ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో ముగిసిన కౌటిల్య ఆర్ధిక స‌మావేశం 2024 మూడో ఎడిష‌న్

కెఈసీ 2024లో పాల్గొన్న‌వారిని ఉద్దేశించి ప్ర‌త్యేక ప్ర‌సంగం చేసిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వ కృషి

గత దశాబ్దంలో చేప‌ట్టిన‌ గణనీయమైన సంస్కరణల కారణంగా ప్ర‌పంచ పెట్టుబ‌డుల గమ్య‌స్థానంగా అవ‌త‌రించిన భార‌త్

సమ్మిళిత వృద్ధి , సంస్కరణలప‌ట్ల‌ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన కేంద్ర ఆర్థిక మంత్రి

దేశ అధిక ఆర్థిక వృద్ధితోపాటు, ఆర్ధిక నిర్వ‌హ‌ణ‌, మౌలిక స‌దుపాయాలు, త‌యారీ , సాంకేతిక రంగాల‌పై పెట్టుబ‌డుల గురించి స్థూల‌దృష్టితో ప్ర‌సంగించిన‌ కేంద్ర ఆర్థిక మంత్రి

కృత్రిమ మేధ ఆవిర్భావం, ఆర్థిక , సామాజిక కార్యకలాపాలపై దాని విస్తృత ప్రభావాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించిన‌ డాక్టర్ జైశంకర్

ప్రధాన మంత్రి నాయకత్వ ప్ర‌తిభ‌పై ప్రశంసలు కురిపించిన ప్రొఫెస‌ర్ జగదీష్ భగవతి

సమయానుకూలంగా జోక్యం చేసుకుంటూ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌రిమిత‌స్థాయి విధానాల‌నుంచి విస్తృత‌స్థాయి ఉత్పాద‌క ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా తీర్చిదిద్దారంటూ ప్ర‌ధానిని కొనియాడిన ప్రొఫెస‌ర్ భ‌గ‌వ‌తి

గ్లోబల్ ఎజెండాను రూపొందించడంలో ముఖ్యంగా హ‌

Posted On: 07 OCT 2024 8:37PM by PIB Hyderabad

కౌటిల్య ఆర్ధిక స‌మావేశం 2024 ( కేఈసీ 2024) మూడో ఎడిష‌న్ విజ‌య‌వంతంగా ముగిసింది. దీన్ని న్యూఢిల్లీలో అక్టోబ‌ర్ 4నుంచి 6వ‌ర‌కూ నిర్వ‌హించారు. కేఈసీ 2024లో  ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేక ప్ర‌సంగం చేశారు. 2047 నాటికి భార‌త‌దేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా మార్చేలా జ‌రుగుతున్న‌ ప్ర‌య‌త్నాల‌కు శ్రీ మోదీ ఉప‌న్యాసం నూత‌నోత్తేజాన్నిచ్చింది. నిరంతర  ఆర్ధిక వృద్ధి, వ్య‌వ‌స్థాప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌లు, అత్యాధునిక సాంకేతిక‌త వినియోగంపై ఆధార‌ప‌డి భార‌త్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయాల‌నేది ప్ర‌ధాన‌మంత్రి దార్శ‌నిక‌త‌.

ఆర్థిక వ్యవహారాల శాఖ (డిఈఏ), ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్‌) భాగస్వామ్యంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ (ఐఈజీ) నిర్వహించిన కేఈసీ 2024లో భారత్‌తోపాటు,  ప‌లుదేశాల‌నుంచి వ‌చ్చిన 150 మంది ప్రముఖ ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు, విద్యారంగ మార్గదర్శకులు పాల్గొన్నారు. ఇందులో భారతదేశంతోపాటు ప్రపంచం  ఎదుర్కొంటున్న సమకాలీన ఆర్థిక  సామాజిక సవాళ్లపై 11 ప్లీనరీ సెషన్‌లు, 12 ఇంటరాక్టివ్ సెషన్‌లు, ద్వైపాక్షిక చర్చలు జ‌రిగాయి.

బ్యాంకింగ్, ప‌న్నులు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో పురోగతి గురించి ప్ర‌ధాని మాట్లాడారు. గత దశాబ్దంలో భార‌త‌దేశంలో చేప‌ట్టిన‌ గణనీయమైన సంస్కరణల కారణంగా ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా భార‌త్ నిలిచింద‌ని ప్రధాన మంత్రి తన ప్రసంగంలో ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు.భార‌త్‌ జి20 ప్రెసిడెన్సీ కార‌ణంగా సాధించిన కీల‌క‌ ఫలితాలైన గ్రీన్ హైడ్రోజన్ మిషన్,  గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ వంటి కార్యక్రమాలను ప్ర‌త్యేకంగా పేర్కొంటూ, హ‌రిత ఇంధ‌నం పట్ల భారత్‌కున్న‌ నిబద్ధత గురించి ప్రధాని మాట్లాడారు.

