కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రపంచ సైబర్ భద్రత సూచీ- 2024లో భారతదేశానికి ఒకటో అంచె హోదా
ఈ మహత్తర కార్యసాధన ప్రపంచ సైబర్ సెక్యూరిటీ పట్ల మనకున్న అచంచల నిబద్ధతకు అద్దం పడుతోంది: కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
అసాధారణ రీతిలో 100కు 98.49 స్కోరు సాధించి ‘ఆదర్శప్రాయ’ దేశాల సరసన నిలిచిన ఇండియా
Posted On:
20 SEP 2024 4:50PM by PIB Hyderabad
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయు) 2024 సంవత్సరానికి ప్రచురించిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ (జీసీఐ)లో అగ్రస్థానాన్ని (టైర్1 హోదా) సాధించి భారతదేశం తన సైబర్ భద్రత సంబంధిత కృషిలో ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది. అసాధారణ రీతిలో 100 పాయింట్లకు 98.49 స్కోరును దక్కించుకుని, ప్రపంచంలోకెల్లా సైబర్ సెక్యూరిటీ సంబంధిత విధానాల్లో దృఢమైన నిబద్ధతను చాటిచెబుతూ, ‘ఆదర్శప్రాయ దేశాల’ సరసన స్థానాన్ని సంపాదించింది.
నోడల్ ఏజెన్సీగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టెలి కమ్యూనికేషన్ల (డీఓటీ) విభాగం గ్లోబల్ సైబర్‌సెక్యూరిటీ ఇండెక్స్ (జిసిఐ)- 2024లో కీలక పాత్రను పోషిస్తోంది. ఈ విజయం భారత్ గర్వించే క్షణమంటూ కమ్యూనికేషన్ల శాఖా మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ మహత్తర కార్యసాధన సైబర్ సెక్యూరిటీ విషయంలో మన అచంచల నిబద్ధతకు అద్దం పట్టడంతో పాటు టెలికం రంగం భారతదేశం సాధించిన అసాధారణ వృద్ధిని ప్రముఖంగా ప్రకటిస్తోంది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
అయిదు అంశాల్లో భారత్ కృషిని జీసీఐ-2024 అంచనా వేసింది: ఆ అంశాలలో చట్ట పరమైన, సాంకేతిక పరమైన, సంస్థాపరమైన, సామర్థ్య అభివృద్ధి ప్రధానమైన, సహకార పరమైన అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రశ్నావళిలో 83 ప్రశ్నలు, 20 సూచికలు, 64 ఉప సూచికలు, 28 సూక్ష్మ సూచికలు కలిసి ఉన్నాయి. వీటన్నింటి ప్రాతిపదికన ప్రతి ఒక్క దేశంలోని సైబర్ సెక్యూరిటీ స్వరూపాన్ని క్షణ్ణంగా మదింపు చేశారు.
సైబర్ జగతిలో ప్రతికూలతలకు తట్టుకుని నిలచే సామర్థ్యాన్ని పెంచడం, సైబర్ నేరాలకు సంబంధించిన చట్టాలు, సైబర్ భద్రత ప్రమాణాలకు సంబంధించి పటిష్టమైన వ్యవస్థల్ని స్థాపించడం ద్వారా భారత ప్రభుత్వం తీసుకొన్న అనేక చర్యలు, అమలుపరుస్తున్న అనేక కార్యక్రమాలు సైబర్ సెక్యూరిటీ రంగంలో భారతదేశపు దృఢతరమైన పనితీరుకు దన్నుగా నిలిచాయి. సైబర్ భద్రతాపరంగా ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించడానికి, సైబర్ నేరాలతో పోరాటం చేయడానికి దేశంలో చట్టబద్ధమైన విధానాలు పకడ్బందీగా ఉన్నాయి. దీంతో దేశంలోని డిజిటల్ రంగంలోని మౌలిక సదుపాయాలకు భద్రత సమకూరుతున్నది. దీనికి తోడు, సెక్టోరల్ కంప్యూటర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్స్ (సిఎస్ఐఆర్టి) రంగాల వారీ ప్రత్యేక సాంకేతిక సాయాన్ని అందిస్తూ, ఏదైనా సంఘటన జరిగితే, వెంటనే సంబంధిత విభాగాలకు సమాచారాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ సైబర్ భద్రతలో భారతదేశ సత్తాను పరిపుష్టం చేస్తున్నాయి.
భారతదేశం అనుసరిస్తున్న సైబర్ భద్రత వ్యూహంలో చైతన్యం, విద్య అనే అంశాలు కీలకంగా ఉన్నాయి. లక్షిత ప్రచార ఉద్యమాలు, విద్య సంబంధిత కార్యక్రమాలు, ప్రైవేట్ పరిశ్రమ, ప్రభుత్వ సంస్థలు, పౌర సమాజం, విద్య సంస్థలతో సహా వివిధ రంగాలలో సరైన భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రాథమిక, మాధ్యమిక విద్య స్థాయిలో పాఠ్య ప్రణాళికల్లో సైబర్ భద్రతను చేర్చడం ద్వారా పౌరులందరికీ డిజిటల్ వ్యవస్థలపై సరైన అవగాహన కలుగుతోంది. దేశానికి ఉన్న అంకితభావాన్ని ఈ చర్యలు సూచిస్తున్నాయి.
ప్రోత్సాహకాలనూ, నిధుల్ని అందించడం వల్ల నైపుణ్యాభివృద్ధి చోటు చేసుకున్నది. మన దేశంలో సైబర్ భద్రత రంగంలో పరిశోధనకు, నవకల్పనకు ఊతం లభించింది. ద్వైపాక్షిక ఒప్పందాలు, బహుళ పాక్షిక ఒప్పందాలతో సహా అంతర్జాతీయ స్థాయి సహకారాలు భారతదేశంలో సామర్థ్య నిర్మాణంతో పాటు సమాచార వెల్లడి సంబంధిత ప్రయాసలను బలపరచాయి. ఈ వైఖరి సైబర్ భద్రత రంగంలో ఒక గ్లోబల్ లీడర్ గా భారత్ పాత్రను పటుతరంగా తీర్చిదిద్దింది.
జీసీఐ- 2024లో భారతదేశం అగ్రస్థానానికి ఎగబాకడం సైబర్ భద్రత లక్ష్యాలలో దేశం సాధించిన పురోగతికి స్పష్టమైన సూచిక అని చెప్పాలి. ఈ విజయం భారత ప్రభుత్వం తన డిజిటల్ రంగాన్ని పదిలపరచుకోవడంలో కనబరుస్తున్న అంకిత భావాన్ని తెలియజేయడం ఒక్కటే కాకుండా ఇతర దేశాలు అనుసరించడానికి ఒక ప్రమాణాన్ని కూడా నెలకొల్పింది. ప్రపంచ స్థాయిలో డిజిటల్ రంగ మౌలిక సదుపాయాలను పదిలపరచడంలో భారతదేశం చేస్తున్న కృషికి డిఒటి ముందు వరుసలో నిలిచి నాయకత్వం వహించడాన్ని ఇక మీదట కూడా కొనసాగిస్తూనే ఉంటుంది.
(Release ID: 2057307)
Visitor Counter : 159