ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి అధ్యక్షతన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పాలకమండలి తొలి సమావేశం


దేశంలోని శాస్త్ర రంగం ప్రయత్నాలకు వనరుల కొరత ఉండదన్న విశ్వాసంతో ఉండండి: ప్రధాన మంత్రి

పరిశోధన ప్రధాన వ్యవస్థలో అడ్డంకులను గుర్తించి తొలగించాల్సిన అవసరం ఉంది: ప్రధానమంత్రి

ప్రపంచ సమస్యలకు దేశీయ పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించండి: పీఎం

పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని సులభంగా ట్రాక్ చేయడానికి
డ్యాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేయాలి:ప్రధానమంత్రి

పరిశోధన, ఆవిష్కరణలకు వనరుల వినియోగాన్ని శాస్త్రీయంగా పర్యవేక్షించాలి: ప్రధాని

ప్రారంభ దశలో ఉన్న విశ్వవిద్యాలయాలను మెంటర్‌షిప్ మోడ్‌లో అగ్రశ్రేణి సంస్థలతో జత చేసే ఏర్పాటు
వీటిలో పరిశోధనల కోసం హబ్ అండ్ స్పోక్ మోడ్‌లో ప్రోగ్రామ్ ప్రారంభం

పరిశోధకులకు పరిశోధన కార్యక్రమాలు మరింత సులభతరం చేయడానికి
అనువైన, పారదర్శకమైన ఆర్థిక సాయం అందించే విధానంతో సాధికారత

ఎంపిక చేసుకున్న ప్రాధాన్యతా ప్రాంతాలలో మిషన్ మోడ్‌లో పరిష్కార-కేంద్రీకృత
పరిశోధనపై కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏఎన్ఆర్ఎఫ్

వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఏఎన్ఆర్ఎఫ్ వ్యూహాలు,
ఆర్ అండ్ డి ఏజెన్సీల మాదిరి ప్రపంచ ఉత్తమ పద్ధతుల అనుసరణ

హ్యుమానిటీస్, సోషల్

Posted On: 10 SEP 2024 4:35PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పాలక మండలి మొదటి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో దేశంలోని శాస్త్ర, సాంకేతిక స్వరూప స్వభావాలు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల రీడిజైనింగ్ గురించి చర్చ జరిగింది.

ఈ స‌మావేశంలో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు అనుసంధాన్  నేషనల్ రీసెర్చ్ ఫౌండేష‌న్ పాలక మండలి మొద‌టి స‌మావేశం సరికొత్త ఆరంభానికి నాందిగా నిలుస్తుందన్నారు. దేశంలోని పరిశోధనా ప్రధాన  వ్యవస్థలో ఉన్న అడ్డంకులను గుర్తించి తొలగించాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి స్పష్టంగా తెలియజెప్పారు.   పెద్ద లక్ష్యాలను నిర్దేశించడం, వాటిని సాధించడంపై దృష్టి సారించాలని తెలిపారు. మార్గదర్శక పరిశోధన చేయడం గురించి  మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న సమస్యలకు కొత్త పరిష్కారాలను కనుగొనడంపై పరిశోధనలు దృష్టి సారించాలని అన్నారు. సమస్యలు ప్రపంచ స్థాయిలో ఉండవచ్చు కానీ వాటి పరిష్కారాలు భారతీయ అవసరాలకు అనుగుణంగా దేశీయంగా రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు.

సంస్థల అప్‌గ్రేడేషన్, స్టాండర్డైజేషన్ ఆవశ్యకతను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వారి నైపుణ్యం ఆధారంగా ఆయా రంగాల నిపుణుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. దేశంలో జరుగుతున్న పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని సులభంగా ట్రాక్ చేయగల డ్యాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేయడం గురించి కూడా ఆయన మాట్లాడారు.

పరిశోధన, ఆవిష్కరణల కోసం వనరుల వినియోగాన్ని శాస్త్రీయంగా పర్యవేక్షించవలసిన అవసరం ఉందని  ప్రధాన మంత్రి  చెప్పారు. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రారంభమని చెబుతూ, దేశంలోని శాస్త్రీయ సమాజం తమ ప్రయత్నాలకు వనరుల కొరత ఉండదని విశ్వాసం కలిగి ఉండాలని అన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సానుకూల ప్రభావాలను వివరిస్తూ, ఈ ల్యాబ్‌లను గ్రేడింగ్ చేయవచ్చని ప్రధాన మంత్రి సూచించారు. పర్యావరణ మార్పునకు కొత్త పరిష్కారాల కోసం వెతకడం, ఈవీలకు బ్యాటరీ పదార్థాలు, ల్యాబ్‌లో అభివృద్ధి చేసే వజ్రాలు వంటి వివిధ రంగాలలో పరిశోధనలను కూడా ఆయన ప్రస్తావించారు.