అంతకుముందు, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మ‌లా సీతారామ‌న్‌ ప్రారంభ ప్రసంగంతో కేఈసీ 2024 ప్రారంభమైంది. ఆమె భారతదేశ బలమైన స్థూల ఆర్థిక మూలాధారాలగురించి,  బహుళ అనిశ్చితులను పరిష్కరించడంలో దేశానికున్న సామర్థ్యాల గురించి ప్ర‌త్యేకంగా త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు.

భార‌త్‌ అధిక ఆర్థిక వృద్ధితోపాటు, ఆర్ధిక నిర్వ‌హ‌ణ‌, మౌలిక స‌దుపాయాలు, త‌యారీ రంగం , సాంకేతిక రంగాల‌పై పెట్టుబ‌డుల గురించి  శ్రీమ‌తి సీతారామ‌న్ స్థూల‌దృష్టితో మాట్లాడారు. స‌మ్మ‌ళిత వృద్ధి, సంస్క‌ర‌ణ‌ల‌ప‌ట్ల కేంద్ర‌ప్ర‌భుత్వానికి ఉన్న నిబ‌ద్ద‌త‌ను పున‌రుద్ఘాటించారు.

కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్. ఎస్. జైశంకర్‌,  ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అధ్యక్షుడు శ్రీ ఎన్.కె. సింగ్ మ‌ద్య‌న జ‌రిగిన‌ సంభాషణతో కేఈసీ 2024 ముగిసింది. ఈ సంభాష‌ణ‌లో వారు భారతదేశ వ్యూహాత్మక పాత్ర గురించి చర్చించారు.

 "విశ్వసనీయ , స్పష్టత క‌లిగిన దేశంగా భార‌త‌దేశానికి వ‌చ్చిన పేరును డాక్ట‌ర్ జ‌య‌శంక‌ర్ ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితి వంటి సంప్రదాయ సంస్థ‌ల‌కు అతీతంగా ప్రపంచ సహకారాన్ని రూపొందిస్తున్న ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎమ్ ఈసీ) ,  ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ ఏ) వంటి ప్రత్యామ్నాయ ప్రపంచ వ్య‌వ‌స్థ‌ల‌కు పెరుగుతున్న ప్రాముఖ్యత గురించి ఆయన మాట్లాడారు.  కృత్రిమ మేధ ఆవిర్భావం గురించి ప్ర‌త్యేకంగా పేర్కొంటూ.. ఇది ఆర్థిక,  సామాజిక కార్యకలాపాలపై చాలా ప్రభావం చూపుతుందని అన్నారు.

భారతదేశానికి చెందిన‌ అత్యంత గౌరవనీయ ఆర్థికవేత్తలలో ఒకరైన ప్రొఫెస‌ర్ జగదీష్ భగవతి ఈ కార్య‌క్ర‌మంలో  పాల్గొనడం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.  ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి  "సలహాలు తీసుకునే ద‌శ‌నుంచి  ఇప్పుడు వారికి "సలహాలు ఇచ్చే ద‌శ‌కు భారతదేశం స‌మూలంగా మార్పు చెందిందని ఆయ‌న ప్రశంసించారు. ప్రధానమంత్రి నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌ను ఆయ‌న కొనియాడారు.  సమయానుకూలంగా జోక్యం చేసుకుంటూ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌రిమిత‌స్థాయి విధానాల‌నుంచి విస్తృత‌స్థాయి ఉత్పాద‌క ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా తీర్చిదిద్దారంటూ ప్ర‌ధాని స‌మ‌ర్థ‌త‌ను ప్రొఫెస‌ర్ భ‌గ‌వ‌తి కొనియాడారు.

