సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“ప్రపంచంలోని అందరికీ అర్ధమయ్యే సంగీత, నాట్యాల భాష ఎల్లలెరుగనిది” అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


“సాంస్కృతిక వేడుకల్లో యువతకు భాగస్వామ్యం కల్పించడం వల్ల, వారు మూలాలతో అనుబంధం కొనసాగిస్తూ, జాతి నిర్మాణంలో మరింత సమర్ధమైన పాత్ర పోషించే అవకాశం కలుగుతుంది” అన్న ప్రధాని

‘భారతీయ నృత్యం’ అంతర్జాతీయ ఉత్సవాలను ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్

Posted On: 16 OCT 2024 6:33PM by PIB Hyderabad

కేంద్ర సంగీత నాటక అకాడమీ, ‘భారతీయ నృత్యం’ పై  తొలి అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. అనేక దేశాల కళాకారులు పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ప్రత్యేక సందేశమిచ్చారు. భారతీయ సంస్కృతిలో నాట్యం ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ, దేశ సంప్రదాయాల్లో పాలుపంచుకునేందుకు యువతకు నాట్యం చక్కని అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ పూసా ‘ఎన్ఏసీఏ’ కాంప్లెక్స్ లోని  ‘ఏపీ షిండే సింపోజియం హాల్’ లో ఏర్పాటైన ఈ ఆరు రోజుల పండుగను, కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ప్రారంభించారు. ఈ రంగంలో పేరొందినవారూ, కళాకారులూ, విద్యార్థులూ వైవిధ్యభరితమైన భారతీయ నాట్యవైభవాన్ని ఆస్వాదించే అవకాశం వేడుక ద్వారా లభిస్తోంది.  

Image



విశిష్ఠమైన పండుగను ఏర్పాటు చేసిన సంగీత నాటక అకాడమీకీ, సాంస్కృతిక మంత్రిత్వశాఖకూ ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ, “ఇది ఎప్పటికీ గుర్తుండే చారిత్రక సందర్భం. వివిధ దేశాల కళాకారులు హాజరవుతున్న ఈ వేడుక, సాంస్కృతిక అంశాల పరస్పర మార్పిడికి అనువైనది. ప్రపంచంలోని అందరికీ అర్ధమయ్యే సంగీత నాట్యాల భాష, ఎల్లలెరుగనిది”, అన్నారు. యువతనుద్దేశించి, “దేశ సంస్కృతిలో నాట్యం విడదీయలేని అంశం. భారతీయ కళలకు సంబంధించి తొలి గ్రంధాలను భరతముని రచించారు. ఇటువంటి ఘనమైన వారసత్వాన్ని కొనసాగించడం మనకు దక్కిన బాధ్యత,  గౌరవం” అని శ్రీ మోదీ చెప్పారు. సాంస్కృతిక వేడుకల్లో యువత భాగస్వామ్యం వల్ల వారు తమ మూలాలతో అనుసంధానమై, జాతి నిర్మాణంలో మరింత సమర్ధమైన పాత్రను పోషించగలరన్నారు.

