ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా మొబైల్ కాంగ్రెస్-2024 (ఐఎంసి)లో ‘డిజిటల్ ఇండియా ఇన్నొవేషన్ జోన్’ (డిఐఐజడ్) ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ
‘డిజిలాకర్, యుపిఐ, ఆధార్’ వంటి ‘డిపిఐ’ల వినియోగంపై
‘డిఐఐజడ్’లో ప్రత్యక్ష అనుభవం పొందే వీలు
‘డిఐఐజడ్’లో 5జి... ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ పద్ధతులు సహా భారత ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థ విశిష్టతలను ప్రముఖంగా ప్రదర్శిస్తున్న మంత్రిత్వ శాఖ
Posted On:
17 OCT 2024 12:08PM by PIB Hyderabad
ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2024 (ఐఎంసి)లో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఎలక్ట్రానిక్ పరిపాలన విభాగం (ఎన్ఇజిడి) ‘డిజిటల్ ఇండియా ఇన్నొవేషన్ జోన్’ (డిఐఐజడ్) పేరిట ఒక ప్రదర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొంటున్న వివిధ దేశాల ప్రతినిధులకు భారత్‌లో వినియోగిస్తున్న సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల (డిపిఐ) గురించి ప్రత్యక్ష అనుభవం కల్పించడమే దీని లక్ష్యం.
ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024’ (డబ్ల్యుటిఎస్ఎ)కి శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 15న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 8వ మహాసభను ప్రారంభించి, అక్కడి ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించారు.
మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్ ‘డిఐఐజడ్’ను (16.10.2024) సందర్శించిన దృశ్యం.
ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్ ‘డిఐఐజడ్’ను సందర్శించి, అక్కడ ప్రదర్శిస్తున్న వివిధ అత్యాధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, డిజిటల్ ఇ-గవర్నెన్స్ విధానాలను పరిశీలించారు.
మంత్రిత్వ శాఖ ప్రదర్శన కేంద్రం
భారత్‌లో వినియోగంలోగల ‘‘డిజిలాకర్, ఉమంగ్, ఆధార్, ‘యుపిఐ’, ఇ-సంజీవని, ‘ఒఎన్‌డిసి’, డిజిటల్ ఇండియా ‘భాషిణి’’ వంటి వివిధ సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల (డిపిఐ)పై దేశవిదేశీ ప్రతినిధులందరికీ ప్రయోగాత్మకంగా ప్రత్యక్ష అనుభవం కల్పించడమే ఈ కేంద్రం ఏర్పాటు లక్ష్యం. అలాగే ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్యక్రమ సాంకేతిక పురోగమనాన్ని వివరించే దిశగా మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘సి-డాక్, నిక్సి, సమీర్’ విభాగాలు కూడా ప్రత్యక్షానుభవ బూత్‌లను కూడా ఏర్పాటు చేశాయి.
దేశంలో జీవన సౌలభ్యం, వాణిజ్య సౌలభ్యంసహా పౌరులకు పరిపాలన సౌలభ్యం కల్పించే వివిధ ప్రాజెక్టులపై ఈ అత్యాధునిక కేంద్రం అంతర్జాతీయ భాగస్వాములకు సమగ్ర సమాచారం అందిస్తుంది.
ఇందులోగల ‘ఉమంగ్’ బూత్‌ల రక్తనిధి (బ్లడ్ బ్యాంకు) సంస్థల అన్వేషణ, రైలు ప్రయాణం, పెన్షనర్ల జీవన ప్రమాణ ధ్రువపత్రం రూపకల్పన, పాస్‌పోర్ట్ సేవ వంటి కొన్ని కీలక సేవల గురించి ‘రోటోస్కోప్’ ద్వారా సందర్శకులకు ప్రత్యక్ష అనుభవం కల్పిస్తారు. అలాగే డిజిలాకర్ బూత్‌లో ‘టైమ్ ఛాలెంజ్: సెక్యూర్ డాక్స్’ పేరిట స్వల్ప వ్యవధి ఆట రూపంలో సందర్శకులు తమ పత్రాలను ‘డిజిటల్ వాల్ట్’లోకి పంపి, ‘డిజిటల్ ఇండియా’ వస్తువులను బహుమతిగా గెలుచుకోవచ్చు. అంతేకాకుండా డిజిలాకర్ పర్యావరణ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రదర్శనతోపాటు నమోదు సంబంధిత దశలవారీ ప్రక్రియను కూడా వీక్షించవచ్చు.
