ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘స్వచ్ఛ భారత్ మిషన్’కు పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో అక్టోబరు 2న ‘స్వచ్ఛ భారత్ దివస్-2024’లో పాల్గొంటున్న ప్రధాని


రూ.9,600 కోట్లకుపైగా విలువైన అనేక పారిశుధ్య-పరిశుభ్రత ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన... ప్రారంభోత్సవం;

ఇందులో భాగంగా అమృత్.. అమృత్ 2.0.. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ.. ‘గోబ‌ర్‌’ధ‌న్‌ పథకాల కింద ప్రాజెక్టులకు శ్రీకారం;

‘స్వభావ స్వచ్ఛత.. సంస్కార స్వచ్ఛత’ ఇతివృత్తంగా ‘‘స్వచ్ఛతా హి సేవ-2024’’

Posted On: 30 SEP 2024 8:59PM by PIB Hyderabad

   పరిశుభ్రత దిశగా అత్యంత కీలక ప్రజా ఉద్యమాలలో ఒకటైన ‘స్వచ్ఛ భారత్ మిషన్’ (ఎస్‌బిఎం)కు శ్రీకారం చుట్టి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబరు 2న గాంధీజీ 155వ జయంతి నాడు నిర్వహించే ‘స్వచ్ఛ భారత్ దివస్-2024’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉదయం 10:00  గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

   ఇందులో భాగంగా రూ.9600 కోట్లకుపైగా విలువైన పారిశుధ్య-పరిశుభ్రత‌ సంబంధిత పలు ప‌థ‌కాల‌కు ప్రధాని శంకుస్థాప‌న చేస్తారు. ఈ మేరకు ‘‘అమృత్, అమృత్ 2.0’’ కింద పట్టణ నీటి సరఫరా-మురుగు శుద్ధి వ్యవస్థల మెరుగు లక్ష్యంగా రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పునాదిరాయి వేస్తారు. అలాగే , ‘క్లీన్ గంగ జాతీయ మిషన్’ కింద గంగానది పరీవాహక ప్రాంతాల్లో జల నాణ్యత మెరుగుదల-వ్యర్థాల నిర్వహణపై రూ.1550 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు, ‘గోబ‌ర్‌’ధ‌న్‌ పథకం కింద రూ.1332 కోట్ల విలువైన 15 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సిబిజి) ప్లాంట్ల నిర్మాణానికి నాంది పలుకుతారు.

   గడచిన దశాబ్ద కాలంలో పారిశుధ్య రంగంలో దేశం సాధించిన విజయాలతోపాటు ఇటీవల ముగిసిన ‘స్వచ్ఛతా హి సేవ’ ఫలితాలను కూడా ‘స్వచ్ఛ భారత్ దివస్’ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. జాతీయ స్థాయిలో సాగిన ఈ కృషిని తదుపరి దశకు తీసుకెళ్లడానికీ ఈ కార్యక్రమం ఒక వేదిక కానుంది. అంతేకాకుండా సంపూర్ణ పరిశుభ్రత స్ఫూర్తి దేశం నలుమూలలకూ విస్తరించే దిశగా స్థానిక పరిపాలన సంస్థలు, మహిళా-యువజన సంఘాలు, సాంఘిక సేవా సమాజాల నాయకులు కూడా ఇందులో భాగస్వాములవుతారు.

   దేశవ్యాప్తంగా ‘స్వభావ స్వచ్ఛత-సంస్కార స్వచ్ఛత’ ఇతివృత్తంగా ‘స్వచ్ఛతా హి సేవ-2024’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. పరిశుభ్రత, ప్రజారోగ్యం, పర్యావరణ సుస్థిరతపై నిబద్ధతతో యావత్ ప్రజానీకం మరోసారి ఏకీకృతం కావడంలో ఇది ఎంతగానో దోహదం చేసింది. ఈ మేరకు 17 కోట్ల మందికిపైగా ప్రజల భాగస్వామ్యంతో 19.70 లక్షలకుపైగా కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 6.5 లక్షల మేర పరిశుభ్రత లక్షిత యూనిట్ల రూపాంతరీకరణ సాధించారు. అంతేగాక సుమారు 1 లక్ష ‘సఫాయి మిత్ర’ సురక్ష శిబిరాలు నిర్వహించారు. వీటి ద్వారా 30 లక్షల మంది ‘సఫాయి మిత్ర’ కార్యకర్తలకు ప్రయోజనం చేకూరింది. మరోవైపు ‘అమ్మ పేరిట ఓ మొక్క’ కార్యక్రమం నిర్వహించి, 45 లక్షలకుపైగా మొక్కలు నాటారు.

 

***


(Release ID: 2060547) Visitor Counter : 56