వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రూ.2,817 కోట్ల వ్యయంతో కూడిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌కు ఈ రోజు మంత్రిమండలి ఆమోదం: కేంద్ర వాటా రూ. 1,940 కోట్లు
Posted On:
02 SEP 2024 6:30PM by PIB Hyderabad
కేంద్ర వాటా రూ.1,940 కోట్లతో కలిపి మొత్తం రూ.2,817 కోట్ల వ్యయంతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది.
డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి వివిధ కార్యక్రమాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే పథకంగా ఈ మిషన్ రూపొందించారు. డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (డీజీసీఈఎస్) అమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అకడమిక్, పరిశోధన సంస్థల ద్వారా ఇతర ఐటీ కార్యక్రమాలను చేపట్టడం వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దీని ద్వారా ఏర్పాటవుతుంది.
ఇటీవలి సంవత్సరాలలో డిజిటల్ గుర్తింపులను అందుబాటులోకి తేవడమే కాకుండా, సురక్షితమైన చెల్లింపులు, లావాదేవీల ద్వారా పాలన, సేవా పంపిణీని భారతదేశ డిజిటల్ విప్లవం మార్చివేసింది. ఇది ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, విద్య, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించింది, పౌర-కేంద్రీకృత డిజిటల్ పరిష్కారాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపింది.
వ్యవసాయ రంగంలో ఇలాంటి పరివర్తన కోసం, ప్రభుత్వం 2023-24 కేంద్ర బడ్జెట్లో, వ్యవసాయానికి సంబంధించిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందించనున్నట్టు ప్రకటించింది. ఇంకా, 2024-25 బడ్జెట్లో, వ్యవసాయ రంగానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) చొరవను మరింత పెంచుతామని కూడా ప్రకటించింది. రైతుల ప్రామాణికమైన జనాభా వివరాలు, వారి చేతిలో ఉన్న భూములు, సాగులో ఉన్న పంటలతో కూడిన సమగ్ర, ఉపయోగకరమైన డేటాను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ). రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం ఇందులో రైతులు, కౌలు రైతులు ఉంటారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సంబంధిత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అనుసంధానించి ఉంటుంది. పశువులు, మత్స్య సంపద, భూసారం, ఇతర వృత్తులు, కుటుంబ వివరాలు, పథకాలు, ప్రయోజనాలు పొందిన రైతుల డేటాను ఉపయోగిస్తారు. ఇది వ్యవసాయంలో వినూత్నమైన రైతు-కేంద్రంగా డిజిటల్ సేవలకు మార్గం వేస్తుంది. వికసిత భారత్-2047 విజన్‌తో అనుసంధానం చేస్తూ, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌కు ముఖ్యమైనదిగా వ్యవసాయంలో డీపీఐ కీలకపాత్ర పోషిస్తుంది.
మిషన్ కింద రూపొందుతున్న మూడు డీపీఐలు... అగ్రిస్టాక్, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్. రైతు-కేంద్రంగా డిజిటల్ సేవలను ప్రారంభించడంతో పాటు, ఈ డీపీఐలు వ్యవసాయ రంగానికి సకాలంలో, విశ్వసనీయ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతాయి.
అగ్రిస్టాక్ అనేది రైతు-కేంద్రిత డీపీఐ. ఇది రైతులకు సమర్థవంతమైన, సులభమైన, వేగవంతమైన సేవలు, పథకం అమలును అనుమతిస్తుంది. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ సంస్థల మధ్య సహకార ప్రాజెక్టుగా సమాఖ్య నిర్మాణంలో రూపొందిస్తున్నారు. ఇది వ్యవసాయ రంగంలో మూడు ప్రాథమిక రిజిస్ట్రీలు లేదా డేటాబేస్‌లను కలిగి ఉంటుంది, అంటే, రైతుల రిజిస్ట్రీ, జియో-రిఫరెన్స్ చేసిన గ్రామ మ్యాప్‌లు, పంట సాగు రిజిస్ట్రీని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందిస్తాయి. వాటిని నిర్వహిస్తాయి.