ఉపాధిని పెంపొందించే నైపుణ్యం,  వృద్ధిని పెంచే వ్యూహాలు వంటి ఉత్పాదకత కారకాలపై ప్రభావం చూపే సవాళ్ల గురించి, అలాంటి అనేక క్లిష్టమైన అంశాల‌పైనా  ఈ స‌మావేశంలో నిపుణులు చ‌ర్చించారు.
 వాతావరణ మార్పు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సిన త‌క్ష‌ణ అవ‌సరం,  హరిత పరివర్తన కోసం వ్యూహాలు,  పారిశ్రామిక విధానంలో అత్యుత్తమ అంతర్జాతీయ, దేశీయ పద్ధతులు, భౌగోళిక-ఆర్థిక చీలిక‌ల  సవాళ్లు , పరిణామాలు; అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణాన్ని సంస్కరించడం,  కృత్రిమ మేధ, ఉద్యోగాలు , ఆర్థిక వ్యవస్థపై దాని  ప్రభావాలు మొద‌లైన అంశాల గురించి ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.

భారతదేశంతోపాటు  విదేశాల నుంచి   విశిష్టమైన నిపుణులు అనేక మంది కెఈసీ 2024లో పాల్గొన్నారు. కీలకమైన అంతర్జాతీయ నిపుణుల‌ల‌లో భూటాన్ ఆర్థిక మంత్రి శ్రీ లియోన్‌పో లెకీడోర్జీ,  శ్రీమతి అమేలీ డి మోంట్‌చాలిన్, ఓఈసీడీ  ఫ్రెంచ్ శాశ్వత ప్రతినిధి ,  మాజీ ఫ్రెంచ్ మంత్రి;  శ్రీ ఆల్బర్ట్ పార్క్, చీఫ్ ఎకనామిస్ట్,  డైరెక్టర్ జనరల్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్;    శ్రీ మసూద్ అహ్మద్, సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ ప్రెసిడెంట్ ఎమెరిటస్;   శ్రీ జస్టిన్ యిఫు లిన్, పెకింగ్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూ స్ట్రక్చరల్ ఎకనామిక్స్ డీన్;   శ్రీ ఎరిక్ బెర్గ్లోఫ్, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో చీఫ్ ఎకనామిస్ట్; లార్డ్ నికోలస్ స్టెర్న్, ఐజీ పటేల్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్;  శ్రీ జాన్ లిప్స్కీ, ఫారిన్ పాలసీ ఇన్స్టిట్యూట్, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో సీనియర్ ఫెలో మొద‌లైన‌వారు వున్నారు.  భారత‌దేశాన్నించి  పాల్గొన్న‌వారిలో, 16వ ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ శ్రీ అరవింద్ పనగారియా;   నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బేరీ,   ముఖ్య ఆర్థిక సలహాదారు డా.వి. అనంత నాగేశ్వరన్ ల‌తోపాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల‌ నుండి కార్యదర్శులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు సాగిన చర్చలు ది ఇండియ‌న్ ఎరా  అనే అంశం చుట్టూ కేంద్రీకృత‌మై జ‌రిగాయి.  "వాతావరణం , అభివృద్ధి లక్ష్యాల మధ్య సంబంధం , "భౌగోళిక-ఆర్థిక చీలిక‌,  వృద్ధికి చిక్కులు,  "గ్రీన్ ట్రాన్సిషన్ ఫైనాన్సింగ్‌,  "ఆసియా ప్ర‌గ‌తి, అభివృద్ధి ఆర్థిక శాస్త్రానికి గ‌ల సంబంధం " మొదలైన అంశాల‌పై చ‌ర్చా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

 ప్రపంచ ఆదేశాలను అనుసరించడం నుంచి  గ్లోబల్ ఎజెండాను సెట్ చేయ‌డం వ‌ర‌కూ భారతదేశం సాధించిన స‌మూల మార్పును స‌మావేశంలో జ‌రిగిన‌ చర్చలు ప్ర‌తిఫ‌లించాయి. ముఖ్యంగా హ‌రిత ఇంధ‌నం, సాంకేతికత,  వాణిజ్య సంస్కరణ వంటి రంగాలలో మార్పును తెలియ‌జేశాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలనే భార‌త‌దేశ ఆశయాన్ని బలపరుస్తూనే, సమ్మిళిత వృద్ధి కోసం దేశం పెట్టుకున్న ఆకాంక్షలను ఈ చ‌ర్చ‌లు ప్ర‌త్యేకంగా పేర్కొన్నాయి. అంతే కాదు ప్ర‌పంచ ద‌క్షిణాది వ్యూహాత్మక సార‌థిగా భార‌త్ అభివృద్ధి చెందుతున్న తీరును ఈ చ‌ర్చ‌లు ప్ర‌త్యేకంగా పేర్కొన్నాయి.


 

****


(Release ID: 2063029) Visitor Counter : 58


Read this release in: English , Urdu , Hindi , Kannada