వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్: సాంకేతిక పరిజ్ఞానంతో రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు

Posted On: 04 SEP 2024 3:17PM by PIB Hyderabad

పరిచయం 

డిజిటల్ గుర్తింపు, సురక్షిత చెల్లింపులు, లావాదేవీలు దేశంలోని డిజిటల్ విప్లవానికి కొత్త బాటలు వేశాయి. ఇటీవలి సంవత్సరాల్లో పాలన తీరును, సేవా పంపిణీ వ్యవస్థను గణనీయంగా మార్చాయి. ఈ పురోగతి ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, విద్య, రిటైల్‌తో సహా వివిధ రంగాలలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ విస్తారిత వ్యవస్థకు మార్గం సుగమం చేసింది. పౌర-కేంద్రీకృత డిజిటల్ పరిష్కారాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపింది.

ఈ పరివర్తన క్రమంలోనే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 2వ తేదీన జరిగిన కేంద్ర మంత్రివర్గ కమిటీ గణనీయమైన ఆర్థిక వ్యయం- రూ.2,817 కోట్లతో 'డిజిటల్ అగ్రికల్చర్ మిషన్'కు ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 1,940 కోట్లు.

 

డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి వివిధ కార్యక్రమాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే పథకంగా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ను రూపొందించారు.  వీటిలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (డీజీసీఈఎస్)ని అమలు చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా, పరిశోధనా సంస్థల ద్వారా ఐటీ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటివి ఉన్నాయి.

ఈ పథకం రెండు మూల స్తంభాలపై రూపొందించారు:

·         అగ్రిస్టాక్ 

·         కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టం 

అదనంగా, ఈ మిషన్ 'సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్'ను కలిగి ఉంది. వ్యవసాయ రంగానికి సకాలంలో, నమ్మదగిన సమాచారాన్ని అందించడానికి రైతు-కేంద్రిత డిజిటల్ సేవలను ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది.

1. అగ్రిస్టాక్: కిసాన్ కి పెహచాన్

రైతులకు సేవలు, పథకం అమలు వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి రైతు-కేంద్రీకృత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)గా రూపొందించారు. ఇది మూడు కీలక భాగాలను కలిగి ఉంటుంది:

1. రైతుల రిజిస్ట్రీ 

2. జియో-రిఫరెన్స్ గ్రామ మ్యాప్‌లు

3. సాగు అయ్యే పంట రిజిస్ట్రీ 

 

అగ్రిస్టాక్ కీలకమైన అంశం ఏమిటంటే, రైతులకు విశ్వసనీయమైన డిజిటల్ గుర్తింపుగా ఉపయోగపడే ఆధార్ కార్డ్ మాదిరిగానే 'రైతు ఐడీ'ని ప్రవేశపెట్టడం.

రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందించి, నిర్వహించే ఈ ఐడీలు భూమి రికార్డులు, పశువుల యాజమాన్యం, పంట సాగు, పొందే ప్రయోజనాలతో సహా వివిధ రైతు సంబంధిత డేటాకు అనుసంధానం అయి ఉంటుంది.
 

వ్యవసాయ మంత్రిత్వ శాఖతో 19 రాష్ట్రాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ద్వారా అగ్రిస్టాక్ అమలు పురోగమిస్తోంది. రైతు ఐడీల రూపకల్పనకు, డిజిటల్ క్రాప్ సర్వేను పరీక్షించడానికి ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టులు చేపట్టారు. 

ఈ ఆరు రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్ (ఫరూఖాబాద్), గుజరాత్ (గాంధీనగర్), మహారాష్ట్ర (బీడ్), హర్యానా (యమునా నగర్), పంజాబ్ (ఫతేగఢ్ సాహిబ్), తమిళనాడు (విరుధ్‌నగర్).

ముఖ్య లక్ష్యాలు:

 

- మూడేళ్లలో 11 కోట్ల మంది రైతులకు డిజిటల్ గుర్తింపులను రూపొందించడం (2024-25 ఆర్థిక సంవత్సరంలో 6 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3 కోట్లు, 2026-27 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్లు).
 

-2024-25 ఆర్థిక సంవత్సరంలో 400 జిల్లాలు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో అన్ని జిల్లాలను కవర్ చేస్తూ, రెండేళ్ళలో దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వేను ప్రారంభించడం

 2.కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టం

కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (డీఎస్ఎస్) అనేది పంటలు, నేల, వాతావరణం, నీటి వనరులపై రిమోట్ సెన్సింగ్ డేటాను సమగ్ర భౌగోళిక వ్యవస్థకి అనుసంధానిస్తుంది.

 

 3. మట్టి ప్రొఫైల్ మాపింగ్

ఈ మిషన్ కింద, దేశంలోని వ్యవసాయ భూమిలో దాదాపు 142 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 1:10,000 స్కేల్‌ తో పూర్తి  భూ సారం లక్షణాల చిత్రపటాన్ని రూపొందించడాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. సుమారు 29 మిలియన్ హెక్టార్ల మట్టి ప్రొఫైల్ సమాచార నిధి ఇప్పటికే పూర్తయింది.