అగ్రిస్టాక్ కింద, రైతులకు ఆధార్ మాదిరిగానే డిజిటల్ గుర్తింపు కార్డు (రైతు ఐడీ) ఇస్తారు. ఇది ఒక విశ్వసనీయమైన ‘కిసాన్ కి పెహచాన్’. ఈ 'రైతు ఐడీ' రాష్ట్ర భూ రికార్డులు, పశువుల యాజమాన్యం, సాగవుతున్న పంటలు, జనాభా వివరాలు, కుటుంబ వివరాలు, పథకాలు, పొందే ప్రయోజనాలు మొదలైన వాటికి గతిశీలంగా అనుసంధానిస్తారు. సాగు చేసుకుంటున్న రైతుల పంటలను మొబైల్ ఆధారిత భూ సర్వేలు అంటే డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా రికార్డ్ చేస్తారు. ప్రతి సీజన్‌లో దీనిని నిర్వహిస్తారు.
వ్యవసాయం కోసం డీపీఐని రూపొందించి అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకుంటున్నాయి. ఇప్పటివరకు, 19 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అగ్రిస్టాక్‌ను అమలు చేయడానికి ప్రాథమిక ఐటీ మౌలిక సౌకర్యాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికే పైలట్ ప్రాతిపదికన పరీక్షించారు. అది ఈ క్రింది విధంగా ఉంది:
i. రైతు ఐడీలను తయారు చేయడానికి, ఉత్తరప్రదేశ్ (ఫరూఖాబాద్), గుజరాత్ (గాంధీనగర్), మహారాష్ట్ర (బీడ్), హర్యానా (యమునా నగర్), పంజాబ్ (ఫతేగఢ్ సాహిబ్), తమిళనాడు (విరుద్‌నగర్), ఈ ఆరు రాష్ట్రాల్లో ఒక్కో జిల్లా చొప్పున ప్రయోగాత్మకంగా అమలు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆరు కోట్ల మంది రైతులు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో మూడు కోట్ల మంది రైతులు, 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండు కోట్ల మంది రైతులు: మొత్తం 11 కోట్ల మంది రైతులకు డిజిటల్ గుర్తింపు కార్డులను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ii. సాగులో ఉన్న భూమి రిజిస్ట్రీ అభివృద్ధి కోసం, 2023-24లో 11 రాష్ట్రాల్లో డిజిటల్ క్రాప్ సర్వేను ప్రయోగాత్మకంగా నిర్వహించారు. అంతేకాకుండా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 400 జిల్లాలు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా, దేశవ్యాప్తంగా డిజిటల్ పంటల సర్వేను రెండేళ్లలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పంటలు, నేల, వాతావరణం, నీటి వనరులు మొదలైన వాటితో రిమోట్ సెన్సింగ్ ఆధారిత సమాచారాన్ని ఏకీకృతం చేయడానికి 'కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టం', సమగ్ర భౌగోళిక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
మిషన్ కింద, దేశంలోని వ్యవసాయ భూమిలో దాదాపు 142 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 1:10,000 స్కేల్ తో పూర్తి భూ సారం లక్షణాల చిత్రపటాన్ని రూపొందించడాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. సుమారు 29 మిలియన్ హెక్టార్ల మట్టి ప్రొఫైల్ ఇన్వెంటరీ ఇప్పటికే పూర్తయింది.
డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (డీజీసీఈఎస్) శాస్త్రీయంగా రూపొందించిన పంట కోత ప్రయోగాల ఆధారంగా దిగుబడి అంచనాలను అందిస్తుంది. వ్యవసాయోత్పత్తిపై ఖచ్చితమైన అంచనాలను రూపొందించడంలో ఈ చొరవ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వ్యవసాయ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడంలో ఈ మిషన్ ఉత్ప్రేరకంగా ఉంటుంది. ఇంకా, మిషన్ కింద డిజిటల్ పంట సర్వేలు, రిమోట్ సెన్సింగ్ కోసం గ్రౌండ్-ట్రూత్ డేటా సేకరణ మొదలైనవి, సుమారు 2.5 లక్షల శిక్షణ పొందిన స్థానిక యువత, కృషి సఖిలకు ఉపాధి అవకాశాలను అందించగలవని భావిస్తున్నారు.
