెట్రో కెమికల్ సామర్థ్యం దాని విస్తరిస్తున్న శుద్ధి సామర్థ్యాలతో ముడిపడి ఉందని శ్రీ పూరి స్పష్టం చేశారు. 2028 నాటికి 257 ఎంఎంటిపిఎ నుంచి 310 ఎంఎంటిపిఎకు పెరుగుతుందని, ఇది వ్యయ పరంగా పోటీతత్వాన్ని పెంచుతుందని అంచనాలు సూచిస్తున్నాయి.
ఒఎన్జీసి, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, హల్దియా పెట్రో కెమికల్స్ వంటి ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులకు కట్టుబడి ఉంది. పెట్రో కెమికల్ ప్రాజెక్టుల్లో దాదాపు 45 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి అదనంగా 100 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇది తక్కువ-కార్బన్ దిశగా భారత్ మార్పుతో సమానంగా ఉంటుంది.
భారత్‌లో గణనీయంగా పెరుగుతున్న పెట్రో కెమికల్ సామర్థ్యం గురించి మంత్రి వివరించారు. భారత పెట్రో కెమికల్ సామర్థ్యం 2030 నాటికి సుమారు 29.62 మిలియన్ టన్నుల నుండి 46 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
పరిశ్రమలో వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ... పెట్రోలియం, కెమికల్స్ , పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్స్ (పిసిపిఐఆర్), ప్లాస్టిక్ పార్కులు, జౌళి పార్కుల అభివృద్ధితో పాటు ఆటోమేటిక్ మార్గాల ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్ డి ఐ) సులభతరం చేయడం వంటి కీలక విధానాల గురించి మంత్రి వివరించారు.
పెట్రో కెమికల్ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడానికి పెరుగుతున్న జనాభా, శరవేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ ప్రధాన కారణాలని మంత్రి అన్నారు. ఇంకా ఎక్కువ మంది పౌరులు మధ్య తరగతిలోకి ప్రవేశించడంతో, పెట్రో కెమికల్స్ నుండి తయారయ్యే విస్తృత శ్రేణి ఉత్పత్తుల కోసం డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీనికితోడు పరిశుభ్ర ఇంధనం (క్లీన్ ఎనర్జీ) పై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల పెట్రో కెమికల్ సొల్యూషన్స్ కు డిమాండ్ పెరుగుతోందని మంత్రి చెప్పారు.
వచ్చే దశాబ్దంలో భారతదేశంలో పెట్రో కెమికల్ రంగం 87 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని, ఇది ప్రపంచ పెట్రో కెమికల్ వృద్ధిలో 10 శాతం పైగా ప్రాతినిధ్యం వహిస్తుందని మంత్రి చెప్పారు. కొత్త పి సి పి ఐ ఆర్ విధానం 2020-35 ప్రకారం 2025 నాటికి రూ.10 లక్షల కోట్ల (సుమారు 142 బిలియన్ డాలర్లు) ఉమ్మడి పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఈ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వ దీర్ఘకాలిక దృష్టి కోణాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
రసాయన పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. జిడిపికి సుమారు 6% వాటా అందిస్తోంది. అయిదు మిలియన్లకు పైగా ప్రజలకు ఉపాధిని సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రసాయన రంగులు , వ్యవసాయ రసాయనాల ఎగుమతిలో భారతదేశం రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. ఇది ప్రపంచ రసాయన అమ్మకాలలో 3 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే భారత్ రసాయనాలు, పెట్రో కెమికల్స్ నికర దిగుమతిదారుగా కూడా ఉంది. పెట్రో కెమికల్ ముడి పదార్థాలలో సుమారు 45 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. దేశీయంగా డిమాండ్, సరఫరా మధ్య ఈ అంతరాన్ని స్థానికంగా వాటి ఉత్పత్తి ద్వారా పూడ్చడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉంది.
వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, మౌలిక సదుపాయాలు, ఆటోమొబైల్స్, టెక్స్ టైల్స్ సహా అనేక రంగాలకు వెన్నెముకగా సేవలందించడంలో రసాయన, పెట్రో కెమికల్ పరిశ్రమల కీలక పాత్రను మంత్రి వివరించారు. సుస్థిరతపై బలమైన దృష్టితో, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
12 శాతం సంకలిత వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్) కలిగిన ప్రత్యేక రసాయనాల రంగం కూడా భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తోంది. అయితే, పెట్రో కెమికల్ పరిశ్రమలో స్థిరమైన వృద్ధికి తక్కువ కార్బన్ వ్యూహం అవసరం.
వృద్ధిని మరింత పెంచేందుకు, భారత రసాయన పరిశ్రమ అంతర్జాతీయ రసాయన కేంద్రాలైన ఆంట్వెర్ప్ పోర్టు, హ్యూస్టన్ పోర్టు, జ్యూరాంగ్ ఐలెండ్ నుండి నేర్చుకోవాలని మంత్రి ప్రోత్సహించారు. ముడి పదార్థాలను (ఫీడ్ స్టాక్) పంచుకోవడానికి, ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి, సృజనాత్మకత, నైపుణ్య అభివృద్ధి కోసం ఉమ్మడి సౌకర్యాలను సృష్టించడానికి క్లస్టర్లను సమన్వయం చేయడం ద్వారా పరిశ్రమ తన అభివృద్ధిని వేగవంతం చేయవచ్చు.
ప్రబలమైన ప్రారంభ స్థాయి, మద్దతు ఇచ్చే ప్రభుత్వ విధానాలతో, భారత్ కు ప్రపంచ రసాయన తయారీ కేంద్రంగా మారే సామర్థ్యం ఉందని శ్రీ పూరి తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సహకారంతో భారత్ 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి పెట్రోకెమికల్ రంగం దోహదం చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(Release ID: 2066253)
Visitor Counter : 68