వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

అంతర్జాతీయ మార్కెట్లో భారత ఆర్గానిక్ ఉత్పత్తులు: లులూ గ్రూప్ ఇంట‌ర్నేష‌న‌ల్‌తో అపెడా ఒప్పందం


యునైటెడ్ ఆర‌బ్ ఎమిరేట్స్ లోని (యూఏఈ) లూలూ షాపుల్లో భార‌త ఆర్గానిక్ ఉత్పత్తులు

Posted On: 13 SEP 2024 4:38PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్రమల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ప‌ని చేస్తున్న వ్యవసాయ‌,  శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమ‌తుల అభివృద్ధి  సంస్థ (అపెడా) మ‌ధ్య ప్రాచ్య‌, ఆసియా దేశాల్లో అగ్రగామి రిటైల్ వ్యాపార సంస్థ లులూ గ్రూప్  ఇంట‌ర్నేష‌న‌ల్‌తో (ఎల్ఎల్‌సి) ఒక అవ‌గాహ‌నా ఒప్పందంపై (ఎంఓయు) సంత‌కాలు చేసింది. యూఏఈ విదేశీ  వాణిజ్య శాఖ స‌హాయ మంత్రి, ఆర్థిక మంత్రిత్వ శాఖ‌లోని టాలెంట్  అట్రాక్షన్ అండ్ రిటెన్షన్  విభాగం తాత్కాలిక మంత్రి  డాక్టర్ త‌ని బిన్ అహ్మద్ అల్ జెయోది స‌మ‌క్షంలో గ‌త మంగ‌ళ‌వారం ముంబయిలో ఈ కార్యక్రమం జ‌రిగింది.

ఈ ఒప్పందంలో భాగంగా లులూ  గ్రూప్  యునైటెడ్  ఆర‌బ్ ఎమిరేట్స్ లోని (యూఏఈ) త‌మ విక్రయశాలల్లో అధీకృత భార‌త ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయిస్తుంది. అపెడా త‌న వంతుగా దేశంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓ), రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (ఎఫ్‌పీసీ), స‌హకార సంఘాలు- లులూ కంపెనీ మ‌ధ్య అనుసంధాన‌తను క‌ల్పిస్తుంది. దీని వ‌ల్ల భార‌త ఆర్గానిక్  ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వ‌స్తాయి.

ఆర్గానిక్  ఉత్పత్తుల జాతీయ కార్యక్రమం (ఎన్‌పిఓపి) కింద అధీకృత భార‌త ఆర్గానిక్ ఉత్పత్తులను లులూ తన భారీ విక్రయశాలల్లో ప్రత్యేక విభాగాల ఏర్పాటుకు ఈ ఎంఓయూ దోహ‌ద‌ప‌డుతుంది.  అలాగే ఉత్పత్తుల నమూనాలతో ప్రచార నిర్వహణ, వినియోగ‌దారుల‌తో ముఖాముఖి, వినియోగ‌దారుల అభిప్రాయాల సేక‌ర‌ణ‌, కొనుగోలుదారులు-విక్రేత‌ల స‌మావేశాల (బిఎస్ఎం), బి2బి స‌మావేశాల నిర్వహణ, ఆర్గానిక్  ఎగుమ‌తుల ప్రోత్సాహానికి  వాణిజ్య ప్రదర్శనల నిర్వహణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. భార‌త ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం వ‌ల్ల కలిగే ప్రయోజనాలపై చైత‌న్యం క‌ల్పిస్తారు. భార‌త ఎఫ్‌పీఓలు/  ఎఫ్‌పీసీలు/  స‌హ‌కార  సంఘాల స‌భ్యుల‌కు యూఏఈలోని లులూ కంపెనీ మౌలిక వ‌స‌తులను సంద‌ర్శించే అవ‌కాశం క‌ల్పిస్తారు. త‌ద్వారా అంత‌ర్జాతీయ రిటైల్  మార్కెట్లపై  వారికి అవ‌గాహ‌న మ‌రింత‌గా పెరుగుతుంది.

భార‌త ఆర్గానిక్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఈ భాగ‌స్వామ్యం విశేషంగా దోహ‌ద‌ప‌డుతుంది. భార‌త ఉత్పత్తిదారులు, ప్రపంచ దేశాల వినియోగ‌దారుల మ‌ధ్య బ‌ల‌మైన అనుసంధాన‌త ఏర్పడటం ద్వారా దేశంలో ఆర్గానిక్ వ్యవసాయ వృద్ధికి దోహ‌ద‌కారి అవుతుంది. భార‌త్  నుంచి నిర్దేశిత వ్యవసాయ‌, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమ‌తులను ప్రోత్సహించే బాధ్యత అపెడా తీసుకున్నది. అలాగే దేశీయ‌ ఆర్గానిక్  ఎగుమ‌తుల నియంత్రణ వ్యవస్థ నేష‌న‌ల్  ప్రోగ్రామ్  ఫ‌ర్  ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్‌పీఓపీ) స‌చివాల‌యంగా కూడా అపెడా వ్యవహరిస్తుంది.

లులూ  గ్రూప్‌న‌కు చెందిన  హైప‌ర్ మార్కెట్లు, రిటైల్  విక్రయశాలల విస్తృత  నెట్‌వ‌ర్క్  ద్వారా భార‌త ఆర్గానిక్  ఉత్పత్తులకు ప్రాచుర్యం క‌ల్పించేందుకు ఈ వ్యూహాత్మక భాగ‌స్వామ్యం  స‌హాయ‌కారి అవుతుంది.

 

***



(Release ID: 2055134) Visitor Counter : 25


Read this release in: English , Urdu , Hindi , Malayalam