కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికాం లైసెన్సులు, వైర్ లెస్ పరికరాల అనుమతుల ప్రక్రియను సులభతరం చేసిన టెలికాం శాఖ
టెలికాం రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు, వాణిజ్య సౌలభ్యాన్ని కొనసాగిస్తున్న టెలికాం శాఖ
నిర్ణీత సమయానికే లైసెన్సుల జారీ, పరికర అనుమతుల కోసం స్వీయ ధ్రువీకరణ
प्रविष्टि तिथि:
10 SEP 2024 5:40PM by PIB Hyderabad
ప్రయోగాత్మక లైసెన్సులు, సామర్ధ్య ప్రదర్శన లైసెన్సులు, పరికరాలకు అనుమతులు (ఈటీఏ) జారీ చేసే ప్రక్రియలలో టెలి కమ్యూనికేషన్ల విభాగం (డీవోటీ) గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. టెలికాం రంగంలో సులభతర వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ మార్పులు చేశారు. అనవసర జాప్యాన్ని తగ్గించడం, నియంత్రణ అవసరాలను సులభతరం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, వ్యాపార సంస్థలు, టెలికాం ఆపరేటర్ల కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం ఈ సంస్కరణల లక్ష్యం.
ప్రయోగాత్మక లైసెన్సులకు (రేడియేటింగ్ కేటగిరీ) త్వరితగతిన అనుమతులు లభించేలా నిర్ణీత కాలపరిమితిని ప్రవేశపెట్టారు. మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు అవసరం లేని ప్రయోగాత్మక లైసెన్సుల విషయంలో 30 రోజుల్లోపు ఎలాంటి నిర్ణయమూ తీసుకోని పక్షంలో, లైసెన్సు జారీ అయినట్టు పరిగణిస్తారు. మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు అవసరమైన సందర్భాల్లో పూర్తి దరఖాస్తు అందిన ఏడు రోజుల్లోగా టెలి కమ్యూనికేషన్ల శాఖ అభిప్రాయాలను కోరుతుంది. ఎలాంటి అభిప్రాయాలూ రాకపోతే 60 రోజుల తర్వాత ముందస్తు లైసెన్సు మంజూరు చేస్తారు. దానిపై ఎలాంటి ప్రతికూల అభిప్రాయాలూ వెల్లడి కాకపోతే 90 రోజుల తరువాత దానిని పూర్తిస్థాయి లైసెన్సుగా మారుస్తారు.
అదే విధంగా, సామర్థ్య ప్రదర్శన (డెమనిస్ట్రేషన్) లైసెన్సుల విషయంలో – మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపుల అవసరం లేని లైసెన్సులు 15 రోజుల తరువాత మంజూరైనట్టుగా పరిగణిస్తారు. సంప్రదింపులు అవసరమైన సందర్భంలో, సంబంధిత అధికారుల నుంచి అభిప్రాయాలు కోరిన 45 రోజుల తర్వాత లైసెన్సులు మంజూరవుతాయి.
అంతే కాకుండా, ఇతర నియమనిబంధనలు వర్తిస్తాయి. ఒకవేళ అనుమతుల ప్రక్రియ సమయంలో ఇతర మంత్రిత్వ శాఖల నుంచి ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమైతే, ముందస్తు లైసెన్సు రద్దవుతుంది. దాంతోపాటు, ఆ ప్రయోగాన్నీ వెంటనే నిలిపివేయాలి. దరఖాస్తు సమయంలోనే ఈ షరతును అంగీకరించాల్సి ఉంటుంది. ముందస్తు లేదా రెగ్యులర్ లైసెన్సు రద్దయిన సమయంలో, లేదా ప్రయోగాత్మక/ సామర్ధ్య ప్రదర్శన వ్యవధి ముగిసిన తరువాత, రేడియో పరికరాలు సంబంధిత స్వాధీన నియమాల పరిధిలోకి వస్తాయని, వాటి మూల యాజమాన్యానికి చెందుతాయని లేదా ప్రస్తుత మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరిస్తారని వినియోగదారులు గుర్తించాలి. 2019 జూలై 23 నాటి అధికారిక పత్రం (ఆఫీస్ మెమొరాండం)లో పేర్కొన్న అన్ని ఇతర నియమ నిబంధనలు అమలులో ఉంటాయి.
వైర్ లెస్ మినహా మిగతా పరికరాల అనుమతులకు దరఖాస్తుల విషయంలో గణనీయమైన మార్పులు చేశారు. ఇకపై వాటిని స్వీయ ధ్రువీకరణ ప్రాతిపదికన మంజూరు చేస్తారు. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను సరళ్ సంచార్ పోర్టల్ (https://saralsanchar.gov.in/) ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు పూర్తి అయిన తర్వాత ఇందులో నుంచి వారు ఈటీఏ ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. అనుమతుల కోసం వినియోగించాల్సిన సమయం, శ్రమను ఈ ప్రక్రియ గణనీయంగా తగ్గిస్తుంది. భారత మార్కెట్లో వైర్ లెస్ పరికరాలను ప్రవేశపెట్టాలనుకుంటున్న కంపెనీలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
సులభతర వాణిజ్యాన్ని పెంచడం, టెలికాం రంగంలో నియంత్రణ ప్రక్రియలను సరళతరం చేయడం వంటి అంశాలకు సంబంధించి భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ మార్పులు చేశారు. కొత్త కాల వ్యవధులు ఆవశ్యకమైన సమర్థతను అందిస్తాయి. 2019 జూలై 23 నాటి అధికార పత్రం (ఆఫీస్ మెమోరాండం)లో పేర్కొన్న విధంగా ప్రయోగాత్మక, సామర్ధ్య ప్రదర్శన లైసెన్సుల కోసం ప్రస్తుత నియమ నిబంధనలు అమల్లో ఉంటాయి. నవీకరించిన కాలవ్యవధులు ఇందుకు మినహాయింపు.
భారత్ లోకి పరికరాలను దిగుమతి చేసుకోవడానికి ముందు ఈటీఏ హక్కుదారులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్ టీ) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ వోసీ) వంటి అవసరమైన అనుమతులను పొందాల్సి ఉంటుంది.
https://dot.gov.in/spectrum-management/2457 లో వివరాలు అందుబాటులో ఉన్నాయి.
మరింత వాణిజ్యానుకూల నియంత్రణ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా, వైర్ లెస్ సాంకేతికతల్లో ఆవిష్కరణలను సులభతరం చేయడం ద్వారా టెలికాం రంగం అభివృద్ధికి తోడ్పాటును అందించడంలో టెలికాం శాఖ తన నిబద్ధతను ఈ సంస్కరణలు ప్రతిబింబిస్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 2053730)
आगंतुक पटल : 90