శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

చీడ తెగుళ్లను నివారించే కీటక నాశిని: రైతాంగానికి ఫెరోమోన్ డిస్పెన్సర్ తో ఊరట

Posted On: 18 SEP 2024 2:19PM by PIB Hyderabad

రైతులకు చీడ పురుగుల నుంచి, తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందుకు పంటపొలాల్లో తక్కువ మొత్తంలో విడుదల అయ్యే సుస్థిర ఫెరోమోన్ డిస్పెన్సర్ ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది తెగుళ్లను నియంత్రించడంతో పాటు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.

వ్యవసాయంలో కీటకాలు చీడపీడల నియంత్రణ ప్రధానమైనది. ఎందుకంటే కీటకాలు, పరాన్న జీవులు పంటపై దాడి చేసి ఏపుగా పెరుగుతున్న పంటను నాశనం చేస్తాయి.

వ్యవసాయ క్షేత్రంలో నియంత్రిత విడుదల రేటుతో సుస్థిర ఫెరోమోన్ డిస్పెన్సర్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్‌సీఏఎస్ఆర్), (కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగంలోని స్వయంప్రతిపత్తి సంస్థ) నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్‌సెక్ట్ రిసోర్సెస్ (ఐసిఎఆర్-ఎన్‌బీఎఐఆర్) శాస్త్రవేత్తలు పరిశోధన ప్రాజెక్టులో భాగంగా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశారు. ఇది కీటకాల నియంత్రణతో పాటు నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గించడానికి రైతులకు సహాయపడనుంది.

శాస్త్రవేత్తలు తాము ప్రయోగశాలలో చేసిన ప్రయత్నాలను పరిశ్రమ స్థాయిలో ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. తద్వారా రైతులకు నేరుగా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు జేఎన్‌సీఏఎస్ఆర్, ఎన్‌బీఎఐఆర్ అధికారులు ఇటీవల హర్యానాలోని 'కృషి వికాస్ సహకారి సమితి లిమిటెడ్‌'తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంపై జేఎన్‌సీఏఎస్ఆర్ఎం ఆచార్యులుఈశ్వరమూర్తి, ఐసీఏఆర్-ఎన్‌బీఏఐఆర్ డాక్టర్ కేశవన్ సుభారన్ సంతకాలు చేశారు. "ఫెరోమోన్ డిస్పెన్సర్ పై పరిశోధన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడానికి దోహదపడుతుంది. పరిశోధన ప్రయోజనాలు ప్రయోగశాల నుంచి వ్యవసాయ క్షేత్రానికి మారడం ద్వారా రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుంది." అని ఆచార్యులు ఈశ్వరమూర్తి ప్రయోగ విశిష్టతను వివరించారు.

"ప్రస్తుతం పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో సెమియోకెమికల్స్ (ఫెరోమోన్స్ వంటి సిగ్నలింగ్ పదార్థాలు) పరిశ్రమలకు బదిలీ చేసినప్పుడు నియంత్రిత విడుదలపై అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎక్కువ మొత్తంలో ఫెరోమోన్స్ ఉత్పత్తికివీలు కలుగుతుంది" అని డాక్టర్ సుభాహరన్ తెలిపారు.

సుస్థిరమైన సేంద్రీయ ఫెరోమోన్ డిస్పెన్సర్లు కొత్త భావన కాదు. వాస్తవానికి, ఫెరోమోన్లను విడుదల చేసే పాలిమర్ మెంబ్రేన్/ పాలీప్రొపైలిన్ ట్యూబ్ డిస్పెన్సర్లు ఇప్పటికే మార్కెట్లో అధిక మొత్తంలో అందుబాటులో ఉన్నాయి. విడుదలైన ఫెరోమోన్లు కీటకాలు, చీడపురుగుల ప్రవర్తనను మార్చి, ఉచ్చులకు ఆకర్షిస్తాయి. అయితే, వాటి ప్రధాన లోపం ఫెరోమోన్లు గాలిలోకి విడుదలయ్యే రేటు స్థిరంగా ఉండదు. తద్వారా ఈ ఉచ్చులను తరచుగా తనిఖీ చేసి మార్చాలి, ఇది రైతులకు ఆర్థిక భారాన్ని పెంచడమే కాక శారీరక శ్రమను పెంచుతుంది.    

