శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

భారత్ జెన్ ఆవిష్కరణ : తొలిసారిగా ప్రభుత్వ నిధులతో చేపట్టిన బహుళ విధ, విస్తృత భాషా నమూనా కార్యక్రమం

Posted On: 30 SEP 2024 8:33PM by PIB Hyderabad

భారత్ జెన్ పేరుతో అద్భుత  కృత్రిమ మేధ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కృత్రిమ మేధ ద్వారా భాష, సంభాషణలకు సంబంధించి పలు  మౌలిక నమూనాలను రూపొందించి ప్రజాసేవలను విప్లవాత్మకం చేయడం, చిత్రాలు, వీడియోలలోని అంశాలను కంప్యూటర్లు అర్ధం చేసుకునే నమూనాలను (కంప్యూటర్ విజన్) రూపొందించడం ద్వారా ప్రజలు వీటిని మరింత విరివిగా వాడేట్టు చేయడం దీని లక్ష్యం. కేంద్ర శాస్త్ర సాంకేతిక (స్వతంత్ర), భూ విజ్ఞాన శాస్త్ర, ప్రధానమంత్రి కార్యాలయ, అణు ఇంధన , అంతరిక్ష ,సిబ్బంది, ప్రజాఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయమంత్రి శ్రీ జితేంద్ర సింగ్ దృశ్య మాధ్యమం ద్వారా  న్యూఢిల్లీలో ఈరోజు దీనిని ఆవిష్కరించారు.

‘‘దేశీయ సాంకేతికతను మరింత ముందుకు తీసుకువెళ్లాలన్న భారత్ కృతనిశ్చయానికి బారత్ జెన్ ఒక సగర్వ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది మన దేశాన్నిజనరేటివ్ కృత్రిమ మేధ రంగంలో (అంటే,సందేశాలు, చిత్రాలు  సంగీతం, ఆడియో,వీడియోలను ఉపయోగించి వినూత్న విషయాలను క్రోడీకరించే రంగంలో) అంతర్జాతీయ నాయకత్వ స్థానంలో నిలబెడుతుంది. గతంలో వివిధ రంగాలలో పెనుమార్పులకు కారణమైన యుపిఐ వంటి వినూత్న ఆవిష్కరణలు, సాంకేతికతల లాగే ఇది పెనుమార్పులకు దారితీస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం,  ప్రపంచంలోనే తొలిసారిగా ప్రభుత్వ నిధులతో చేపట్టిన బహుళ విధ విస్తృత భాషా నమూనా కార్యక్రమమని ఆయన అన్నారు.ఇది భారతీయ భాషలలో సమ్మిళిత, సమర్థ కృత్రిమ  మేధకు వీలుకల్పించడంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది.  శాస్త్ర సాంకేతిక విభాగానికి చెందిన,  అంతర్   విభాగాల  సైబర్ –భౌతిక వ్యవస్థల జాతీయ కార్యక్రమం కింద ఐఐటి బొంబాయి దీనికి నాయకత్వం  వహిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఎఐ వ్యవస్థలు వివిధ భారతీయ భాషలలో అత్యంత నాణ్యమైన సమాచారాన్ని, బహువిధ అంశాలను రూపొందించ గలుగుతాయి. ఈ ప్రాజజెక్టును ద ఫౌండేషన్ ఫర్ ఐఒటి, ఐఐటి బొంబాయి లోని ఐఓఈ లు  అమలు చేస్తాయి. దీనికి విద్యావిషయక భాగస్వాములుగా ఐఐటి బొంబాయి, ఐఐఐటి హైదరాబాద్, ఐఐటి మండి, ఐఐటి కాన్పూర్, ఐఐటి హైదరాబాద్, ఐఐఎం ఇండోర్, ఐఐటి మద్రాస్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు వ్యవహరిస్తాయి. వీటి తోడ్పాటుతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు.

ఈ కార్యక్రమంలో ఐఐటి బొంబాయి డైరక్టర్, ప్రొఫెసర్ శిరీష్ కేదారే, ప్రొఫెసర్ గణేశ్ రామకృష్ణన్ నాయకత్వంలో కన్సార్టియంకు చెందిన పలువురు ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.

భారత్ జెన్, వినూత్న కృత్రిమ  మేధ  నమూనాలను, వాటి అప్లికేషన్లను ప్రజోపయోగం కోసం రూపొందిస్తుంది. ఇది దేశ సామాజిక సాంస్కృతిక, భాషాపరమైన వైవిధ్యతకు ప్రాధాన్యతనిస్తుంది. దేశ అవసరాలైన సామాజిక సమానత్వం, సంస్కృతీ పరిరక్షణ, భాషా వైవిధ్యతకు సంబంధించిన అవసరాలను తీరుస్తూ, సమాజంలోని అన్ని వర్గాల వారికి కృత్రిమ  మేధ  ద్వారా వినూత్న ఆవిష్కరణలను అందేట్టు చేయడం దీని లక్ష్యం.


