కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వినియోగదారులకు మరింత మెరుగ్గా టెలికాం సేవలు: డాట్, ట్రాయ్ ఉమ్మడి చర్యలు


సంచార్ సాథీ సాయంతో కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్‌ల తొలగింపు

క్రమంగా కఠినతరం కానున్న నెట్‌వర్క్ లభ్యత, కాల్ డ్రాప్ రేట్లు, ప్యాకెట్ డ్రాప్ రేట్లు వంటి కీలక పారామితుల ప్రామాణికాలు

Posted On: 10 SEP 2024 7:39PM by PIB Hyderabad

టెలికాం వినియోగదారుల వినియోగ అనుభవాన్ని మెరుగుపరచడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఉమ్మడి సహకార చర్యలు చేపట్టాయి. హై స్పీడ్ డేటాతో స్పామ్ లేని  నాణ్యమైన టెలికాం సేవలను ప్రారంభించడానికి అనేక చర్యలు తీసుకున్నాయి.

స్పామ్ కాల్‌ల బెడదను అరికట్టడానికి, రోబోకాల్స్, ప్రీ-రికార్డ్ కాల్‌లతో సహా స్పామ్ కాల్‌ల కోసం బల్క్ కనెక్షన్‌లను ఉపయోగించే సంస్థలను  డిస్‌కనెక్ట్ చేసి బ్లాక్‌లిస్ట్ చేయమని టెలికాం ఆపరేటర్‌లను ట్రాయ్ ఆదేశించింది. గత పక్షం రోజుల్లో 3.5 లక్షలకు పైగా అలాంటి నంబర్‌లు తొలగించారు. 50 సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేశారు. అదనంగా, దాదాపు 3.5 లక్షల ఉపయోగించని/ ధ్రువీకరించని ఎస్ఎంఎస్  హెడర్‌లు, 12 లక్షల కంటెంట్ టెంప్లేట్‌లు బ్లాక్ అయ్యాయి.

అనుమానాస్పద కాల్‌లు, మెసేజ్‌లను తెలియజేయడానికి పౌరులకు వీలు కల్పిస్తూ, సైబర్ మోసానికి వ్యతిరేకంగా పోరాడేందుకు డాట్, సంచార్ సాథి (https://sancharsaathi.gov.in) అనే పౌర కేంద్రీకృత ప్లాట్‌ఫామ్‌లను ప్రారంభించింది. ఇప్పటి వరకు సంచరసాథి సహాయంతో కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్‌లను  తొలగించారు. ఇంకా, సైబర్ క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు 2.27 లక్షల మొబైల్ హ్యాండ్‌సెట్‌లు బ్లాక్ చేశారు.

సమాంతరంగా, నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో, నెట్‌వర్క్ లభ్యత, కాల్ డ్రాప్ రేట్లు, ప్యాకెట్ డ్రాప్ రేట్లు మొదలైన కీలక నెట్‌వర్క్ పారామితుల కోసం ప్రామాణికాలను క్రమంగా కఠినతరం చేస్తున్నారు. దీనికి సంబంధించి, ట్రాయ్ తన సవరించిన నిబంధనలను , “ది స్టాండర్డ్స్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఆఫ్ యాక్సెస్ (వైర్‌లైన్స్, వైర్‌లెస్), బ్రాడ్‌బ్యాండ్ (వైర్‌లైన్, వైర్‌లెస్) సర్వీస్ రెగ్యులేషన్స్, 2024 (06 ఆఫ్ 2024)' విడుదల చేసింది.

ఈ నిబంధనలు అక్టోబర్ 01, 2024 నుంచి  అమలులోకి వస్తాయి. త్రైమాసిక ప్రాతిపదికన కాకుండా మొబైల్ సేవ క్యూఓఎస్ పనితీరుకు సంబంధించిన నెలవారీ పర్యవేక్షణ 1 ఏప్రిల్ 2025 నుండి ప్రారంభిస్తారు. కొత్త నియంత్రణ ప్రకారం కొన్ని ముఖ్యమైన పారామితుల కోసం సవరించిన క్యూఓఎస్ బెంచ్‌మార్క్ పట్టికలో ఇచ్చారు. క్రింది లింక్ చూడండి...

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=2053530

నిర్ధారిత  సంఖ్యకు మించి ఫిర్యాదులు వచ్చినట్లయితే నమోదుకాని (అన్ రిజిస్టర్డ్) టెలిమార్కెటర్ల సేవలను తక్షణమే నిలిపివేసే నిబంధనలపై ట్రాయ్ సంప్రదింపు పత్రాలను కూడా జారీ చేసింది. అనుమానిత స్పామర్‌లను  ముందస్తుగా గుర్తించి చర్యలను అమలు చేస్తుంది.
డాట్, ట్రాయ్ దేశంలో టెలికాం సేవలు, భద్రతను పెంపొందించడానికి, విధానాల ద్వారా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవల నాణ్యత, ఫిర్యాదుల పరిష్కారానికి నిరంతరం నిమగ్నమై ఉన్నాయి.

నియంత్రణ చర్యల పూర్తి వివరాల సైట్ :   https://www.trai.gov.in/sites/default/files/Regulation_02082024.pdf


 

****


(Release ID: 2053740) Visitor Counter : 44


Read this release in: English , Urdu , Hindi , Tamil