చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
సజావుగా, సమర్థవంతంగా, పారదర్శకంగా ఉండేలా నోటరీల నియామకం: కొత్త నోటరీ పోర్టల్ ప్రారంభం
Posted On:
03 SEP 2024 8:23PM by PIB Hyderabad
కేంద్ర న్యాయశాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ ( స్వతంత్ర బాధ్యత) మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ చేతుల మీదుగా కొత్త నోటరీ పోర్టల్ (https://notary.gov.in) ప్రారంభమైంది.
ఈ నోటరీ పోర్టల్ అనేది నోటరీల నియామకం కోసం దరఖాస్తులు చేసుకునేందుకూ, ధ్రువ పత్రాల జారీ, పునరుద్ధరణ, సేవలు అందిస్తున్న ప్రాంతాల మార్పు, వార్షిక రిటర్నుల దాఖలు మొదలైన వివిధ సేవల కోసం ఉద్దేశించినది. ఇది నోటరీలు, ప్రభుత్వానికీ మధ్య పరస్పర అనుసంధానానికి ఉపయోగపడుతుంది. ఈ నోటరీ పోర్టల్ ఏర్పాటు కారణంగా, కేంద్ర ప్రభుత్వ నిర్ధారిత నోటరీలు దరఖాస్తులు/అభ్యర్థనలను వ్యక్తిగతంగా సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తులను ఈ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. వాటి తాజా స్థితినీ తెలుసుకోవచ్చు. వారి డిజీ లాకర్ ఖాతాల నుండి డిజిటల్ సంతకం చేసిన ప్రాక్టీస్ సర్టిఫికెట్లను కూడా పొందవచ్చు.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కేంద్ర న్యాయశాఖ మంత్రి ( స్వతంత్ర బాధ్యత) శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రసంగించారు. ప్రత్యేక నోటరీ పోర్టల్‌ను ప్రారంభించడమనేది కాగిత రహిత, ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేని, సమర్థవంతమైన వ్యవస్థను అందించడంలో ఇది ఒక ముందడుగు అని ప్రశంసించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఊహించిన డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దిశగా పడిన సమర్థవంతమైన అడుగు అని ఆయన అన్నారు. ఈ పోర్టల్ తేలికగా వాడుకునే పద్ధతిలో తయారైందని, ఉద్దేశించిన ఫీచర్లన్నీ కాలక్రమంగా అందివచ్చినపుడు నోటరీలకు, ప్రజలకు ఇది బాగా సహాయపడుతుందని మంత్రి అన్నారు.
పోర్టల్‌ను ప్రారంభించిన తర్వాత కేంద్ర మంత్రి రాజస్థాన్‌లోని బికనీర్ కు చెందిన శ్రీ భూరా రామ్ కు నోటరీ ప్రాక్టీస్ మొదటి సర్టిఫికేట్ ను పోర్టల్ ద్వారా జారీ చేశారు.
కొత్త నోటరీ పోర్టల్ ముఖ్య లక్షణాలను కేంద్ర న్యాయ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ మణి తెలియజేశారు. దేశవ్యాప్తంగా నోటరీల ఎంపిక, నియామకాల వ్యవస్థను వేగంగా, సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఈ పోర్టల్ సహాయపడుతుందని, నోటరీలకు సంబంధించిన అన్ని రికార్డుల నిల్వ సౌకర్యాన్ని నిర్వహించే డిజిటల్ స్టోరేజ్ సదుపాయాన్ని రూపొందించడంలో కూడా ఇది ఉపయోగపడుతుందని అన్నారు. మునుపటి నోటరీ దరఖాస్తుల పోర్టల్ తో పోలిస్తే, కొత్త పోర్టల్ అనేక నూతన అంశాలతో తయారైందని అన్నారు. అన్ని అంశాలతో కలిపి పూర్తి స్థాయిలో కొత్త పోర్టల్ పని చేసిన తర్వాత, ఇది ఎలాంటి ఇబ్బందులు లేని నోటరీ చట్ట నిర్వహణకు దోహదం చేస్తుంది. దేశ వ్యాప్తంగా ప్రజలకు లబ్ధి చేకూరుస్తుంది.
ఎన్ ఐ సీ సహకారంతో ప్రారంభమైన ఈ నోటరీ పోర్టల్ వివిధ పీఛర్లతో అభివృద్ధి చేశారు. దీన్ని దశల వారీగా రూపొందించారు. మొదటి దశలో, తాత్కాలికంగా ఎంపిక చేసిన నోటరీలకు ప్రాక్టీస్ సర్టిఫికేట్ జారీ చేయడానికి సంబంధించిన ఫీచర్ ను ప్రారంభించారు. ప్రాక్టీస్ సర్టిఫికేట్ పునరుద్ధరణ, వార్షిక రిటర్నుల సమర్పణకు సంబంధించిన ఫీచర్లను ఇదే ఏడాదిలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
***
(Release ID: 2051592)
Visitor Counter : 122