మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజనను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్


దేశీయ రకాల చేపల పెంపకంపై ప్రచార పుస్తకాలను విడుదల చేయనున్న కేంద్ర మంత్రి
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన నాలుగో వార్షికోత్సవం

Posted On: 10 SEP 2024 2:46PM by PIB Hyderabad

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ప్రారంభించి నాలుగేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన పథకాన్ని కేంద్ర మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ రేపు  ప్రారంభిస్తారు. న్యూడిల్లీలోని చాణక్యపురిలోని సుష్మా  స్వరాజ్ భవన్లో రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో  ఉత్పత్తి, శుద్ధి  క్లస్టర్లలో పని విధానంపై మార్గదర్శకాలను కూడా విడుదల చేస్తారు. మత్స్య , పశుసంవర్థక, పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖల సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్,  మైనార్టీ వ్యవహారాలు, మత్స్య, పశు సంవర్థక, డెయిరీ శాఖ సహాయ మంత్రి శ్రీ జార్జి కురియన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.  వీరితో పాటుగా రాష్ట్రాలు/కేంద్ర  పాలిత ప్రాంతాల మత్స్య విభాగాల ప్రతినిధులు, అధికారులు, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు, ఐసీఏఆర్ సంస్థలు, ఇతర విభాగాలు, మంత్రిత్వ శాఖలు, దేశవ్యాప్తంగా ఉన్న పీఎంఎంఎస్‌వై  లబ్ధిదారులు, మత్స్యకారులు, మత్స్యకార రైతులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఫిషరీస్ రంగంలో నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా హాజరుకానున్నారు.

ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, దిగుబడి, నిల్వ కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఇతర విలువ ఆధారిత వ్యవస్థలకు  సంబంధించి పీఎంఎంఎస్‌వై కింద చేపట్టిన  వివిధ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటిస్తారు.

పీఎంఎంఎస్‌వై నాలుగో వార్షికోత్సవంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద చేపట్టిన జాతీయ ప్రాధాన్యమున్న ప్రాజెక్టులు, పుస్తక ఆవిష్కరణలు, ప్రావీణ్యతా కేంద్రాలు, న్యూక్లియస్ బ్రీడింగ్ కేంద్రాల నోటిఫికేషన్, వాతావరణ ప్రభావాన్న తట్టుకునేలా తీరప్రాంతాల్లోని మత్స్యకార గ్రామాలు, మత్స్యకార సమూహాలను అభివృద్ధి చేసేందుకు నోటిఫికేషన్ జారీచేయడంతో పాటు డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభిస్తారు.

నీలి విప్లవం ద్వారా మత్స్య రంగంలో తీసుకువస్తున్న సంస్కరణల్లో వేగం పెంచడానికి భారత ప్రభుత్వం 2014 నుంచి రూ. 38,572 కోట్ల పెట్టుబడితో  వివిధ పథకాలను రూపొందించి అమలు చేస్తోంది.     

నీలి విప్లవంలో పొందుపరిచిన ప్రధానాంశాలు: రూ. 5000 కోట్ల పెట్టుబడితో 2015-16 నుంచి 2019-20 వరకు అమలు చేసిన మత్స్య పరిశ్రమల సమగ్రాభివృద్ధి, నిర్వహణతో పాటుగా 2018-19 నుంచి రూ. 7,522.48 కోట్ల నిధులతో ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎఫ్ఐడీఎఫ్) అమలవుతోంది. ఐదేళ్ల కాల వ్యవధికి(2020-21 నుంచి 2024-25 వరకు) రూ.20,500 కోట్లతో అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) పథకంతో పాటు దీనికి ఉపపథకంగా ఈ ఏడాది నుంచి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజనను  రూ. 6,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికతో అమలు చేయనున్నారు.