ప్రస్తుతం జేఎన్‌సీఏఎస్ఆర్, ఎన్‌బీఏఐఆర్ శాస్త్రవేత్తలు తమ డిస్పెన్సర్ కు మెసోపోరస్ సిలికా మ్యాట్రిక్స్ ను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించారు. ఈ పదార్థం అనేక చిన్న రంధ్రాలతో క్రమబద్ధమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. ఫెరోమోన్ అణువులను సులభంగా శోషించుకోని ఏకరీతిగా ఉంచడానికి అనుమతిస్తుంది. మెసోపొరస్ సిలికా ఇతర పదార్థాల కంటే అధికంగా జిగురు వంటి అతుక్కునే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా, ఇది నిల్వ చేసిన ఫెరోమోన్‌ను వాతారవణ ఉష్ణోగ్రత వంటి బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా మరింత స్థిరమైన పద్ధతిలో విడుదల చేస్తుంది.

శాస్త్రవేత్తలు రూపొందించిన ఫెరోమోన్ డిస్పెన్సర్ తో అమర్చిన పరికరాలను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఫెరోమోన్ తక్కువ మొత్తంలో విడుదలవుతూ, స్థిరమైన విడుదల రేటును కలిగి ఉంటుంది. దీని ప్రతీ విడుదల మధ్య విరామాలు ఎక్కువ ఉండటం వల్ల రైతుల పనిభారం తగ్గుతుంది. అదేవిధంగా డిస్పెన్సర్లను మరింత ఎక్కువ  మొత్తంలో ఫెరోమోన్ తో నింపవచ్చు. ఈ విధంగా, ప్రతిపాదిత డిజైన్ డిస్పెన్సర్ అవసరమైన ఫెరోమోన్ మొత్తాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది రైతులకు ఖర్చులను తగ్గించే అంశం. వ్యవసాయదారులకు అందుబాటులో ఉండి సుస్థిర వ్యవసాయ పద్ధతులకు దోహదం చేస్తుంది. " ప్రస్తుతం మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉన్న డిస్పెన్సర్ల కంటే ఇది ఎంతో ఉపయుక్తమైనది. ఎందుకంటే వ్యవసాయ క్షేత్రంలో ఫెరోమోన్ వాడకం తక్కువ, అదేవిధంగా రైతులకు అయ్యే ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది" అని డాక్టర్ సుభాహరన్ వివరించారు.

శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ ఫెరోమోన్ డిస్పెన్సర్‌పై పరిశోధనశాలల్లో, పంటపొలాల్లో ప్రయోగాలు, పరీక్షలు విస్తృతంగా చేశారు.  ఇందులో కీటకాలు, చీడపురుగులను ఆకర్షించే సామర్థ్యాన్ని విజయవంతంగా నమోదు చేసింది. కీటక ఆకర్షణ విషయంలో వాణిజ్య డిస్పెన్సర్లతో పోలిస్తే సమానంగా ఉన్నప్పటికీ, తక్కువ ఫెరోమోన్ విడుదల అనేది ఇందులో కీలకాంశం. ప్రస్తుతం చేసుకున్న ఒప్పందం ప్రకారం సంస్థ ఉత్పత్తి ప్రారంభిస్తే.. రైతులకు చీడపీడలను సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడుతుందని ప్రొఫెసర్ ఈశ్వరమూర్తి తెలిపారు.

జెఎన్‌సీఎఎస్ఆర్, ఎన్‌బీఎఐఆర్ సంయుక్తంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం(డిఎస్టి), బయోటెక్నాలజీ విభాగం ఆర్థిక సహకారంతో దీనిని రూపొందించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా వీరు చేసిన ఈ ప్రయత్నం సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్డిజి) 2, జీరో హంగర్ (ఆకలితో అలమటించని) దిశగా ఒక ముఖ్యమైన అడుగు.

 

***



(Release ID: 2056608) Visitor Counter : 24


Read this release in: English , Urdu , Hindi , Tamil