ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
జాతీయ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక సంస్థ ఆధ్వర్యంలో ‘యువ రోజగార్ మేళా’
వేయికి పైగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకున్న 16 కంపెనీలు
Posted On:
29 SEP 2024 7:03PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికరంగ జాతీయ సంస్థ ( ఎన్ఐఈఎల్ఐటీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సంస్థ కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖకు చెందిన స్వతంత్ర శాస్త్ర విజ్ఞాన సంస్థ. యువ రోజ్ గార్ మేళా పేరుతో ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 29న నిర్వహించారు. ఎన్ఐఈఎల్ఐటీకి చెందిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఆ సంస్థ డిల్లీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 16 కంపెనీలు వేయికి పైగా ఉద్యోగాల కోసం అభ్యర్థులను ప్రాధమికంగా ఎంపిక చేసుకున్నాయి. ఈ జాబ్ మేళాలో 1300 మందికిపైగా అభ్యర్థులు పేర్లను నమోదు చేసుకున్నారు.
నైపుణ్య అంతరాల తొలగింపు
ఎన్ఐఈఎల్‌ఐటీ డైరెక్టర్ జనరల్, ఎన్ఐఈఎల్ఐటీ డీమ్డ్ టుబి యూనివర్సిటీ గౌరవ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఢిల్లీ ఎన్ఐఈఎల్‌ఐటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సుభాన్షు తివారీ స్వాగతం పలికారు. శ్రీ త్రిపాఠి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రతి సంవత్సరం దేశమంతటా ఎన్ఐఈఎల్‌ఐటీ నిర్వహించే జాబ్ మేళాల ప్రాముఖ్యతను డాక్టర్ త్రిపాఠి తన ప్రారంభ ఉపన్యాసంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ఏడాది ఎన్ఐఈఎల్‌ఐటీ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన జాబ్ మేళాల్లో కనీసం 6000 ఆఫర్ లెటర్లను అభ్యర్థులకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆ సంఖ్యను పెంచబోతున్నట్లు చెప్పారు. జాబ్ మేళాలు- నైపుణ్యం కలిగిన విద్యార్థులు ఉద్యోగాలను పొందేందుకు, సంస్థల వృద్ధికీ దోహదపడతాయని, ఆర్థిక పురోగతిని బలోపేతం చేస్తాయని అన్నారు. ఢిల్లీలో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్ఐఈఎల్‌ఐటీ ఢిల్లీ బృందం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. జాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలను కూడా ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా జాబ్ మేళాలో పాల్గొన్న వారికి సాప్ట్ స్కిల్స్- సీవీ తయారీ అనే అంశంపై సమాచారపూర్వక సాంకేతిక సమావేశాన్ని నిర్వహించారు. దీన్ని కేంద ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖకు చెందిన డిజిటల్ ఇండియా కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీ మొహమ్మద్ జునెయిద్ నిర్వహించారు.
ఈ సందర్భంగా టెక్ మహీంద్రా, పేటీఎం, ఫ్రాంక్ఫిన్ (షావ్సీ గ్లోబల్ సర్వీసెస్), యాక్సిస్ బ్యాంక్, హిందూజా హౌసింగ్ ఫైనాన్స్, యాక్సెస్ హెల్త్ కేర్, కార్డ్ ఎక్స్‌పర్టైజ్ ఇండియా, ఎబిక్స్ క్యాష్, ఐ ప్రాసెస్, పిఎన్ బి మెట్లైఫ్, సిద్ధి ఇన్ఫోనెట్+సోనీ, ది ఖుష్బూ కన్సల్టింగ్ పార్ట్‌నర్స్ (ప్రొఫెషనల్ రిక్రూట్‌మెంట్ అండ్ కన్సల్టెంట్), వీ కాస్మోస్, కైడోకో, శ్రీజీ ఎంటర్టైన్మెంట్, రిట్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ వంటి కంపెనీల కోసం ప్లేస్‌మెంట్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికరంగ జాతీయ సంస్థ (ఎన్ఐఈఎల్ఐటీ)
గత కొన్ని సంవత్సరాలుగా సమాచార, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐఈసీటీ) రంగంలోను, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల విషయంలోనూ ఎన్ఐఈఎల్ఐటీ ఒక ప్రధాన సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా సంబంధాలు ఉన్నాయి. ఇందులో 52 కు పైగా సొంత, విస్తరణ కేంద్రాలున్నాయి. వీటితోపాటు మరెన్నో ఔత్సాహిక కేంద్రాలు, 8 వేలకు పైగా శిక్షణ కేంద్రాలు ఉన్నాయి.
ఐజ్వాల్, అగర్తల, ఔరంగాబాద్, కాలికట్, గోరఖ్పూర్, ఇంఫాల్, ఇటానగర్, కేక్రీ, కోహిమా, పాట్నా, శ్రీనగర్లలో ఉన్న 11 భాగస్వామ్య విభాగాలతో కలిపి పంజాబ్ లోని రోపర్ ఎన్ఐఈఎల్ఐటీకి ప్రత్యేకమైన కేటగిరీ కింద డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా మంజూరు చేశారు.
జాబ్ ఫెయిర్- యువ రోజ్‌గార్ మేళా
ఎన్ఐఈఎల్ఐటీ నిర్వహిస్తున్న జాబ్ ఫెయిర్ - ”యువ రోజ్‌గర్ మేళా” అనేది ఆ సంస్థ విద్యార్థులకు సమగ్రమైన సహాయాన్ని అందించడంలో సంస్థకున్న అచంచలమైన నిబద్ధతను సూచిస్తోంది. విద్యార్థుల్లో సామర్థ్య పెంపుదలకు, నైపుణ్యాభివృద్ధికి, ఉద్యోగాల సాధనకు దోహదం చేస్తోంది.
రాబోయే సంవత్సరాల్లో ఇటువంటి మరిన్ని ఉద్యోగ మేళాలను నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్లు ఎన్ఐఈఎల్‌ఐటీ ప్రకటించింది.
***
(Release ID: 2060189)
Visitor Counter : 52