సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
మరాఠీ, పాలీ, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదం
Posted On:
03 OCT 2024 8:31PM by PIB Hyderabad
మరాఠీ, పాలీ, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదాను కల్పించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. భారతదేశం లోతైన, ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రాచీన భాషలు సంరక్షణగా ఉండడంతో పాటు వివిధ సామజిక చారిత్రక, సాంస్కృతిక విజయాల సారాన్ని ప్రతిబింబిస్తాయి.
అంశాల వారీగా వివరాలు, నేపథ్యం:
కేంద్ర ప్రభుత్వం "ప్రాచీన భాష" అనే కొత్త క్యాటగిరీని 2004 అక్టోబర్ 12వ తేదీన ప్రవేశపెట్టి, తమిళాన్ని ప్రాచీన భాషగా ప్రకటించింది. ఆ హోదా కోసం కొన్ని ప్రమాణాలను రూపొందించింది:
ఏ. ఆ భాషకు ప్రారంభ గ్రంథాల అధిక ప్రాచీనత/ వెయ్యి సంవత్సరాలకుపైగా నమోదిత చరిత్ర ఉండాలి.
బి. తరతరాలుగా భాష మాట్లాడేవారు... విలువైన వారసత్వంగా పరిగణించే పురాతన సాహిత్యం/గ్రంథాలు.
సి. సాహిత్య సంప్రదాయం దానంతట అది పుట్టినదై ఉండాలి. మరొక మాట్లాడే సమాజం నుంచి తెచ్చుకున్నది కారాదు.
ప్రాచీన భాష హోదా కోసం ప్రతిపాదిత భాషలను పరిశీలించడానికి 2004 నవంబర్ లో సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక భాషా నిపుణుల కమిటీ (ఎల్ఈసి)ని ఏర్పాటు చేసింది.
2005 నవంబర్ లో ఈ ప్రమాణాలను సవరించారు. సంస్కృతాన్ని ప్రాచీన భాషగా ప్రకటించారు.
I. 1500-2000 సంవత్సరాల కాలం నాటిదై, ప్రారంభ గ్రంథాలు/నమోదిత చరిత్ర అత్యంత ప్రాచీనమైనదిగా ఉండాలి.
II. తరతరాలుగా మాట్లాడే వారిచే విలువైన వారసత్వంగా పరిగణించే పురాతన సాహిత్యం/గ్రంథాలు.
IV. ప్రాచీన భాష, సాహిత్యం ఆధునికానికి భిన్నంగా ఉండటం వలన, ప్రాచీన భాష, దాని తరువాతి రూపాలు లేదా దాని శాఖల మధ్య అంతరాయం ఉండవచ్చు.
కేంద్ర ప్రభుత్వం, ఇప్పటివరకు ఈ కింది భాషలకు ప్రాచీన భాష హోదాను కల్పించింది:
భాష
|
నోటిఫికేషన్ తేదీ
|
తమిళం
|
12/10/2004
|
సంస్కృతం
|
25/11/2005
|
తెలుగు
|
31/10/2008
|
కన్నడ
|
31/10/2008
|
మలయాళం
|
08/08/2013
|
ఒడియా
|
01/03/2014
|
2013లో మహారాష్ట్ర ప్రభుత్వం నుండి మరాఠీకి ప్రాచీన భాష హోదా ఇవ్వాలంటూ మంత్రిత్వ శాఖకు ఒక ప్రతిపాదన అందగా, దానిని ఎల్ఈసికి పంపారు. ఎల్ఈసి మరాఠీని ప్రాచీన భాషగా సిఫార్సు చేసింది. 2017లో మరాఠీకి ప్రాచీన భాష హోదా కల్పించిన సందర్బంలో, అంతర్-మంత్రిత్వ శాఖల సంప్రదింపులప్పుడు క్యాబినెట్ కోసం ఒక ముసాయిదా పత్రాన్ని రూపొందిస్తూ, ప్రమాణాలను సవరించి కఠినతరం చేయాలని హోంమంత్రిత్వ శాఖ సూచించింది. పీఎంఓ దీనిపై వ్యాఖ్యానిస్తూ ఎన్ని ఇతర భాషలకు అర్హత సాధించే అవకాశం ఉందో తెలుసుకోవడానికి మంత్రిత్వ శాఖ కసరత్తు చేయవచ్చని పేర్కొంది.