 

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద, డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (డీజీసీఈఎస్) వ్యవసాయ ఉత్పత్తి ఖచ్చితత్వాన్ని పెంపొందించడానికి, ఖచ్చితమైన దిగుబడి అంచనాలను అందించడానికి పంట కోత ప్రయోగాలకు ఉపయోగిస్తారు.
ఈ మిషన్, వ్యవసాయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తుందని, దాదాపు 2,50,000 మంది శిక్షణ పొందిన స్థానిక యువతకు, కృషి సఖిలకు అవకాశాలను కల్పిస్తుందని భావిస్తున్నారు.

 

డేటా అనలిటిక్స్, ఏఐ, రిమోట్ సెన్సింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా, ఈ మిషన్ రైతులకు- ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు, సలహాలు ఇవ్వడంతోపాటు అన్ని రకాల సేవలను అందిస్తారు.  

మిషన్ ముఖ్య భాగాలు

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఎలాంటి మినహాయింపులూ లేకుండా అమలు చేయడంపై దృష్టి పెడుతుంది.  రైతులను ప్రాథమిక లబ్ధిదారులుగా భావిస్తోంది.

మిషన్ వల్ల కొన్ని ప్రయాజనాలు:

1. సేవలు, ప్రయోజనాలు అందుబాటులోకి రావడంతో పాటు, రాతపనిని తగ్గించడం, వ్యక్తిగతంగా సందర్శించే అవసరం తగ్గించడం కోసం డిజిటల్ ప్రమాణీకరణ.

2. పంట విస్తీర్ణం, దిగుబడిపై ఖచ్చితమైన డేటా ద్వారా ప్రభుత్వ పథకాలు, పంటల బీమా, రుణ వ్యవస్థలలో మెరుగైన సామర్థ్యం, పారదర్శకత.

3. మెరుగైన విపత్తు ప్రతిస్పందన, బీమా క్లెయిముల కోసం క్రాప్ మ్యాప్ రూపకల్పన, పర్యవేక్షణ.

4. డిజిటల్ మౌలిక వ్యవస్థ ద్వారా అన్ని విభాగాల నుంచీ లాభం చేకూరేలా చూడటం, పంట ప్రణాళిక, ఆరోగ్యం, తెగుళ్ల నిర్వహణ, నీటిపారుదల కోసం తగిన సలహా సేవలను అందిస్తారు.  

 డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాల భాగస్వామ్యంతో వచ్చే మూడేళ్లలో వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ)ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
 

ఈ కార్యక్రమం ఈ సంవత్సరం 400 జిల్లాలకు ఖరీఫ్ కోసం డిజిటల్ పంట సర్వేతో రైతులు, వారి భూములను దీని పరిధిలోకి తెస్తారు. 6 కోట్ల మంది రైతులు, వారి భూముల వివరాలతో రిజిస్ట్రీలను తాజా సమాచారంతో నింపుతారు.

యూనియన్ బడ్జెట్ 2023-24 గతంలో వ్యవసాయం కోసం డీపీఐని ప్రవేశపెట్టింది. ఇది జనాభా వివరాలు, భూమి హక్కులు, సాగులో ఉన్న పంటలతో సహా రైతులపై సమగ్ర డేటాను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. పశువులు, చేపల పెంపకం, నేల ఆరోగ్యం,  అందుబాటులో ఉన్న ప్రయోజనాలపై సమాచారంతో సహా రైతు-కేంద్రిత సేవల శ్రేణిని అందించడానికి డీపీఐ రాష్ట్ర, కేంద్ర డిజిటల్ మౌలిక సదుపాయాలతో ఏకీకృతం చేస్తుంది.

ముగింపు

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌తో పాటు మొత్తం రూ.14,235.30 కోట్లతో ఆరు ప్రధాన పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 

ఈ కార్యక్రమాలలో 2047 నాటికి ఆహార భద్రత, వాతావరణ స్థితిస్థాపకతను నిర్ధారించే లక్ష్యంతో క్రాప్ సైన్స్ కోసం రూ.3,979 కోట్లు, విద్యార్థులు, పరిశోధకులకు మద్దతుగా వ్యవసాయ విద్య, నిర్వహణ, సామాజిక శాస్త్రాలను బలోపేతం చేయడానికి రూ. 2,291 కోట్లు ఉన్నాయి. రూ.1,702 కోట్లు సుస్థిరమైన పశుసంపద, డెయిరీ ద్వారా ఆదాయాన్ని పెంచడానికి కేటాయించగా, ఉద్యానవనాల నుండి ఆదాయాన్ని పెంచడానికి హార్టికల్చర్ స్థిర అభివృద్ధి కోసం రూ.1,129.30 కోట్లు కేటాయించారు. అదనంగా, కృషి విజ్ఞాన కేంద్రాన్ని బలోపేతం చేయడానికి రూ.1,202 కోట్లు, సహజ వనరుల నిర్వహణ కోసం రూ.1,115 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు.

ఈ సమగ్ర విధానాలు భారతదేశ వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, సామర్థ్యం, స్థిరత్వాన్ని పెంపొందించడానికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల జీవితాలను మార్చగలవు. డిజిటల్ విప్లవాన్ని వ్యవసాయానికి విస్తరించడం ద్వారా, ఆర్థిక వ్యవస్థలోని క్లిష్టమైన రంగాలకు వినూత్న, సాంకేతికతతో నడిచే పరిష్కారాలలో ప్రపంచ నాయకుడిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది.

 

***




(Release ID: 2052113) Visitor Counter : 192