వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పీఎం గతిశక్తి ఆధ్వర్యంలో వ్యవస్థల నిర్మాణ ప్రణాళికా బృందం 81వ సమావేశం అయిదు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మదింపు
రోడ్డు, విమానయాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను
అంచనా వేసిన వ్యవస్థల నిర్మాణ ప్రణాళికా బృందం
Posted On:
11 OCT 2024 1:04PM by PIB Hyderabad
పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) అదనపు కార్యదర్శి శ్రీ రాజీవ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షతన పీఎం గతిశక్తి విభాగమైన వ్యవస్థల నిర్మాణ ప్రణాళికా బృందం (నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్- ఎన్పీజీ) 81వ సమావేశం నిన్న జరిగింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలకు చెందిన అయిదు ప్రధానమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మదింపుపై ఈ సమావేశం దృష్టి సారించింది. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ)లో పేర్కొన్న అంతర్గత ప్రణాళికా సూత్రాలకు అనుగుణంగా ప్రాజెక్టులను మదింపు చేశారు. వీటి అంచనా ప్రభావాలు, మూల్యాంకనాన్ని ఈ కింది విధంగా ఉంది.
ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్ బైపాస్
ఉత్తర ప్రదేశ్‌లో 44వ జాతీయ రహదారిని, యమునా ఎక్స్‌ప్రెస్‌ను కలుపుతూ 16.75 కిమీల బృందావన్ బైపాస్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. 44వ జాతీయ రహదారికి, యమునా ఎక్స్‌ప్రెస్ ల మధ్య ప్రత్యక్ష మార్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బృందావన్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ప్రయాణ సమయం 1.5 గంటల నుండి 15 నిమిషాలకు తగ్గుతుంది. దీని నిర్మాణం ద్వారా ఈ ప్రాంతంలో అనుసంధాన సేవలు పెరగడంతో పాటు పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక వృద్ధిని ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, ప్రాంతీయ సౌలభ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సామాజిక-ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించనుంది.
మధ్యప్రదేశ్ లోని సందల్పూర్-బడీ రహదారి
మధ్యప్రదేశ్‌లో 146బీ జాతీయ రహదారిలో భాగంగా సందల్పూర్-బడీ రోడ్డు మార్గంలో 142.26 కి.మీ. మేర 4 లైన్ల రహదారిని నిర్మించనున్నారు. ఇదొక గ్రీన్ ఫీల్డ్/ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టు. ఇండోర్, జబల్పూర్ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడం, ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేయడం, ముఖ్యంగా భోపాల్ లో రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుత ప్రతిపాదిత మార్గం వివిధ జాతీయ రహదారులను, వివిధ ఆర్థిక, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ కీలకమైన అనుసంధాన రోడ్డు మార్గంగా పనిచేస్తుంది. అంతిమంగా ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
మహారాష్ట్రలోని జున్నార్-తలేఘర్ రోడ్డు మార్గం
మహారాష్ట్రలోని పుణేలోని జున్నార్ నుంచి తలేఘర్ వరకు 55.94 కిలోమీటర్ల రహదారిని అధునీకరించే బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టు ఇది. భీమాశంకర్, జున్నార్, బంకర్ఫతా, ఎన్హెచ్-61 మధ్య అనుసంధానాన్ని పెంచడం, సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. ఈ రహదారి అధునికీకరణ భీమాశంకర్ (ప్రధాన పుణ్యక్షేత్రం) జున్నార్ (చరిత్రాత్మక శివనేరి కోటకు నిలయం) వంటి ప్రాంతాలలో పర్యాటకాన్ని పెంచుతుందని అంచనా.
మహారాష్ట్రలోని భీమాశంకర్ - రాజ్ గురునగర్ రహదారి
మహారాష్ట్రలోని పుణేలో 60.45 కిలోమీటర్ల మేర రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టు. భీమాశంకర్, రాజ్ గురునగర్ మధ్య అనుసంధానాన్ని మెరుగుపర్చడం ద్వారా, సరుకు రవాణా, ప్రయాణికుల రవాణా సులభతరం అవుతుంది. తద్వారా ఆర్థిక కార్యకలాపాలు, మార్కెట్లకు చేరుకోవడం వేగవంతం అవుతుంది. అంతేకాక, ఈ ప్రాజెక్టు మార్గంలోని మారుమూల ప్రాంతాలు సైతం విద్య, ఆరోగ్య సేవలు పొందడం సులభతరం అవుతుంది. మెరుగైన రహదారి మౌలిక సదుపాయాలు- ప్రయాణ సమయాన్ని, ఖర్చును తగ్గిస్తాయి. వ్యాపార ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి. ఈ ప్రాంతం మొత్తం సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను నేరవేర్చుతుంది.
జమ్మూకాశ్మీరులోని బడ్గాంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్, అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధి
జమ్మూకాశ్మీర్ బడ్గాంలోని శ్రీనగర్ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, అనుబంధ మౌలిక సదుపాయాల నిర్మాణంతో కూడిన బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు విస్తరణ ద్వారా 71,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే 2,900 గంటలపాటూ, ఏడాదికి కోటి మంది ప్రయాణికులను తీసుకునే సామర్ధ్యం దీనికి ఉంటుంది. అదనంగా నూతన పార్కింగ్ ప్రాంతాల విస్తరణ, నగరం వైపు పార్కింగ్ సౌకర్యాలు, ఏఏఐ సిబ్బందికి, సీఐఎస్ఎఫ్ ల కోసం నివాస సముదాయాల నిర్మాణాన్నీ చేపట్టనున్నారు.
పీఎం గతిశక్తి సూత్రాల ప్రకారం ఎన్పీజి మొత్తం అయిదు ప్రాజెక్టులనూ క్షణ్ణంగా విశ్లేషించింది.
ఈ ప్రాజెక్టులలో భాగంగా బహుళార్థ సాధక మౌలిక సదూపాయాల సమగ్రాభివృద్ధి, ఆర్థిక, సామాజిక ప్రాంతాలలో చిట్టచివరి వరకు అనుసంధానత, వివిధ రూపాలలో/మార్గాల అనుసంధానత లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్న ఈ ప్రాజెక్టులు, గణనీయమైన సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను, ప్రజలకు జీవన సౌలభ్యాన్నీ అందించనున్నాయి. తద్వారా ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని అంచనా.
***
(Release ID: 2064181)
Visitor Counter : 62