సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav g20-india-2023

గాంధీ జయంతి సందర్బంగా ఖాదీ చేతివృత్తిదారులకు వేతనంలో వృద్ధి, ప్రత్యేక డిస్కౌంట్ లు


బాబా ఖడక్ సింగ్ మార్గ్ లోని ఖాదీ భవన్ లో కొనుగోళ్లు జరిపి ప్రత్యేక డిస్కౌంట్ ప్రచార ఉద్యమాన్ని ఆధికారికంగా ప్రారంభించిన శ్రీ జె.పి.నడ్డా, శ్రీ జీతన్ రాం మాంఝి, శోభ కరంద్లాజే లు


అక్టోబరు 2 నుంచి నూలు వడికే వారికి 25 శాతం, నేత కార్మికులకు 7 శాతం చొప్పున పెరిగిన వేతనాల అమలు

పూజ్య బాపూ దార్శనికతకు అనుగుణంగా, చేతివృత్తి కార్మికుల పట్ల దేశభక్తితో పాటు వారి సంక్షేమమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ ప్రాధాన్యం: కేవీఐసీ చైర్ మన్ శ్రీ మనోజ్ కుమార్

Posted On: 02 OCT 2024 8:39PM by PIB Hyderabad

గాంధీ జయంతి నాడు, దేశవ్యాప్తంగా ఖాదీ చేతి పని వారికి వేతనంలో చెప్పుకోదగ్గ పెంపుదలను ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంఘం (కేవీఐసీ) చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ ప్రకటిస్తూ, పేద ప్రజల సంక్షేమం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను చాటిచెప్పారు. కేంద్ర సూక్ష్మ, లఘు, మధ్య తరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ)  శాఖ అధీనంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంస్థయే కేవీఐసీ. చరఖాలపై పనిచేస్తూ నూలు దారాన్ని వడికే వారికి వారి వేతనంలో 25 శాతం వృద్ధి ఉంటుంది; కాగా మగ్గాలపై పనిచేసే నేతకారులకు ఇంతవరకు అందుతున్న వేతనాని కన్నా ఇకపై 7 శాతం ఎక్కువగా వేతనం లభించనుంది. దీనికి అదనంగా, ఖాదీ ఉత్పాదనలపై 20 శాతం, అలాగే గ్రామీణ పరిశ్రమల ఉత్పాదనలపైన 10 శాతం వంతున ప్రత్యేక డిస్కౌంటులను ఇవ్వడాన్ని న్యూ ఢిల్లీ లోని కనాట్ ప్లేస్ లో గల ప్రధాన విక్రయకేంద్రం ఖాదీ భవన్ లో మొదలుపెట్టారు.

మహాత్మా గాంధీ జయంతిని స్మరించుకొంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర ఎమ్ఎస్ఎమ్ఇ శాఖ మంత్రి శ్రీ జీతన్ రాం మాంఝి, ఎమ్ఎస్ఎమ్ఇ, కార్మిక- ఉపాధి శాఖ మంత్రి శోభ కరంద్లాజే, కేవీఐసీ చైర్మన్ శ్రీ  మనోజ్ కుమార్ లతో పాటు ఇతర ఉన్నతాధికారులు బాబా ఖడక్ సింగ్ మార్గ్ లోని ఖాదీ భవన్ లో వివిధ ఉత్పాదనలను కొనుగోలు చేసి, ప్రత్యేక డిస్కౌంట్ ల తాలూకు ప్రచార ఉద్యమాన్ని ఆధికారికంగా ప్రారంభించారు. మంత్రి శ్రీ జె.పి. నడ్డా ఒక ఖాదీ కుర్తా కు ఉపయోగపడే వస్త్రాన్ని, గ్రామీణ పరిశ్రమలలో తయారైన కొన్ని ఉత్పాదనలను కొనుగోలు చేశారు.  అందుకు తగ్గ ఖరీదును ఆన్ లైన్ మాధ్యమం ద్వారా ఆయన చెల్లించారు. ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ, ఖాదీ ఉత్పాదనలను కొనుగోలు చేయవలసిందిగా దేశ పౌరులకు విజ్ఞ‌ప్తి చేశారు.

ఖాదీని, దేశవాళీ ఉత్పాదనలను ఆదరిస్తూ ఆత్మనిర్భర్ భారత్ ప్రచార ఉద్యమంలో ఒక భాగం కండి అంటూ శ్రీ జీతన్ రాం మాంఝి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు.

కేవీఐసీ చైర్మన్శ్రీ  మనోజ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘చరఖాలో వడికిన ప్రతి నూలు పోగులోనూ నాకు దైవం కనిపిస్తోంది ’’ అని పలికిన మహాత్మ గాంధీ మాటలను పునరుద్ఘాటించారు. ‘‘ఈ తత్వాన్ని కేవీఐసీ ఒంట బట్టించుకొని, ‘‘చరఖా విప్లవం’’ మాధ్యమం ద్వారా పేదల సంక్షేమానికి ఉపయోగపడే వస్త్రాలను నేస్తూ వస్తోంద’’ని ఆయన అన్నారు.