దేశంలోని పౌరులందరికీ కృత్రిమ  మేధను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో భారత్ జెన్ ను తీర్చిదిద్దారు. కృత్రిమ  మేధ  అనేది కేవలం పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు మాత్రమే అన్న రీతిలో కాకుండా, జాతీయ ప్రాధాన్యతలైన సంస్కృతీ పరిరక్షణ, సమ్మిళిత సాంకేతిక అభివృద్ధి వంటి అవసరాలను తీర్చే లక్ష్యంతో రూపొందించినట్టు డి ఎస్ టి కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్ తెలిపారు.

భారత్ జెన్ అనేది, నాలుగు కీలక అంశాలతో కూడినది. అవి, బహుబాషలు, బహువిధ మౌలిక నమూనాలు, భారతీయ డాటా సెట్ ఆధారిత వ్యవస్థ, శిక్షణ, ఓపెన్ సోర్స్ ప్లాట్ఫారం, దేశంలో వినూత్న కృత్రిమ మేధ ఆవిష్కారాలకు సంబంధించిన వాతావారణాన్ని అభివృద్ది చేయడం. ఈప్రాజెక్టు రెండు సంవత్సరాలలో పూర్తి కాగలదని అంచనా. దీనివల్ల పలు ప్రభుత్వ, ప్రైవేటు,విద్యా , పరిశోధన సంస్థలు ప్రయోజనం పొందనున్నాయి.

భారత్ జెన్ అక్షర రూపాలు, సంభాషణలు రెండింటికీ   పనికివస్తుంది. ఇది దేశంలోని వివిధ భాషలకు వర్తిస్తుంది. బహుళ భాషలకు  సంబంధించిన సమాచారంపై శిక్షణ ద్వారా ఇది భారతీయ భాషల  సూక్ష్మ మెళకువలను గ్రహిస్తుంది. ఇతర నమూనాల లాగా అంతర్జాతీయ నమూనాలపై ఆధారపడడం కాక, భారత్ జెన్, సమాచార సేకరణలో భారతదేశ కేంద్రిత సమాచారాన్నిఅంటే, భిన్న భాషలు, మాండలికాలు, సాంస్కృతిక నేపథ్యాలు కచ్చితంగా ప్రతిబింబించే విధంగా చూస్తుంది. ఈ రకమైన సమాచార సార్వభౌమత్వం, మన దేశం తన డిజిటల్ వనరులపై, తనదైన కథనాలపై నియంత్రణ కలిగి ఉండడానికి వీలు కలుగుతుంది.

భారత్ జెన్ , దేశ ఆత్మనిర్భర భారత్ దార్శనికతకు అనుగుణమైనది. ఇది దేశ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కృత్రిమ మేధకు సంబంధించిన మౌలిక నమూనాలను అభివృద్ధి చేస్తుంది. ఇండియాలోనే ఎఐ సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా ఇతర దేశాల సాంకేతికతలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది దేశీయంగా కృత్రిమ మేథకు సంబంధించి పరిశ్రమలు,   అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ ఏజెన్సీలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. మౌలిక నమూనాల ద్వారా కృత్రిమ మేథను అందరికీ అందుబాటులోకి తేవడం ద్వారా దీనిని ప్రజాస్వామీకరించడానికి వీలు కలుగుతోంది. అలాగే, సవివరమైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా  ఇది కృత్రిమ మేథ అప్లికేషన్లను ,ఆవిష్కర్తలు, పరిశోధకులు, అంకుర పరిశ్రమలు  సత్వరం చౌకగా రూపొందించడానికి దోహదపడుతుంది. అంతగా డిజిటల్ రంగంలో లేని భారతీయ భాషలను డాటా సమర్థతతో అధ్యయనం చేయడానికి భారత్ జెన్ వీలు కల్పిస్తుంది. ఈ రంగంలో విద్యాసంస్థలతో కలిసి పనిచేస్తుంది, మౌలిక పరిశోధన ద్వారా అంతర్జాతీయ కృత్రిమ మేధ చర్యలలో అంతంతమాత్రంగా కనిపించే భాషలకు అత్యంతావశ్యకమైన కనీస డాటాను ఇది సమకూరుస్తుంది. భారత్ జెన్ అత్యంత సమర్ధతతో కూడిన కృత్రిమ మేధ  పరిశోధక బృందాన్నితీర్చిదిద్దుతుంది. తగిన శిక్షణ కార్యక్రమాలు, హాకథాన్లు, అంతర్జాతీయ నిపుణుల సహకారంతో  దీనిని సాకారం చేస్తుంది. భారత్ జెన్  2026 జూన్ వరకు తన కీలక కార్యకలపాల మార్గసూచిని ముందస్తుగానే రూపొందించుకుంది. ఇందులో కీలకమైనవి, కృత్రిమ మేధ  నమూనాల అభివృద్ధి, ప్రయోగాలు, దేశ అవసరాలకు తగిన రీతిలో కృత్రిమ మేధ  ప్రమాణాల రూపకల్పన వంటివి ఉన్నాయి. భారత్ జెన్ , వివిధ పరిశ్రమలలో కృత్రిమ మేధను మరింత ఉన్నతస్థాయిలో వినియోగించే విధంగా చూడడం, ఆదిశగా ప్రభుత్వం  చర్యలు చేపట్టేలా చూడడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి.


 

*****



(Release ID: 2060574) Visitor Counter : 20


Read this release in: Hindi , English , Urdu