భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా సహకారంతో కాంపిటీషన్ చట్టంపై ప్రాంతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించిన సీసీఐ


న్యాయమైన పోటీని ప్రోత్సహించడంలో, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంలో
కాంపిటీషన్ సవరణ చట్టం, 2023 ప్రాముఖ్యతను వివరించిన సీసీఐ చైర్‌పర్సన్ శ్రీమతి రవ్‌నీత్ కౌర్

Posted On: 07 OCT 2024 6:17PM by PIB Hyderabad

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌ నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా తో కలిసి ఈరోజు హైదరాబాద్‌లోని నల్సార్ క్యాంపస్‌లో కాంపిటీషన్ చట్టంపై ప్రాంతీయ వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ చట్టం అమలులో ఇటీవలి పరిణామాలపై అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా వర్క్‌షాప్ జరిగింది.  

ప్రారంభ కార్యక్రమంలో సీసీఐ చైర్‌పర్సన్‌ శ్రీమతి రవ్‌నీత్‌ కౌర్‌ కీలకోపన్యాసం చేశారు. కాంపిటీషన్ సవరణ చట్టం, 2023 ప్రాముఖ్యతను వివరిస్తూ, ఇది కాంపిటీషన్ చట్ట వ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఈ సవరణలు నిజాయితీగల పోటీని ప్రోత్సహించడం, వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడంతో పాటు డిజిటల్ మార్కెట్ల లాంటి రంగాలన్నింటా వ్యాపారాలకు సమానంగా అవకాశాలు ఇవ్వడంలో కీలక పాత్ర వహించాయి. నల్సార్ వైస్ ఛాన్సలర్  ప్రొ.శ్రీకృష్ణదేవరావు ప్రారంభోపన్యాసం చేశారు.

ప్రారంభ సమావేశం తర్వాత, సీసీఐ సభ్యులు  శ్రీ అనిల్ అగర్వాల్, శ్రీమతి శ్వేతా కక్కర్ రెండు సాంకేతిక సెషన్‌లను నిర్వహించారు.  కాంపిటీషన్ చట్టానికి ఇటీవల జరిగిన సవరణలు, అవి వ్యాపారాలు, రెగ్యులేటర్‌లపై చూపిన ప్రభావాలపై  మొదటి సమావేశంలో చర్చించారు.
రెండో  సమావేశం వివిధ రకాల మోసాలపై దర్యాప్తు, ఎన్ఫోర్స్మెంట్ పై, ముఖ్యంగా హబ్-అండ్-స్పోక్ మోడల్‌లో, పోటీదారుల మధ్య సమన్వయాన్ని కేంద్ర సంస్థ ద్వారా సులభతరం చేసే విధానం పై ప్రత్యేక దృష్టి సారించింది.

విద్యార్థులు, పరిశోధకులు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలతో సహా విభిన్న వర్గాలను ఇది విశేషంగా ఆకర్షించింది. దేశంలో వేగంగా మారుతున్న ఆర్థిక వాతావరణంలో కాంపిటీషన్ చట్టాన్ని అమలు చేయడంలో ఉన్న ఆచరణాత్మక సవాళ్లపై ప్రయోజనకరమైన చర్చలకు ఇది అవకాశం కల్పించింది.
వాటాదారులతో నిమగ్నమవ్వడానికి, దాని అమలు సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కొనసాగుతున్న సీసీఐ ప్రయత్నాలను ఈ వర్క్‌షాప్ ప్రతిబింబిస్తుందని సీసీఐ చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. ఆధునిక మార్కెట్ల ద్వారా ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించడంలో నియంత్రణ సంస్థలు, విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సహకారం ప్రాముఖ్యతను కూడా ఈ వర్క్‌షాప్ ప్రముఖంగా చర్చించింది. 

 

***



(Release ID: 2063012) Visitor Counter : 3


Read this release in: English , Urdu