ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రక్షణ రంగంలో సృజనాత్మక పరిష్కారాలకు ఊతమిచ్చే లక్ష్యంతో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలీకామ్ ఇంజినీరింగ్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
స్వదేశీ పరిజ్ఞానంతో సాయుధ దళాల బలోపేతం కీలకం, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలీకామ్ ఇంజినీరింగ్ లో ‘సీడాక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ ఏర్పాటు ప్రస్తావన ప్రశంసనీయం: ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్
వికసిత్ భారత్ లక్ష్య సాధన, సామర్ధ్యాల సంపూర్ణ సాకారం కోసం సైన్యం, పరిశోధకుల మధ్య సహకారం తప్పనిసరి : మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలీకామ్ ఇంజినీరింగ్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ కె. హెచ్. గవాస్
Posted On:
27 SEP 2024 12:52PM by PIB Hyderabad
రక్షణ రంగంలో అత్యాధునిక, సృజనాత్మక పరిష్కారాలకు ఊతమిచ్చే లక్ష్యంతో, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ-‘మెయిటి’, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలీకామ్ ఇంజినీరింగ్ -‘ఎంసిటిఇ’ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఖరారయ్యింది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా - ‘మెయిటి’ పరిశోధన, అభివృద్ధి విభాగాలు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పరిచిన వివిధ ఉత్పత్తులను ‘ఎంసిటిఇ’కి అందించాయి.
నూతన సాంకేతికతల వినియోగం శీఘ్రతరం
‘మెయిటి’ మాజీ సహాయమంత్రి, సైన్యాధ్యక్షుడి మధ్య 2023 సమావేశంలో చర్చించిన అంశాల అమలు నిమిత్తం, మంత్రిత్వశాఖ కార్యదర్శి, పరిశోధన, అభివృద్ధి విభాగాల అధిపతులు కళాశాల సందర్శన చేపట్టి, కృత్రిమ మేధ , క్వాంటమ్, చిప్ డిజైన్, 5జి, వ్యూహాత్మక ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ తదితర కీలక రంగాల్లో ఉమ్మడి పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. పెరుగుతున్న భారత సైన్యం అవసరాలు, కొత్త సవాళ్ళ పరిష్కారాలలో నూతన సాంకేతికత సహకరిస్తుంది. అత్యాధునిక సాంకేతికతల కోసం ‘మెయిటి’ చేపట్టే పరిశోధనల్లో ‘ఎంసిటిఇ’ భాగస్వామి అవుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఎదుగుదలకు అనువైన వాతావరణాన్ని కల్పించి, ఆలోచనలు, సాంకేతికతల మార్పిడిని భాగస్వామ్యం ప్రోత్సహిస్తుంది.
‘ఎంసిటిఇ’ లో ‘సీడాక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ ఏర్పాటు
స్వదేశీ పరిజ్ఞానంతో సాయుధ దళాల బలోపేతం కీలకమనీ, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలీకామ్ ఇంజినీరింగ్ లో ‘సీడాక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ ఏర్పాటు ప్రస్తావన ప్రశంసనీయమనీ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక జాతీయ సంస్థ-ఎన్ఐఇఎల్ఐటి, సైన్యానికి శిక్షణనందించేందుకు ముందుకు రావడాన్ని ప్రశంసించిన కృష్ణన్, ‘ఎంసిటిఇ’ లో మిలిటరీ టెక్నాలజీ రీసర్చ్ అండ్ ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటుకు మద్దతు తెలిపారు.
యుద్ధరంగ అవసరాలను గురించి అధ్యయనం చేసేందుకు పరిశోధకుల సహకారం
వికసిత్ భారత్ లక్ష్య సాధన, సామర్ధ్యాల సంపూర్ణ సాకారం కోసం సైన్యం, పరిశోధకుల మధ్య సహకారం తప్పనిసరి అని మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలీకామ్ ఇంజినీరింగ్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ కె. హెచ్. గవాస్ పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం రక్షణ రంగంలో సృజనాత్మక పరిష్కారాలకు దారితీయగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన శ్రీ గవాస్, ఎప్పటికప్పుడు మారుతున్న యుద్ధరంగ సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో సైతం భాగస్వామ్యం ఉపయోగపడుతుందన్నారు.
*****
(Release ID: 2059715)
Visitor Counter : 72