ఇక ‘స్కాన్ అండ్ పే’ విధానాన్ని ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్‌పిసిఐ) ప్రతినిధులకు ప్రత్యక్షంగా ప్రదర్శిస్తుంది. దీంతోపాటు భారత్‌లో డిజిటల్ చెల్లింపుల విప్లవంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇతర ‘యుపిఐ’ సేవల గురించి కూడా ప్రత్యక్ష అనుభవం కల్పిస్తుంది.
ఇవేగాక ‘ఒఎన్‌డిసి’ బూత్‌లోనూ సందర్శకులకు ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. ప్రత్యక్ష నంబర్లు, విక్రేతల వివరాల తోడ్పాటుతో ఇ-కామర్స్ రంగంపై ప్రభావాన్ని ఇది ప్రముఖంగా చూపుతుంది. మరోవైపు ఇ-కామర్స్ నెట్‌వర్క్ ద్వారా షాపింగ్ ఎలా చేయాలో ప్రత్యక్ష ప్రదర్శన సహా ఆసక్తికర వీడియోల ద్వారా ‘ఒఎన్‌డిసి’ వివరిస్తుంది. ఈ బూత్‌ను సందర్శించే వారు ‘ట్రివియా గేమ్’ ద్వారా సులువైన ప్రశ్నలకు జవాబిచ్చి అద్భుత బహుమతులను గెలుచుకునే అవకాశం కూడా ఉంది.
‘డిజిటల్ ఇండియా భాషిణి’ బూత్ మొబైల్ నుంచి కాల్ కోసం వివిధ భాషల మధ్య (క్రాస్-లాంగ్వేజ్) అనువాద సంబంధిత ‘బాత్‌చీత్’ (సంభాషణ) యాప్ సదుపాయాన్ని ప్రదర్శిస్తుంది. దీంతోపాటు ‘సభా లేఖ’ పేరిట కృత్రిమ మేధ (ఎఐ) ఆధారిత బహుభాషా సమావేశ వేదిక వంటివాటిని కూడా చూడవచ్చు. వివిధ భాషల వినియోగదారుల మధ్య స్పష్టమైన సంభాషణల దిశగా ‘బాత్‌చీత్’ యాప్‌లో లిప్యంతరీకరణ, ‘వాయిస్ కాల్’ సామర్థ్యం అందుబాటులో ఉంటాయి. ఇది ‘యాప్-టు-యాప్’, ‘యాప్-టు-మొబైల్ కాలింగ్’ రెండింటికీ ‘బాత్‌చీత్’ యాప్ మద్దతిస్తుంది. పైగా అవతలి వ్యక్తి ఈ యాప్ ఇన్‌స్టాల్ చేయకుండానే సంభాషణలో పాలుపంచుకోవచ్చు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారికి డాక్టర్ల ద్వారా అనుసరణీయ సూచనలు అందేవిధంగా వారి మధ్య సంభాషణను మెరుగుపరచగల ‘ఎఐ’ ఆధారిత సదుపాయం ‘‘కాన్వర్సేషనల్లీ’’ పనితీరును కూడా ఈ బూత్ ప్రదర్శిస్తుంది. దీంతోపాటు దేశంలో బధిర, వినికిడి లోపంగల 18 మిలియన్ల జనాభాకు ప్రతి సమాచారాన్నీ అందుబాటులో ఉంచే ‘‘సైన్ అసెస్టివ్’’ అనే ఉపకరణం గురించి కూడా వివరిస్తుంది.
ఇ-సంజీవని బూత్‌లో టెలికన్సల్టేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గ్రామీణ-పట్టణ ప్రాంత పౌరుల మధ్య ఆరోగ్య సంబంధిత అంతరం తొలగించడంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న జాతీయ టెలిమెడిసిన్ సేవల గురించి ఇక్కడ ప్రతినిధులు సులువుగా అర్థం చేసుకోగలరు.
దేశంలోని కోట్లాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే కీలక ప్రామాణీకరణ పరిష్కారమైన ‘ఆధార్’ ప్రతి భారతీయుడి విశిష్ట డిజిటల్ గుర్తింపుగా ఎలా మారిందీ తెలుపుతుంది.
అలాగే ‘‘మన్ కీ బాత్’’ బూత్‌లో వివిధ సంచికల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రతినిధులు తమతమ ప్రాంతీయ భాషలో వినవచ్చు.
ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతికత మంత్రిత్వశాఖ పరిధిలోని ‘నిక్సి’ (డాట్) .भारत డొమైన్ ప్రాధాన్యంతోపాటు బహుళ-భాషా ఇంటర్నెట్ ఆవశ్యకతపై ప్రతినిధులకు ప్రత్యక్ష అనుభవంతో కూడిన అవగాహన కల్పిస్తుంది. ఈ సందర్భంగా వారు తమ స్వంత .భారత్ డొమైన్‌ను కూడా ఈ బూత్‌లో నమోదు చేసుకోవచ్చు.
