గనుల మంత్రిత్వ శాఖ
ఐబీఎమ్, జేఎన్‌ఏఆర్‌డీడీసీ కార్యకలాపాలను సమీక్షించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
నాగ్‌పూర్‌లో అడ్వాన్స్‌డ్ స్కానింగ్ & ఎక్స్‌ఆర్‌డీ సౌకర్యాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి
Posted On:
07 OCT 2024 8:44PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి నాగపూర్‌లోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్(ఐబీఎం) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. కీలక కార్యక్రమాల పురోగతిపై సమీక్షించిన ఆయన.. డిజిటల్ ఆవిష్కరణలను ప్రారంభించారు. దేశ ఖనిజ అన్వేషణ, ప్రాసెసింగ్ సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
నాగ్‌పూర్‌లోని హింగాలో ఉన్న ఐబీఎం అత్యాధునిక ఖనిజాల ప్రాసెసింగ్ ప్రయోగశాలను(ల్యాబ్) ఆయన సందర్శించారు. భారత వ్యూహాత్మక ఖనిజాల మిషన్‌కు ఈ ల్యాబ్ కీలకమైనది. కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌లో అధునాతక సాంకేతికతలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వీక్షించారు. సమర్థత, సుస్థిరత, ప్రపంచ స్థాయి పోటీతత్వాన్ని ప్రోత్సహించడంలో ప్రయోగశాల పాత్రను గనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ఐబీఎం కంట్రోలర్ జనరల్ శ్రీ సంజయ్ లోహియా ప్రధానంగా వివరించారు.
ఐబీఎంలోని అత్యాధునిక ఖనిజ ప్రాసెసింగ్ ప్రయోగశాలలో ఫీల్డ్ ఎమిషన్ స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్(ఎఫ్ఈఎస్‌ఎం), డిజిటల్ ఎక్స్ రే డిఫ్రాక్షన్(ఎక్స్‌ఆర్‌డీ) సౌకర్యాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ అధునాతన సాంకేతికతలు ఖనిజ విశ్లేషణ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. ఖనిజాల ప్రాసెసింగ్‌లో కచ్చితత్వం, సామర్థ్యం, స్థిరత్వాన్ని మెరుగుపరచడం ద్వారా భారత వ్యూహాత్మక ఖనిజ మిషన్‌కు ఇవి దోహదం చేస్తాయి.
సంజయ్ లోహియా, ఐబీఎంకు చెందిన ఇతర అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానికి కేంద్ర మంత్రి అధ్యక్షత వహించారు. కార్యకలాపాలను క్రమబద్ధీకరించటం, ఖనిజ అన్వేషణ కార్యక్రమాలను పెంచటం.. గనుల తవ్వకం రంగంలో పారదర్శకత, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై ఈ సమావేశం దృష్టి సారించింది.
సుస్థిత మైనింగ్ పద్ధతులు, గనుల లీజుకు సంబంధించిన స్టార్ రేటింగ్ వ్యవస్థ గురించి మంత్రికి లోహియా వివరించారు.
ఐబీఎం ఆవరణలోని జవహర్ లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్ మెంట్ అండ్ డిజైన్ సెంటర్ (జేఎన్ఏఆర్‌డీడీసీ) సమీక్షా సమావేశానికి కూడా కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇక్కడ అల్యూమినియం ప్రాసెసింగ్‌లో పరిశోధన, ఆవిష్కరణల ప్రాముఖ్యతను.. ఖనిజ వనరులకు సంబంధించి దేశ స్వావలంబన విషయంలో దీని పాత్ర గురించి ప్రధానంగా చెప్పారు.
గనుల తవ్వకం రంగంలో పర్యావరణ సుస్థిరత, హరిత కార్యక్రమాలకు కట్టుబడి ఉండటానికి ప్రతీకగా ఐబీఎం ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి మొక్కలు నాటారు.
ఖనిజ వనరుల్లో స్వావలంబనను పెంపొందించం, ప్రపంచ ఖనిజ రంగంలో భారత్ స్థానాన్ని మెరుగుపరిచే విషయంలో మంత్రిత్వ శాఖ అంకితభావాన్ని ఈ పర్యటన తెలియజేస్తోంది.
****
(Release ID: 2063026)
Visitor Counter : 34