బొగ్గు మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 3.0లో అగ్రగామిగా నిలిచిన కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ
Posted On:
12 SEP 2024 6:15PM by PIB Hyderabad
స్వచ్ఛత, ప్రభుత్వంలో జాప్యాన్ని నివారించడంపై దృష్టి పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 2-31నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమం 4.0 ను ప్రారంభించబోతున్నది. అక్టోబర్ 2, 2023 నుంచి ఆగస్ట్ 31, 2024 వరకూ 3.0 ను నిర్వహించారు. ఇది పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల తొలగింపు, పర్యావరణ సంరక్షణ బాధ్యత అంశాల్లో ఉన్నత ప్రమాణాలను నిర్దేశించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, క్షేత్రస్థాయి కార్యాలయాల్లో 3.0లో అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఖాళీ స్థలాల విభాగంలో కేంద్ర ప్రభుత్వ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో బొగ్గు మంత్రిత్వ శాఖ అత్యుత్తమ పనితీరును కనబరిచింది.
ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 ( 2 అక్టోబర్ 2023-31 అక్టోబర్ 2023)
ప్రత్యేక ప్రచారం 3.0 ను నిర్వహించినప్పుడు 65,88,878 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలోని స్థలాన్ని కేంద్ర బొగ్గు శాఖ పరిశుభ్రం చేసింది. 8424 మెట్రిక్ టన్నుల నిరుపయోగ వస్తువులను అమ్మడం ద్వారా ₹34 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
డిఏఆర్ పిజి (DARPG) నివేదిక ప్రకారం ప్రత్యేక ప్రచారం 3.0 సమయంలో కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు/ విభాగాలను తీసుకున్నప్పుడు ఖాళీ జాగాల విభాగంలో బొగ్గు మంత్రిత్వ శాఖ మొదటి స్థానంలో నిలిచింది. ఆర్జించిన రాబడికి సంబంధించి నాలుగో స్థానంలో నిలిచింది. ప్రజలను చేరుకోవడంలో కేంద్ర బొగ్గు శాఖ విశిష్ట కృషి చేసింది. సామాజిక మాథ్యమాల వేదికలను ఉపయోగించి 650 ట్వీట్లను ప్రచారంలోకి తెచ్చింది. విస్తృతంగా మీడియా కవరేజీ లభించేలా చూసింది. ఆ విధంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను, విజయాలను ప్రభావవంతంగా హైలైట్ చేసింది.
ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 కింద వినూత్న కార్యక్రమాలు
కేంద్ర బొగ్గు శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ప్లాస్టిక్ టు పేవర్ ఒకటి. పశ్చిమ బెంగాల్ బంకోలా ప్రాంతంలోని ఇసిఎల్ వారు ప్రజలు ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ ను సేకరించి దాన్ని పేవ్‌మెంట్ టైల్స్ గా, బ్లాకులుగా తయారు చేశారు. వ్యర్థాల నుంచి సంపద కార్యక్రమం కింద మధ్య ప్రదేశ్ లోని జమునా కొత్మా వద్దగల ఎస్ ఇ సిఎల్ వారు వ్యర్థాల నుంచి అందమైన విగ్రహాలు తయారు చేశారు. ఎకో టూరిజం పార్క్ కార్యక్రమం కింద ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లలో అందమైన ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా ఎకో టూరిజం పార్క్ ను నిర్మించారు. బొగ్గును తవ్వి తీసిన తర్వాత వదిలేసిన గని ప్రాంతాన్ని ఎకో టూరిజం పార్క్ గా మార్చారు. ప్లాస్టిక్ దానవ్ కార్యక్రమం కింద ఎన్ సి ఎల్ వారు ప్రజలు ఒకసారి వాడి వదిలేసిన ప్లాస్టిక్ ను చుట్టుపక్కల ప్రదేశాల నుంచి సేకరించి దాని సాయంతో బొమ్మలను, శిల్పాలను, కళాత్మక రూపాలను తయారు చేశారు. ప్లాస్టిక్ కాలుష్య ప్రభావాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపారు.
ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 కింద నవంబర్ 2023 నుంచి ఆగస్ట్ 2024 వరకూ కేంద్ర బొగ్గుశాఖ, దాని పరిధిలో ప్రభుత్వ రంగం సంస్థలు కింద తెలియజేసిన విజయాలను సాధించాయి.
గణనీయస్థాయిలో 6,19,397 చదరపు అడుగుల స్థలాన్ని శుభ్రపరచడం, ఉత్తమ ప్రమాణాలతో కూడిన పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించడంలాంటి పనులు చేశారు.
14,986 మెట్రిక్ టన్నుల నిరుపయోగ వస్తువులను అమ్మడం ద్వారా రూ.74.48 కోట్లు ఆర్జించి తమ బాధ్యతను చాటుకున్నారు. ఖాళీ స్థలాలను పలు విధాలుగా వినియోగించారు. తోటల పెంపకం, ఉద్యానవన కార్యకలాపాలు, సుందరీకరణ, విశాలమైన మార్గాలను రూపొందించడం, పార్కింగ్ స్థలం ఏర్పాటు, ఆఫీసు ఏర్పాట్లు, నిల్వ ప్రాంతంగా చేసుకోవడం మొదలైన బహుళ ప్రయోజనాలను సాధించారు.
ఈ విజయాలు స్వచ్ఛమైన, పచ్చదనంతో కూడిన మరింత సుస్థిర పర్యావరణాన్ని పెంపొందించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ, దాని పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలకు ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. అంతే కాదు ఇవి రాబోయే ప్రత్యేక ప్రచార 4.0కి బలమైన పునాదిని ఏర్పరుస్తున్నాయి.
****
(Release ID: 2054440)
Visitor Counter : 79