నాట్యోత్సవంలో ప్రసంగించిన సాంస్కృతిక, పర్యాటక శాఖల కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్, “ప్రపంచం నలుమూలల నుంచీ వచ్చిన కళాకారులూ, నిపుణులూ ఘనమైన భారతీయ నృత్య వేడుకలో భాగమవుతున్నారు. అనేక తరాల అంకితభావం వల్ల ఈ సంప్రదాయాలు నిరంతరం ప్రవహించే గంగానదిలా  కొనసాగుతున్నాయి. ఇవే మనల్ని భిన్నత్వంలో కూడా కలిపి ఉంచే బలమైన బంధాలు” అన్నారు.  “రాజస్థాన్ ఎడారి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. ఎడారి ప్రాంతం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి చోట్ల కూడా కళకు సముచిత గౌరవమే దక్కుతోంది.  సంగీత నాట్యాలు జీవితానికి గొప్ప అర్ధాన్నిస్తాయి, మీరాబాయి కీర్తనల్లాగే అమితమైన సంతోషాన్ని కలిగిస్తాయి. అస్థిరత, రాజకీయ అనిశ్చితి, నైతిక పతనాలు రాజ్యామేలుతున్న నేటి ప్రపంచ సమాజానికి,  ప్రాచీన విజ్ఞానం, కళలు, విలువలకు నెలవైన భారతదేశం సాంస్కృతిక మార్గదర్శిగా నిలువగలదు. మన  ప్రాచీన సంపదలైన యోగా, ఆయుర్వేదాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరుగుతూ ఉన్న తరుణంలో, ఆ వారసత్వాలని కొనసాగించవలసిన బాధ్యత మన మీద ఉంది.  సముద్రాన్ని మధిస్తే అమృతం ఉద్భవించినట్లుగానే, ఈ ఉత్సవ వేదికపై జరిగే మేధోమథనం భారత దేశాన్నీ ప్రపంచాన్నీ సుసంపన్నం చేసి,  భవిష్యత్తరాలకి మార్గాన్ని నిర్దేశిస్తూ, స్ఫూర్తినిస్తుంది” అన్నారు.

యువత పెద్దసంఖ్యలో పాల్గొంటున్న అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సంగీత నాటక అకాడమీకి సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి కృతజ్ఞతలు తెలియజేశారు. “సాంస్కృతిక వర్గాలు, కళాకారులూ, నాట్యకారుల సంక్షేమం, సమానత్వాల కోసం మేం కృషి చేస్తున్నాం. మా శాఖ మంత్రిగారి నేతృత్వంలో రానున్న సంవత్సరాల్లో మరింత ప్రగతిని సాధిస్తాం” అంటూ ముగించారు.



“కాఠిన్యాన్ని నాట్యం పదేపదే కరిగించింది. ‘నటరాజు’ అనే భావన ప్రస్తుత సమయంలో మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. శాస్త్ర సాంకేతిక ప్రగతి, కృత్రిమ మేధ వంటి అంశాల గురించి మాట్లాడినప్పుడు, సోనాల్ మాన్ సింగ్ కృత్రిమ మేధ సహాయంతో నర్తించే పరిస్థితి రాదు కదా, అన్న భయం నన్ను వెంటాడుతుంది. కొత్త పోకడలను స్వీకరించేటప్పుడు తూకం, ఉచితానుచితాల వివేకంతో సృజనను అర్ధం చేసుకోవాలి ” అని ప్రముఖ నర్తకి డాక్టర్ సోనల్ మాన్ సింగ్ పేర్కొన్నారు.  

సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ సంధ్యా పురేచా మాట్లాడుతూ, దేశానికి చెందిన అనేక కళారీతులను  ఆస్వాదించే అదృష్టం తనకి కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. “వైవిధ్యభరితమైన మన నాట్యరీతులని ఒక గొడుగు కిందికి చేర్చి, సుసంపన్నమైన భారతీయ నృత్యంలోని భిన్న పార్శ్వాలను ఏకం చేయాలన్న ఆలోచన నాకు అనుకోకుండా కలిగింది. గౌరవనీయ ప్రధాని పేర్కొన్నట్లు, దేదీప్యమైన మన సాంస్కృతిక ప్రభను కొనసాగించడం మన గౌరవం, బాధ్యత” అన్నారు.

నాట్యోత్సవం నేపథ్యం:

సంగీత నాటక అకాడమీ నిర్వహణలో జరుగుతున్న ‘భారతీయ నాట్యం’ అంతర్జాతీయ ఉత్సవం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు, పండితులూ, విమర్శకులు, ప్రదర్శకులను ఒకచోటికి చేరుస్తోంది. నిన్న ప్రారంభమయిన ఈ పండుగ, నాట్య శిక్షణ, భారతీయ నృత్యం చారిత్రిక మూలాలూ, ఆధునిక పోకడలూ, పరిశోధనా పద్ధతులూ, కళలపై కృత్రిమ మేధ ప్రభావం వంటి వివిధ అంశాలని ముప్పై సదస్సుల్లో చర్చిస్తుంది. కళారంగానికి వాణిజ్యసంస్థలు తమ ‘సామాజిక బాధ్యత’ కార్యక్రమాల ద్వారా అందించే చేయూత, కళాకారులకు స్థిరమైన జీవనోపాధి వంటి అంశాలు సైతం చర్చల్లో భాగమవుతాయి.