పరిశోధన ప్రారంభ దశలో ఉన్న విశ్వవిద్యాలయాలను మెంటార్‌షిప్ మోడ్‌లో అగ్రశ్రేణి సంస్థలతో జత చేయడం ద్వారా హబ్ అండ్ స్పోక్ పద్ధతిలో కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఈ సందర్బంగా పాలకమండలి నిర్ణయించింది.
కీలక రంగాలలో దేశం గ్లోబల్ పొజిషనింగ్, జాతీయ ప్రాధాన్యతలతో పరిశోధన, అభివృద్ధిని సమలేఖనం చేయడంపై సమావేశం చర్చించింది. ఇందుకు సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం, సామర్థ్య పెంపుదల, శాస్త్రీయ పురోగతి దిశగా అడుగులు వేయడం, సృజనాత్మక విస్తారిత వ్యవస్థ, అలాగే విద్యాపరమైన పరిశోధన, పారిశ్రామిక అనువర్తనాల మధ్య అంతరాన్ని తగ్గించడం వంటి ఏఎన్ఆర్ఎఫ్ వ్యూహాత్మక జోక్యాల గురించి పాలకమండలి చర్చించింది.

ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవి) మొబిలిటీ, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, సోలార్ సెల్స్, స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, మెడికల్ టెక్నాలజీ, సస్టైనబుల్ అగ్రికల్చర్,  ఫోటోనిక్స్ వంటి ఎంపిక చేసిన ప్రాధాన్యత ప్రాంతాలలో మిషన్ మోడ్‌లో పరిష్కార-కేంద్రీకృత పరిశోధనపై ఏఎన్ఆర్ఎఫ్ ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తుంది. ఈ ప్రయత్నాలు మన ఆత్మనిర్భర్ భారత్ వైపు సాగేందుకు ప్రభావవంతంగా సహాయపడతాయని పాలకమండలి గుర్తించింది.

హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో అంతర్ శాస్త్ర పరిశోధనకి తోడ్పడేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పరిశోధన చేయడంలో సౌలభ్యాన్ని సాధించేందుకు అనువైన,  పారదర్శకమైన ఆర్థిక సహాయం అందే యంత్రాంగాన్ని మన పరిశోధకులకు రూపొందించాల్సిన అవసరం ఉందని కూడా సమావేశం అభిప్రాయపడింది.

ఏఎన్ఆర్ఎఫ్ వ్యూహాలు వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన, అభివృద్ధి ఏజెన్సీలు అనుసరించే ప్రపంచ ఉత్తమ పద్ధతులను అనుసరించాలని పాలకమండలి సూచించింది.
పాలకమండలి ఉపాధ్యక్షులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే సభ్య కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సభ్యులు (సైన్స్), శాస్త్ర సాంకేతిక విభాగం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్సులు ఈ సమావేశానికి ఎక్స్-అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు. ఇంకా ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులలో ప్రొఫెసర్ మంజుల్ భార్గవ (ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ, అమెరికా), డాక్టర్ రోమేష్ టి వాధ్వాని (సింఫనీ టెక్నాలజీ గ్రూప్,అమెరికా), ప్రొఫెసర్ సుబ్ర సురేష్ (బ్రౌన్ యూనివర్సిటీ, అమెరికా), డాక్టర్ రఘువేంద్ర తన్వర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్) , ప్రొఫెసర్ జయరామ్ ఎన్. చెంగలూర్ (టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్), ప్రొఫెసర్ జి రంగరాజన్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) కూడా పాల్గొన్నారు. .

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గురించి...

పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి, దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, ఆర్ అండ్ డీ ప్రయోగశాలలలో పరిశోధన, ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్)ను నెలకొల్పారు. జాతీయ విద్యా విధానం సిఫార్సుల ప్రకారం దేశంలో శాస్త్రీయ పరిశోధన ఉన్నత-స్థాయి వ్యూహాత్మక దిశను అందించడానికి ఏఎన్ఆర్ఎఫ్ ఒక ప్రధాన సంస్థగా పనిచేస్తుంది. ఏఎన్ఆర్ఎఫ్ పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది.

 

****



(Release ID: 2053729) Visitor Counter : 33