రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే ఇంజనీరింగ్ పరిశోధన, విద్యపై మోనాష్ విశ్వవిద్యాలయంతో
అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న గతి శక్తి విశ్వవిద్యాలయం
జీఎస్‌వీ, మోనాష్ రైల్వే టెక్నాలజీ సంస్థల మధ్య భాగస్వామ్యం ద్వారా
ఉమ్మడి పరిశోధనశాల, శిక్షణ కార్యక్రమాల అభివృద్ధి
Posted On:
17 SEP 2024 8:04PM by PIB Hyderabad
ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై న్యూఢిల్లీలో గతి శక్తి విశ్వవిద్యాలయం (జీఎస్‌వీ) ఈరోజు సంతకం చేసింది. రైల్వే ఇంజనీరింగ్‌లో ఉమ్మడి పరిశోధన, విద్య, కార్యనిర్వాహక శిక్షణలో మోనాష్ రైల్వే టెక్నాలజీ విద్యా సంస్థ(ఐఆర్‌టీ)తో సహకారాన్ని సులభతరం చేయడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం.
మోనాష్ విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ డిప్యూటీ వైస్ ఛాన్సలర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన ప్రొఫెసర్ క్రెయిగ్ జెఫ్రీ, గతిశక్తి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మనోజ్ చౌధరి మధ్య ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషన్ కార్యాలయంలో ఆ దేశ వాణిజ్య మంత్రి, ఆస్ట్రేడ్ దక్షిణాసియా అధిపతి డాక్టర్ మోనికా కెన్నెడీ ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చారు.
రైల్వే ఇంజనీరింగ్‌లో అధునాతన టెక్నాలజీపై దృష్టి సారించే విధంగా సంయుక్త పరిశోధనశాల ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఉభయ పక్షాలకు ప్రయోజనం కలిగేలా, ఆస్ట్రేలియా, భారతీయ రైల్వే వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకుగాను భవిష్యత్ పారిశ్రామిక ప్రాజెక్టుల్లో సహకారం కోసం అవకాశాలను అన్వేషిస్తారు. రెండు విశ్వవిద్యాలయాలు సహకారం అందించుకునే ముఖ్యమైన అంశాల్లో ఉమ్మడి విద్యా కార్యక్రమాలు, కార్యనిర్వాహక శిక్షణ భాగంగా ఉన్నాయి.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ క్రెయిగ్ జెఫ్రీ మాట్లాడుతూ ‘‘రవాణా, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్)లో భారతదేశపు మొదటి విశ్వవిద్యాలయమైన జీఎస్‌వీతో మోనాష్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం కుదుర్చుకోవడం నాకు సంతోషాన్నిస్తోంది. ఉత్పాదకత, భద్రతా ప్రమాణాలను పెంపొందించి, ప్రమాదాలు, వ్యయాన్ని తగ్గించే నూతన టెక్నాలజీలను మోనాష్ విశ్వవిద్యాలయం నిరంతరం అభివృద్ధి చేస్తూనే ఉంటుంది. రైల్వేల్లో సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో మా సంస్థ రికార్డు సృష్టించింది. మేం సూచించిన పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైల్వే వ్యవస్థలు పాటిస్తున్నాయి. మోనాష్ ఐఆర్‌టీ, జీఎస్‌వీ మధ్య కుదిరిన ఒప్పందంతో భారత్ లో మోనాష్ కార్యకలాపాలు విస్తరిస్తాయి’’ అని వివరించారు.
‘‘పరిశ్రమ ఆధారిత, ఆవిష్కరణ ప్రధాన విశ్వవిద్యాలయమైన జీఎస్‌వీ- రవాణా, ఆధునిక వస్తు రవాణా రంగాల ద్వారా జాతీయ అభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. దేశ రవాణా వ్యవస్థకు రైల్వేలు జీవనాధారం. వేగవంతమైన సాంకేతిక పురోగతి సాధిస్తూ రైల్వే రంగం ‘వికసిత భారత్’ వైపు పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపే విషయంలో, ప్రముఖ సంస్థలు, పరిశ్రమలతో కలసి పనిచేస్తూ, పరిశోధనలను ప్రోత్సహించే మోనాష్ విశ్వవిద్యాలయంతో మాకు సారూప్యతలున్నాయి’’ అని ప్రొఫెసర్ మనోజ్ చౌధరి అన్నారు.
రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో ఉత్తమ మానవ వనరులు, ప్రతిభావంతులను తయారు చేసే ఉద్దేశంతో పార్లమెంట్ చట్టం ద్వారా 2022లో వడోదరలో గతిశక్తి విశ్వవిద్యాలయాన్ని (జీఎస్‌వీ) స్థాపించారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తున్నాయి. రైల్వేలు, సమాచార, ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఈ విశ్వవిద్యాలయానికి మొదటి ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నారు.
రైల్వేలు, విమానయానం, సముద్ర రవాణా, ఓడరేవులు, రహదారులు, రోడ్లు, జలమార్గాలు మొదలైన వాటిలో జాతీయ అభివృద్ధి ప్రణాళికలను (పీఎం గతిశక్తి జాతీయ కార్యాచరణ ప్రణాళిక 2021, జాతీయ వస్తు రవాణా విధానం 2022) నెరవేర్చడానికి ఉద్దేశించిన మొదటి విశ్వవిద్యాలయమే జీఎస్‌వీ. పారిశ్రామిక నిపుణుల సహాకారంతో ఆచరణాత్మకమైన, అత్యాధునిక విద్యను అందించేలా ఈ విశ్వవిద్యాలయ కార్యక్రమాలను రూపొందించారు.
రైల్వే ఇంజనీరింగ్ సామర్థ్యాలను అభివృద్ధి చేసే విషయంలో సహకార ప్రయత్నాలను సూచించే ఈ ఒప్పంద కార్యక్రమంలో మోనాష్ విశ్వవిద్యాలయం, రైల్వే మంత్రిత్వ శాఖ, గతి శక్తి విశ్వవిద్యాలయ, ఆస్ట్రేడ్, డీఎఫ్‌సీసీఐఎల్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
****
(Release ID: 2056268)
Visitor Counter : 56