పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్ఎంఎస్)- ఆతిథ్య రంగంలోని ప్రసిద్ధ సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు

Posted On: 27 SEP 2024 2:10PM by PIB Hyderabad

   అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో ఇవాళ (2024 సెప్టెంబరు 27) ఆతిథ్య రంగంలోని 8 ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్’ (సిఐహెచ్ఎం) ప్రత్యేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సంస్థలలో ‘‘ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సిఎల్‌), ‘ఐహెచ్‌జి’ హోటల్స్ అండ్ రిసార్ట్స్, మారియట్ ఇంటర్నేషనల్, లలిత్ సూరి హాస్పిటాలిటీ గ్రూప్, ‘ఐటిసి’ గ్రూప్ ఆఫ్ హోటల్స్, అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, రాడిసన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్’’ ఉన్నాయి.

   ఆయా ఆతిథ్య రంగ సంస్థల జాతీయస్థాయి అధిపతులు, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారుల సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాల అనంతరం పరస్పరం మార్పిడి చేసుకున్నారు.

భారతీయ ఆతిథ్యాన్ని ప్రపంచానికి రుచి చూపడంతోపాటు పర్యాటక రంగంలో భారత నైపుణ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కేంద్ర పర్యాటక శాఖ లక్ష్యనిర్దేశం చేసుకుంది. ఈ మేరకు  ‘ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్’తో ‘పరిశ్రమ భాగస్వాములు’ కావడంపై ఆసక్తిగల సంస్థలను ఆహ్వానించింది. ఈ భాగస్వామ్యం కింద వ్యవస్థాపరమైన అభివృద్ధి, బోధక సిబ్బందిని సిద్ధం చేయడం, విద్యార్థులకు ప్రవేశం-శిక్షణ-మార్గనిర్దేశం తదితర చర్యలు చేపడతారు. తదనుగుణంగా తొలిదశలో ఆతిథ్య రంగంలోని 8 ప్రసిద్ధ సంస్థలను నిర్దిష్ట ‘సిఐహెచ్ఎం’కు ‘పరిశ్రమ భాగస్వాములు’గా మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది.

   ఈ నేపథ్యంలో ‘ఇనిస్టిట్యూట్లు-పరిశ్రమ భాగస్వాముల’ మధ్య సహకారానికి సంబంధించి వివిధ రంగాలు, కార్యకలాపాలను ఆయా ఒప్పందాలు సూచనాత్మకంగా నిర్దేశిస్తున్నాయి. తదనుగుణంగా వాటినుంచి కొన్నిటిని ఎంచుకోవడంతోపాటు కొత్త రంగాలను జోడించేందుకు ఆయా సంస్థలకు స్వేచ్ఛ ఉంటుంది. ఆయా ఒప్పందాల సంబంధిత వివరాలను క్లుప్తంగా దిగువన చూడవచ్చు:

విద్యార్థులకు ప్రవేశం-శిక్షణ

·   పరిశ్రమ మార్గదర్శకులు, మార్గదర్శక శిక్షణతో విద్యార్థుల అనుసంధానం

·   నిపుణుల ద్వారా పరిశ్రమకు తగిన నైపుణ్యాలపై నిర్ణీత వ్యవధితో తరగతుల నిర్వహణ

·   మాస్టర్‌క్లాసులు-బూట్‌క్యాంప్‌లు

·   ప్రత్యక్ష అనుభవ కార్యక్రమాల ద్వారా అభ్యాసం

·   కెరీర్ గైడెన్స్-కౌన్సెలింగ్‌

·   విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌-నియామక అవకాశాల సౌలభ్యం.

·   పరిశ్రమ అవసరాలు-ఆకాంక్షల మేరకు ‘సంస్థల’లో విద్య, నైపుణ్యం నాణ్యత మెరుగుపరిచే ఇతర కార్యకలాపాలు

బోధన సిబ్బందిని

సిద్ధం చేయడం

·   బోధన సిబ్బందికి శిక్షణ-పరిశ్రమల ప్రత్యక్ష అనుభవ కార్యక్రమాలు

·   బోధన సిబ్బందికి స్వల్పకాలిక పునశ్చరణ తరగతులు

·   ఆతిథ్య, హోమ్‌స్టే పరిశ్రమలో అత్యుత్తమ పద్ధతులను వివరించే మాన్యువల్‌లు, మార్గదర్శకాలు, అధ్యయనాలకు సౌలభ్య కల్పన

·   బోధన సిబ్బంది సభ్యులతో పరిశోధన సహకారం

·   పరిశ్రమ ధోరణులు, అవసరాల మేరకు కాలానుగుణంగా బోధకుల నైపుణ్యోన్నతికి తోడ్పడే ఏదైనా ఇతర కార్యాచరణ

స్వల్పకాలిక పర్యాటక-ఆతిథ్య నైపుణ్యం-అవగాహన

·   హోమ్‌స్టే, ‘ఎంఎస్ఎంఇ’లు, స్థానిక హోటళ్లు-రెస్టారెంట్లు, స్వయం సహాయ బృందాలు, ఇతర పర్యాటక-ఆతిథ్య సంస్థల బోధక సిబ్బంది తదితర భాగస్వాముల కోసం ఎప్పటికప్పుడు స్వల్పకాలిక పర్యాటక-ఆతిథ్య కోర్సుల నిర్వహణ.

వ్యవస్థాపరంగా మౌలిక సదుపాయాల కల్పన

·   పరిశ్రమ ప్రమాణాల మేరకు మౌలిక సదుపాయాలతోపాటు సౌకర్యాల మెరుగుదలకు తోడ్పడే వనరులు, అవకాశాలను గుర్తించడంలో చేయూత

·   ఇన్‌స్టిట్యూట్‌లలో ఆవిష్కరణ-వ్యవస్థపన కార్యక్రమాలకు మద్దతు

·   విద్యార్థులకు ప్రవేశ స్థాయిలో సంతృప్తికర పని వాతావరణం కల్పన, సముచిత భృతి చెల్లింపు తదితర అంశాల సమర్థ పరిష్కారం దిశగా చర్యలు

·   పర్యాటక-ఆతిథ్య నైపుణ్యం దిశగా ఇన్‌స్టిట్యూట్‌ను అంతర్జాతీయ స్థాయి నైపుణ్య కూడలిగా రూపొందించే సిఫారసులు, సంస్కరణలకు రూపకల్పన.

 

***


(Release ID: 2059574) Visitor Counter : 47


Read this release in: English , Urdu , Hindi , Tamil