ప్రాంగణంలోని ‘కామాని’ సభాగారంలో ప్రతి సాయంత్రం  డాక్టర్ సోనాల్ మాన్ సింగ్, రమ్లీ ఇబ్రహీం వంటి ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు సహా దేశ విదేశ కళాకారుల సోలో, బృంద ప్రదర్శనలూ ఉంటాయి. కళాకారుల విజయాలను లలిత కళ అకాడమీ, ఏపీ షిండే సింపోజియం హాల్లో నిన్న ప్రారంభమైన రెండు ఎగ్జిబిషన్లు ప్రదర్శిస్తాయి. వేడుకలో భాగంగా కళారంగంలో స్థిరమైన జీవనోపాధి అవకాశాల గురించిన చర్చలు జరుగుతాయి. భారతీయ నృత్య రంగానికి వ్యవస్థాగత మద్దతును సమకూర్చడం, సహకారం, సాంస్కృతిక మార్పిళ్ళకు వేదికగా నిలవాలన్నది పండుగ లక్ష్యాలు.  

సంగీత నాటక అకాడమీ నేపథ్యం:

సంగీత నాటక అకాడమీ సంగీతం, నాట్యాలకు సంబంధించిన జాతీయ సంస్థ. దేశం సార్వభౌమత్వాన్ని పొందిన తరువాత కళారంగానికి సంబంధించి ప్రారంభించిన తొలి జాతీయస్థాయి అకాడమీ. 1952 మే 31న భారత ప్రభుత్వ విద్యాశాఖ చేసిన తీర్మానం ద్వారా మనుగడలోకి వచ్చింది.

మరుసటి ఏడాది (1953లో) అధ్యక్షుడిగా డాక్టర్ పీవీ రాజమన్నార్ నియామకం, దేశవ్యాప్త ప్రతినిధులతో కూడిన  సర్వసభ్య పరిషత్తు ఏర్పాటుతో సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 1953 జనవరి 28న పార్లమెంటు భవనంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అకాడమీ ప్రారంభమయ్యింది. కళల రంగంలో అత్యున్నత సంస్థగా, సంగీతం, నాట్యం, నాటక రంగాల ద్వారా వెల్లడయ్యే దేశ అమూల్య వారసత్వ సంపదను కాపాడే గురుతర బాధ్యతను సంస్థ తొలినాళ్ళ నుంచీ చేపడుతూ వస్తోంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాల ఆర్ట్ అకాడమీలతోనూ, దేశంలోని ఇతర ప్రముఖ సాంస్కృతిక సంస్థల మధ్య, అకాడమీ అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది.

సంగీత నాటక అకాడమీ కళారంగంలో ప్రాముఖ్యం కలిగిన ఘట్టాలనూ, సంస్థలను ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షిస్తుంది. ఈ రంగానికి అవసరమైన విధానాల రూపకల్పన, కార్యక్రమాల ఏర్పాటు విషయంలో  ప్రభుత్వానికి  సేవలు, సలహాలూ, సూచనలను అత్యున్నత సంస్థ అయిన అకాడమీ అందిస్తుంది. వివిధ రాష్ట్రాల మధ్య, దేశాలతో సాంస్కృతిక సమన్వయ సాధన బాధ్యతను ప్రభుత్వంతో  కలిసి నెరవేరుస్తుంది.

 

****


(Release ID: 2065655) Visitor Counter : 60


Read this release in: Hindi , English , Urdu