ఈ కార్యక్రమాలు ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం, నాణ్యతను మెరుగుపరచడం, ఎగుమతుల్లో వృద్ధి, దిగుబడి చేతికి వచ్చిన తర్వాత నష్టాలను తగ్గించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతికత వినియోగం, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారుచేయడంపై దృష్టి సారిస్తాయి. అలాగే మత్స్యకారులు, చేపల పెంపకందారులు, మత్స్య కార్మికులు, చేపల విక్రేతలతో సహా ఈ రంగంపై ఆధారపడిన వారందరికీ జీవనోపాధి కల్పించడంతో పాటు వారి సంక్షేమంపై సైతం దృష్టి సారిస్తాయి.

ఫిషరీస్ విభాగం, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం - ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) అమలు చేయడంలో విజయవంతంగా నాలుగేళ్లు పూర్తి చేసిన సందర్భంగా మత్స్య విభాగం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

దేశంలో మత్స్య రంగంలో వృద్ధి సాధించి, సుస్థిరత వైపు నడిపించే  కీలక మార్పుగా  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) ప్రారంభమైంది. చేపల ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత, సాంకేతికత, దిగుబడి అనంతర మౌలిక సదుపాయాలు, నిర్వహణ, ఆధునీకీకరణలో క్లిష్టమైన ఇబ్బందులను పరిష్కరించడమే మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మే 2020లో ప్రారంభించిన ఈ పథకం లక్ష్యం. అలాగే విలువ ఆధారిత వ్యవస్థను బలోపేతం చేయడం, సమస్యల్ని గుర్తించడం, బలమైన మత్స్య యాజమాన్య వ్యవస్థను  ఏర్పాటు చేయడం,  మత్స్యకారుల సంక్షేమం కోసం ఈ పథకం ద్వారా కృషి చేస్తారు. పీఎంఎంఎస్‌వై అమలు ప్రారంభమైన నాటి నుంచి దేశంలో మత్స్య, రొయ్యల సాగు సమగ్రాభివృద్ధికి వ్యూహాత్మక ప్రణాళికగా పరిణామం చెందింది. మత్స్యరంగంలో అత్యధికంగా రూ.20,500 కోట్లు పెట్టుబడిని సాధించి చేపల, రొయ్యల సాగును ప్రోత్సహించడంతో పాటు, ఉత్పత్తిని పెంపొందించి, ఆహారభద్రతను కల్పించడంలో  పీఎంఎంఎస్‌వై తోడ్పడుతుంది.

పీఎంఎంఎస్‌వై ద్వారా చేపట్టిన మార్పులు, సంస్కరణల ద్వారా మౌలిక వసతుల అభివృద్ధి, భారత మత్స్యరంగం, రొయ్యల సాగును ఆధునికీకరించడం, ఫిషింగ్ హార్బర్లు/లాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేసి ఆధునికీరించడం, మత్స్యకారుల సంప్రదాయ చేతి పనిముట్లు-ట్రాలర్లు-సముద్రం లోపలికి వెళ్లే బోట్ల యాంత్రీకరణ, దేశంలో ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించేందుకు నాణ్యమైన దాణా సరఫరా, కోల్డ్ స్టోరేజీలను నిర్మించడం,  విలువను జోడించడం, పరిశుభ్రమైన చేపల మార్కెట్లను ఏర్పాటు చేయడం తదితర కార్యక్రమాలు చేపడతారు. చేపల వేట నిషేధించిన సమయంలో మత్స్యకారులకు జీవనోపాధి, బీమా సదుపాయం, ఆర్థిక సహాయం కల్పించి కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేస్తారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే మార్గాన్ని పీఎంఎంఎస్‌వై ఏర్పాటు చేస్తుంది.

మత్స్యకారులు, చేపల పెంపకందారులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు, ప్రభుత్వ అధికారులు, మత్స్య పరిశ్రమ, రొయ్యల సాగు రంగాలకు చెందిన ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో  పాల్గొంటారు. ఈ  కార్యక్రమంలో మత్స్యశాఖ అమలు చేసిన పీఎంఎంఎస్‌వైతో పాటు ఇతర పథకాలు సాధించిన విజయాలను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఎంఎస్‌వై తో సహా ఇతర పథకాల విజయాలను ప్రదర్శించడానికి ఉద్దేశించారు.

 

****


(Release ID: 2053734) Visitor Counter : 129