బొగ్గు మంత్రిత్వ శాఖ
‘స్వచ్ఛ భారత్ దివస్’ కార్యక్రమం ద్వారా ‘స్వచ్ఛతా హీ సేవా’ ప్రచారోద్యమాన్ని విజయవంతంగా ముగించిన బొగ్గు శాఖ
Posted On:
02 OCT 2024 3:15PM by PIB Hyderabad
గాంధీ జయంతి రోజున నిర్వహించిన ‘స్వచ్ఛ భారత్ దివస్’ కార్యక్రమం ద్వారా కేంద్ర బొగ్గు గనుల శాఖ ‘స్వచ్ఛతా హీ సేవా’ ప్రచారోద్యమాన్ని విజయవంతంగా ముగించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చే ఆరోగ్యవంతమైన భారతదేశం గురించి బాపూ సూత్రాలకు అనుగుణంగా, మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమం ఇది. జాతిపిత ఆశయాన్ని సాకారం చేసేందుకు పారిశుద్ధ్యం ప్రాముఖ్యాన్ని తెలియచేస్తూ ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ బొగ్గుశాఖ పెద్దయెత్తున పరిశుభ్రతా కార్యక్రమాలను చేపట్టింది. స్వచ్ఛత గురించి గాంధీజీ బోధనలను గుర్తు చేసుకున్న ఈ కార్యక్రమం, పరిశుభ్రత కలిసికట్టు బాధ్యత అని స్పష్టం చేసింది.
బొగ్గు శాఖ అదనపు కార్యదర్శులు శ్రీమతి రూపిందర్ బ్రార్, శ్రీమతి విస్మితా తేజ్, సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ కస్సీ , ఇతర ఉన్నతాధికారులు ప్రచారాన్ని ముందుండి నడిపారు. ఆరోగ్యకర పర్యావరణం గురించి స్పృహ, స్వచ్ఛత పట్ల గల నిబద్ధతకు గుర్తుగా వీరంతా కార్యక్రమంలో క్రియాశీలకంగా పాలుపంచుకున్నారు.
న్యూఢిల్లీ శాస్త్రీ భవన్ పరిసరాలను శుభ్రం చేయాలన్న పిలుపునకు స్పందించి మంత్రిత్వ శాఖకు చెందిన బృందం ఉత్సాహంగా స్వచ్ఛతా కార్యకలాపాల్లో పాల్గొంది. కేవలం చెత్త ఏరివేతకే పరిమితం కాక, తడి/పొడి వ్యర్థాలను వేరుచేయవలసిన అవసరాన్ని తెలియజేస్తూ, పర్యావరణ పరిశుభ్రత పట్ల అవగాహన పెరగవలసిన అవసరాన్ని గురించి వీరు తెలియచేశారు. అనంతరం జరిగిన వాకథాన్ లో అధికారులు, సిబ్బంది సహా ప్రజలు పెద్దయెత్తున పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల కృషిని గౌరవిస్తూ, కృతజ్ఞతాపూర్వకంగా వారికి అనేక బహుమతులను అందజేశారు. ‘స్వచ్ఛతా హీ సేవా’ ప్రచారోద్యమం ముగిసినప్పటికీ పరిశుభ్రతను కొనసాగిస్తామని శాఖ అధికారులు ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిశుభ్రత కోసం సమాజపరమైన భాగస్వామ్య ప్రాముఖ్యాన్ని ఈ కార్యక్రమం స్పష్టం చేసింది.
అభివృద్ధి చెందిన సమాజ స్థాపనలో స్వచ్ఛత, మెరుగైన ప్రజారోగ్యం కీలకమన్న గాంధీజీ భావనకి కట్టుబడిన మంత్రిత్వశాఖ నిబద్ధతకి కార్యక్రమం దర్పణంగా నిలిచింది. పరిశుభ్రమైన దేశం, పర్యావరణ హితం లక్ష్యాలుగా, మహాత్ముని ఆశయాలు దారిదీపాలుగా, మంత్రిత్వశాఖకు చెందిన సిబ్బంది అధికారులు, ‘స్వచ్ఛ భారత్ దివస్’ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
(Release ID: 2061431)
Visitor Counter : 54