ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ)కు ఇంటర్నేషనల్ మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్ ఫోరమ్ (ఐఎమ్‌డీఆర్ఎఫ్)లో అనుబంధ సభ్యత్వం; ఆరోగ్యం - కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ అధీనంలో సీడీఎస్ సీఓ పని చేస్తోంది


ఐఎమ్‌డీఆర్ఎఫ్ లో సభ్యత్వం సీడిఎస్‌సీఓ వైద్య సాధనాల నియంత్రణ వ్యవస్థను పటిష్ట పరచి, ఎప్పటికప్పుడు తలెత్తే సాంకేతిక పరమైన సవాళ్ళను ఎదుర్కోవడంలో సీడీఎస్ సీఓ కు తోడ్పడనుంది

Posted On: 03 OCT 2024 11:56AM by PIB Hyderabad

దేశ వైద్య సంబంధిత సాధనాల నియంత్రణ వ్యవస్థను ప్రపంచ స్థాయిలో ఆమోదం లభించిన ప్రమాణాలకు సరిపో లేదిగా  ఉండేటట్లు చూసేందుకు ఉద్దేశించిన ఓ సమగ్ర నిబంధనావళిని ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.  ఈ కార్యక్రమం వైద్య పరికరాల రంగంలో వృద్ధిని, నవకల్పనను ప్రోత్సహించే నియంత్రణ వ్యవస్థను పెంపొందింప చేయ దలుస్తోంది.

ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లో భాగంగా ఉన్న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడిఎస్‌సీఓ) తాను నిర్వహిస్తున్న వైద్య సాధనాల నియంత్రణ వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు  అనుగుణమైందిగా మలచుకోవాలన్న ఉద్దేశంతోను, దేశీయ పరిశ్రమలో పోటీతత్వాన్ని పెంచాలన్న లక్ష్యంతోను, ఇతర దేశాలలో తన ప్రాముఖ్యాన్ని పెంచుకోవాలన్న దృష్టితోను ఇంటర్‌నేషనల్ మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్ ఫోరమ్ (ఐఎమ్‌డిఆర్ఎఫ్) లో అనుబంధ సభ్యత్వం కోసం  ఈ సంవత్సరంలోనే దరఖాస్తు పెట్టుకొంది.  సీడిఎస్‌సీఓ దరఖాస్తు ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని వాషింగ్టన్ లో గల సియాటెల్ లో కిందటి నెలలో ఐఎమ్‌డీఆర్ఎఫ్ తన 26వ సమావేశాలను జరిపిన సందర్భంగా సమీక్షించింది. సీడిఎస్‌సీఓ ఉన్నతాధికారులతో ఐఎమ్‌డీఆర్ఎఫ్ నిర్వహణ సంఘం (ఎమ్‌సీ) చర్చించిన తరువాత ఫోరమ్ లో అనుబంధ సభ్యత్వాన్ని సీడిఎస్‌సీఓ కు ఇచ్చింది.

అంతర్జాతీయ వైద్య సాధనాలకు సంబంధించిన నియమాలలో పొందిక ప్రక్రియను, మేలుకలయికల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రపంచ వైద్య సాధనాల నియంత్రణదారు సంస్థల సహకార ప్రదాన సమూహం రూపంలో ఇంటర్‌నేషనల్ మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్ ఫోరమ్ (ఐఎమ్‌డీఆర్ఎఫ్)  ను 2011 లో ఏర్పాటు చేశారు. ఈ ఫోరమ్  సభ్యత్వ దేశాలలో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ద యూరోపియన్ యూనియన్ (ఈయూ), జపాన్, యునైటెడ్ కింగ్ డమ్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణ కొరియా, సింగపూర్ లతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ)కు చెందిన నియంత్రణ ప్రాధికార సంస్థలు కలిసివున్నాయి.  ఐఎమ్‌డీఆర్ఎఫ్ లో అనుబంధ సభ్యత్వాన్ని సాధించడం వల్ల, ప్రపంచ వ్యాప్తంగా నియంత్రణ ప్రాధికార సంస్థలపై ఆధారపడడానికి, వాటితో సమన్వయాన్ని నెలకొల్పుకోవడానికి కీలక అవకాశాలు అంది రానున్నాయి.

ఈ సభ్యత్వం ప్రపంచం అంతటా నియంత్రణ సంబంధిత అవసరాలను సమన్వయ పరచుకోవడంలో సాయపడుతుంది. ఫలితంగా తయారీదారు సంస్థలకు జటిలత తగ్గనుంది. పరస్పర సహకారాన్ని, మేలైన నియంత్రణ నిబంధనలను ప్రోత్సహించడంలో ముందుకు సాగిపోతూ, ప్రజారోగ్యాన్ని కాపాడడంలో సహాయకారి కానుంది.  అంతేకాకుండా, ఇది నవకల్పనలోను, కొత్త వైద్య సాధనాలను సకాలంలో మన దేశానికి రప్పించుకోవడంలోను దోహదం చేయనుంది.

దాపరికానికి తావు ఇవ్వకుండా ఐఎమ్‌డీఆర్ఎఫ్ నిర్వహించే సదస్సులలో, భారతదేశం ఒక అనుబంధ సభ్యత్వ దేశం హోదాలో పాల్గొనగలుగుతుంది. ఈ కారణంగా ఇతర నియంత్రణదారు సంస్థల నుంచి సాంకేతిక పరమైన విషయాలలో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి, అత్యాధునిక వైద్య సంబంధిత  సాధనాల నియంత్రణ సంబంధిత వ్యూహాలపైన, తత్సంబంధిత ధోరణుల పైన చర్చలో పాల్గొనడానికి, భారతదేశం అనుభవాలను, భారతదేశం అవలంబిస్తున్న దృష్టికోణాన్ని గురించిన అభిప్రాయాలను తెలుసుకోవడానికి, మన దేశ వైద్య ఉపకరణాల నియంత్రణ యంత్రాంగానికి ఐఎమ్‌డీఆర్ఎఫ్ పత్రాలను పాక్షికంగా గాని లేదా ఏకమొత్తంగా గాని ఒక ప్రాతిపదికగా ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది.  ఇది సీడిఎస్‌సీఓ వైద్య పరికరాల నియంత్రణ వ్యవస్థను బలపరచనుంది. నానాటికీ కొత్త సవాళ్లు తలెత్తుతుండగా వాటిని పరిష్కరించడంలో తోడ్పడడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలో, సురక్షను అందించడంలో పూచీపడడం కూడా సాధ్యం కానుంది.  అలాగే సీడిఎస్‌సీఓ కు, తన వైద్య సంబంధి సాధనాల నియంత్రణ విధానానికి అంతర్జాతీయంగా గుర్తింపును పొందాలనే లక్ష్య సాధన దిశలో పయనించడానికి సైతం ఈ సభ్యత్వం సహకరించనుంది.

ఈ అనుబంధ సభ్యత్వం భారతదేశంలో వైద్య పరికరాల తయారీదారు సంస్థలు ఐఎమ్‌డీఆర్ఎఫ్ సభ్యత్వ దేశాల తాలూకు నియంత్రణ పరమైన నిబంధనలను అనుసరించడానికి తోడ్పడుతుంది. తద్ద్వారా అంతర్జాతీయ బజారులో ‘‘బ్రాండ్ ఇండియా’’ను బలపరచడంలో సానుకూల ఫలితాలను ఈ అనుబంధ సభ్యత్వం అందించనుంది.

 

***



(Release ID: 2061960) Visitor Counter : 14