నూలు వడికే వారికి 25 శాతం వేతన వృద్ధి తో పాటు చేనేత కార్మికులకు 7 శాతం వేతన వృద్ధి గురించి గత నెల 17న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్బంగా పోర్ బందర్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. మహాత్మా గాంధీ పుట్టింది పోర్ బందర్ లోనే. సవరించిన వేతనాలు గాంధీ జయంతి అయిన అక్టోబరు 2, 2024 నాటి నుంచి అమలులోకి వచ్చాయి. ఇదివరకు ఒక నూలు కండె పనికి 10 రూపాయలు సంపాదించిన స్పిన్నర్ లు ఇకరూ.12.50   అందుకొంటారని, ఒక్కో నూలు కండె పనికి రూ.2.50  వేతన వృద్ధి ఉందని శ్రీ కుమార్ వివరించారు. ఆయన తన పదవికాలంలో స్పిన్నర్ లు, వీవర్ ల వేతనాలలో వృద్ధి చోటుచేసుకోవడం ఇది రెండో సారి అన్నారు. క్రితం సారి వేతనాలను 2023 ఏప్రిల్ 1న పెంచారు. అప్పట్లో ఒక్కో నూలు కండె పనికి సంబంధించిన వేతనాలను రూ.7.50  నుంచి పెంచి రూ. 10  గా చేశారు.

నూలు వడికే, నేత నేసే కార్మికుల జీవనాలను  ‘ఖాదీ విప్లవం’ ద్వారా మార్చివేసిన ఖ్యాతి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వానికి దక్కుతుంది అని శ్రీ మనోజ్ కుమార్ అన్నారు. ఖాదీ రంగం వ్యాపారం కిందటి ఆర్థిక సంవత్సరంలో 1.55 లక్షల కోట్ల రూపాయలను మించింది. ఖాదీ చేతివృత్తుల వారికి ప్రయోజనం చేకూర్చడానికి వారి వేతనాలను పెంచాలని కేవీఐసీ నిర్ణయించింది. దేశమంతటా చూస్తే పేర్లను నమోదు చేయించుకొన్న ఖాదీ సంస్థలు దాదాపుగా మూడు వేలు ఉన్నాయి. అవి సుమారు నాలుగు  లక్షల తొంభై ఎనిమిది వేల మంది ఖాదీ చేతివృత్తుల వారికి బతుకు తెరువును కల్పిస్తున్నాయి. వీరిలో ఇంచుమించుగా నూటికి ఎనభై మంది మహిళా కార్మికులే అని శ్రీ కుమార్ వివరించారు. పెరిగిన వేతనాలు ఈ చేతివృత్తి కార్మికులకు ఆర్థికంగా సాధికారితను కల్పిస్తాయి. గత పదేళ్లుగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలనకాలంలో, వేతనాలను అందాజుగా 213 శాతం పెరిగాయి, ఇది ఖాదీ రంగం ద్వారా గ్రామీణ భారతావనికి ఆర్థిక సాధికారిత కల్పన ను సంకేతిస్తున్నది అని శ్రీ కుమార్ అభివర్ణించారు.

శ్రీ మనోజ్ కుమార్ ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ఒక ప్రత్యేక డిస్కౌంట్ ప్రచారోద్యమాన్ని న్యూ ఢిల్లీ లోని కనాట్ ప్లేస్ లో గల ఖాదీ ప్రధాన విక్రయ కేంద్రం సహా దేశం నలుమూలలా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ డిస్కౌంట్ క్యాంపెయిన్ నేటి నుంచి మొదలై, నవంబరు 30 వరకు అమలవుతుంది. దీనిలో భాగంగా ఖాదీ ఉత్పాదనల పైన 20 శాతం డిస్కౌంటును, గ్రామీణ పరిశ్రమల ఉత్పాదనల పైన 10 శాతం డిస్కౌంటును ఇస్తున్నారు.

మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న, ప్రజాదరణ పాత్రమైన తన ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో చేసిన వినతిని అనుసరిస్తున్నామని చైర్మన్ స్పష్టంచేశారు. కనాట్ ప్లేస్ లోని ఖాదీ భవన్ గత పదేళ్లుగా ఏటా గాంధీ జయంతి నాడు అమ్మకాల పరంగా ఒక సరికొత్త స్థాయిని సాధిస్తూ వచ్చిందన్నారు. గాంధీ జయంతి కి అమ్మకాలు గడచిన మూడు సంవత్సరాలుగా ఒక కోటి రూపాయలను మించాయి. ఈ విక్రయాలు 2021-22లో రూ.1.01 కోట్లు, 2022-23లో రూ.1.34 కోట్లు, 2023-24లో రూ.1.52 కోట్లుగా ఉన్నాయి. ఈ సంఖ్యలు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘వోకల్ ఫర్ లోకల్’, ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉద్యమాలకు ఖాదీ ఏ విధంగా ప్రధాన బిందువుగా నిలచిందీ, ‘న్యూ ఇండియా’లో సరికొత్త ఖాదీ ఉన్నతికి సూచికగా ఉంటున్నదీ చాటిచెబుతున్నాయి.

 

 


 

****



(Release ID: 2061428) Visitor Counter : 14


Read this release in: English , Urdu , Hindi