వీటన్నిటితోపాటు ‘5జి, తదుపరి తరం సాంకేతిక రంగాల్లో తన ఉత్పత్తులు, పరిష్కారాలను ‘సి-డాక్’ ప్రదర్శిస్తోంది. అలాగే పరిశ్రమల స్థాయి ఓపెన్ సోర్స్ 5జి వేదిక రూపకల్పన కోసం మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చిన ‘ఐఒఎస్-5జిఎన్’, ఓపెన్ సోర్స్ పరిష్కారాలతో పనిచేసే ‘ఎండ్-టు-ఎండ్ 5జి సెటప్’లను కూడా ఇందులో ప్రదర్శిస్తున్నారు. అలాగే తన మొబైల్ భద్రత పరిష్కారాలు ‘ఎం-కవచ్’, ‘ఎం-ప్రబంధ్’, ‘పరీక్షణ్’ల గురించి వివరిస్తుంది. ఈ ప్రదర్శనలో భాగంగా ‘ఎస్‌డిఎన్ మిడిల్‌వేర్ బేస్డ్ 5జి సిమ్యులేషన్ ప్లాట్‌ఫామ్ ఫర్ యూజ్ కేసెస్’, స్మార్ట్ ఎనర్జీ మీటర్, 5జి వి2ఎక్స్ సొల్యూషన్, 5జి ఆధారిత డ్రోన్ల రూపకల్పన వేదిక ‘క్రియేట్’ గురించి కూడా విశదీకరిస్తుంది.
‘సమీర్’ బూత్‌లో భవిష్యత్తరం కమ్యూనికేషన్-మైక్రోవేవ్ సాంకేతికతలను ప్రదర్శిస్తున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద వీటిని మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. ‘ఇంటరాక్టివ్ యుఐ’ ద్వారా ‘‘అట్మాస్ఫియరిక్ సైన్స్, హెల్త్‌కేర్, 6జి కమ్యూనికేషన్స్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్’’ రంగాల్లో రూపొందించిన వివిధ సాంకేతికతలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అలాగే వాతావరణ అధ్యయనాల కోసం ‘ఎంఎండబ్ల్యు’ రేడియోమీటర్ సంబంధిత ‘స్కేల్ డౌన్ రెప్లికా, ‘మెడికల్ అప్లికేషన్’ల కోసం 1.5టి సూపర్ కండక్టింగ్ ‘ఎంఆర్ఐ’ స్కానర్‌ను ప్రదర్శిస్తున్నారు. తద్వారా ‘ఐఎంసి-2024’లో పాల్గొంటున్న ప్రతినిధులలో అధికశాతానికి ఈ సాంకేతికతలకు సంబంధించిన కీలక విశిష్టతలను ‘సమీర్’ వివరిస్తుంది.
ఇండియా మొబైల్ కాంగ్రెస్-2024
ఇండియా మొబైల్ కాంగ్రెస్-2024 (ఐఎంసి) భారత ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను ప్రపంచానికి ప్రస్ఫుటం చేస్తుంది. ఈ సందర్భంగా క్వాంటమ్ సాంకేతికత, వర్తుల ఆర్థిక వ్యవస్థతోపాటు 6జి, 5జి, వినియోగ ప్రాముఖ్యం సహా క్లౌడ్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్, ఐఒటి, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ టెక్, శాట్‌కామ్, ఎలక్ట్రానిక్స్ తయారీ వగైరా రంగాల్లో ప్రగతిని ప్రముఖ టెలికాం కంపెనీలు, ఆవిష్కర్తలు విస్తృతంగా ప్రదర్శిస్తారు. ఇందులో 400 మందికిపైగా ఎగ్జిబిటర్లు, దాదాపు 900 అంకుర సంస్థలు, 120 దేశాల నుంచి వివిధ భాగస్వామ్య సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. ఈ సందర్భంగా 900కుపైగా సాంకేతికత వినియోగ అధ్యయనాంశాలను ప్రముఖంగా ప్రదర్శిస్తుంది. అలాగే 100కుపైగా చర్చా గోష్ఠుల నిర్వహణసహా 600 మందికిపైగా జాతీయ, అంతర్జాతీయ వక్తల మధ్య సంభాషణలకు ఆతిథ్యమిస్తోంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నాలుగు రోజులపాటు (అక్టోబరు 15-18) సాగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తోంది.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2024’లో భాగంగా ఏర్పాటు చేసిన ‘డిజిటల్ ఇండియా ఎక్స్ పీరియన్స్ జోన్’
***
(Release ID: 2065913)