రక్షణ మంత్రిత్వ శాఖ
జీవావరణ సంరక్షణ- సముద్ర కాలుష్య నివారణ కోసం పర్యావరణ సంస్థలతో ఇండియన్ కోస్ట్ గార్డ్ అవగాహన ఒప్పందం
Posted On:
19 SEP 2024 8:42PM by PIB Hyderabad
భారత తీర రక్షణదళం (ఇండియన్ కోస్ట్ గార్డ్)- ది హాబిటాట్స్ ట్రస్టు, హెచ్సీఎల్ ఫౌండేషన్లతో సెప్టెంబరు 19 న న్యూఢిల్లీలోని నావికాదళ ప్రధాన కార్యాలయంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. సముద్ర జీవావరణ సంరక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేసే దిశగా ఈ అవగాహన ఒప్పందం జరిగింది.
అవగాహన ఒప్పందంలోని కీలక అంశాలు:
వదిలేసిన వలల తొలగింపు: సముద్రంలో వదిలేసిన వలల సమస్యను తక్షణం పరిష్కరించాలి. వీటి వల్ల సముద్ర జీవావరణకు హాని ఎక్కువగా జరుగుతుంది.
చెత్త పేరుకునే ప్రాంతాల గుర్తింపు, వర్గీకరణ: సముద్ర జలాల్లోని పారేసిన వస్తువుల వల్ల ఎక్కువ ప్రభావితమైన ప్రాంతాలలో ప్రక్షాళన చెయ్యాలి. దీనిని సమర్థవంతంగా నిర్వహించేందుకు సంరక్షణ పరిజ్ఞానాన్ని పెంపొందించడం.
ముఖ్యమైన జీవావరణ ప్రాంతాల్లో సర్వే: ఈ ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని పర్యవేక్షించడం, సంరక్షించడం, కీలకమైన సముద్ర జీవుల ఆవాసాలను గుర్తించడం.
స్థానిక భాగస్వామ్యం: సముద్ర జీవావరణ వ్యవస్థల నిర్వహణను ప్రోత్సహించడానికి తీరప్రాంత ప్రజలను సంరక్షణ కార్యకలాపాల్లో భాగస్వాములుగా చేయడం.
ఈ అవగాహన ఒప్పందంపై- డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్, కోస్టల్ సెక్యూరిటీ), ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) కూడా అయిన శ్రీ అనుపమ్ రాయ్, హెచ్సీఎల్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ నిధి పుంధీర్, హాబిటాట్స్ ట్రస్ట్ అధిపతి రుషికేశ్ చవాన్
సంతకాలు చేశారు. ఈ నిర్ణయ ప్రాముఖ్యతపై శ్రీ అనుపమ్ రాయ్ మాట్లాడుతూ, 'జీవవైవిధ్యం, తీరప్రాంత ప్రజల జీవనోపాధి రెండింటికీ కీలకమైన తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలను సంరక్షించే దిశగా ఈ భాగస్వామ్యం కీలకమైన ముందడుగు' అని పేర్కొన్నారు.
(Release ID: 2056964)
Visitor Counter : 66