ఈలోగా, పాలీ, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించాలంటూ బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ నుండి కూడా ప్రతిపాదనలు వచ్చాయి.
తదనుగుణంగా, భాషాశాస్త్ర నిపుణుల కమిటీ (సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో) ఈ ఏడాది జులై 25న జరిగిన సమావేశంలో ఈ క్రింది విధంగా ప్రమాణాలను ఏకగ్రీవంగా సవరించింది. ఎల్ఈసి కోసం సాహిత్య అకాడమీని నోడల్ ఏజెన్సీగా నియమించారు.
i. 1500-2000 సంవత్సరాల కాలం నాటి ఆ భాష ప్రారంభ గ్రంథాలు/నమోదిత చరిత్ర అత్యంత ప్రాచీనమైనదిగా ఉండాలి.
ii. తరతరాలుగా మాట్లాడే వారు వారసత్వంగా పరిగణించే ప్రాచీన సాహిత్యం/గ్రంథాలు ఉండాలి.
iii. జ్ఞాన గ్రంథాలు, ముఖ్యంగా కవిత్వం, ఎపిగ్రాఫికల్, శాసనాల ఆధారాలతో పాటు గద్య గ్రంథాలు.
iv. ప్రాచీన భాషలు, సాహిత్యం దాని ప్రస్తుత రూపానికి భిన్నంగా ఉండవచ్చు లేదా దాని శాఖల తరువాతి రూపాలతో అంతరాయం ఉండవచ్చు.
సవరించిన ప్రమాణాల ప్రకారం ప్రాచీన భాషగా పరిగణించడానికి ఈ కింది భాషలను కమిటీ సిఫార్సు చేసింది.
I. మరాఠీ
II. పాలీ
III. ప్రాకృతం
IV. అస్సామీ
V. బెంగాలీ
అమలుకు వ్యూహం, లక్ష్యాలు:
ప్రాచీన భాషలను ప్రోత్సహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ పలు చర్యలు చేపట్టింది. సంస్కృత భాష ప్రచారం కోసం 2020లో పార్లమెంటు చట్టం ద్వారా మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు స్థాపించింది. ప్రాచీన తమిళ గ్రంథాలను అనువదించడానికి, పరిశోధనను ప్రోత్సహించడానికి, విశ్వవిద్యాలయ విద్యార్థులు, తమిళ భాషా పండితులకు కోర్సులను అందించడానికి సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ ఏర్పాటు చేశారు. ప్రాచీన భాషల అధ్యయనం, పరిరక్షణను మరింత మెరుగుపరచడానికి, మైసూరులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలో ప్రాచీన కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియాలలో అధ్యయనాల కోసం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లు స్థాపించారు. ఈ కార్యక్రమాలతో పాటు, ప్రాచీన భాషా రంగంలో సాధించిన విజయాలను గుర్తించి ప్రోత్సహించడానికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు స్థాపించారు. విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ప్రాచీన భాషలకు ప్రయోజనాలను విస్తరించారు. వాటిలో ప్రాచీన భాష కోసం జాతీయ అవార్డులు, విశ్వవిద్యాలయాలలో ప్రత్యేక పీఠాలు, ప్రాచీన భాష ప్రోత్సాహానికి కేంద్రాల ఏర్పాటు మొదలైనవి ఉన్నాయి.
ఉపాధి కల్పనతో సహా ప్రధాన ప్రభావం:
భాషలను ప్రాచీన భాషలుగా గుర్తించడం వల్ల ముఖ్యంగా విద్యా, పరిశోధన రంగాలలో గణనీయమైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అదనంగా, ఈ భాషల పురాతన గ్రంథాల సంరక్షణ, డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్ ఆర్కైవింగ్, అనువాదం, ప్రచురణ, డిజిటల్ మీడియాలో ఉద్యోగాలను కల్పిస్తుంది.
ఈ భాషల పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు, జిల్లాలు:
దీనిలో ప్రాథమికంగా భాగస్వాములైన రాష్ట్రాలు మహారాష్ట్ర (మరాఠీ), బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ (పాలీ, ప్రాకృతం), పశ్చిమ బెంగాల్ (బెంగాలీ), అస్సాం (అస్సామీ). విశాలమైన సాంస్కృతిక, విద్యాపరమైన ప్రభావం జాతీయంగా, అంతర్జాతీయంగా విస్తరిస్తుంది.
***
(Release ID: 2061800)
Visitor Counter : 100