మిషన్‌లోని వివిధ అంశాలు అట్టడుగు స్థాయిలో అమలు చేస్తారు. దీనికి అంతిమ లబ్ధిదారులు రైతులే. రైతులు, వ్యవసాయ భూములు, పంటలపై విశ్వసనీయ డేటా ద్వారా, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిమోట్ సెన్సింగ్ వంటి ఆధునిక డిజిటల్ సాంకేతికతలను ఉపయోగిస్తారు. రైతులకు, వ్యవసాయ రంగంలోని వాటాదారుల కోసం సేవలు అందించే వ్యవస్థని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడం మిషన్ లక్ష్యం. కొన్ని ఉదాహరణలు చుస్తే:
i) వివిధ కార్యాలయాలు లేదా సర్వీస్ ప్రొవైడర్లను భౌతికంగా సందర్శించాల్సిన అవసరం లేకుండా, గజిబిజిగా ఉన్న కాగిత పని పక్కన పెట్టి, ప్రయోజనాలు, సేవలను యాక్సెస్ చేయడానికి ఒక రైతు తనను తాను డిజిటల్‌గా గుర్తించి, ప్రామాణీకరించగలుగుతారు. కొన్ని ఉదాహరణలు ప్రభుత్వ పథకాలు, పంట రుణాలను పొందడం, వ్యవసాయ-ఇన్‌పుట్ సరఫరాదారులు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారులకు కనెక్ట్ చేయడం, రియల్ టైంలో వ్యక్తిగతీకరించిన సలహాలను యాక్సెస్ చేయడం మొదలైనవి.
ii కాగిత రహిత ఎంఎస్పి ఆధారిత సేకరణ, పంట బీమా, క్రెడిట్ కార్డ్-అనుసంధాన పంట రుణాలు వంటి పథకాలు, సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా చేయడానికి ప్రభుత్వ ఏజెన్సీలకు విశ్వసనీయ డేటా సహాయం చేస్తుంది. ఎరువుల సమతుల్య వినియోగం కోసం వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. ఇంకా, 'డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే-ఆధారిత దిగుబడి', రిమోట్ సెన్సింగ్ డేటాతో పాటు 'పంట-సాగు ప్రాంతంపై డిజిటల్‌గా సంగ్రహించిన డేటా' ఖచ్చితమైన పంట ఉత్పత్తి అంచనాకు సహాయపడుతుంది. ఇది పంటల వైవిధ్యాన్ని సులభతరం చేయడానికి, పంట, సీజన్ ప్రకారం నీటిపారుదల అవసరాలను అంచనా వేయడానికి కూడా సహాయపడుతుంది.
iii కృషి-డీఎస్ఎస్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో, పంటల సాగు పద్ధతులను గుర్తించేందుకు పంట మ్యాప్ ను రూపొందించవచ్చు, కరువు/వరదల పర్యవేక్షణ, సాంకేతికత/మోడల్ ఆధారిత దిగుబడి అంచనాలను గుర్తించడం కోసం రైతులు పంటల బీమా క్లెయిములను పరిష్కరించేందుకు తోడ్పడుతుంది.
iv మిషన్ కింద అభివృద్ధి చేసిన, వ్యవసాయ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలోని వాటాదారులతో వ్యవసాయ పెట్టుబడులు, పంట అనంతర ప్రక్రియల కోసం సమర్థవంతమైన విలువ సంబంధాలను ఏర్పాటు చేస్తుంది. అలాగే పంట ప్రణాళిక, పంట ఆరోగ్యానికి సంబంధించిన రైతులకు ప్రత్యేకించిన సలహా సేవలకు పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుంది. తెగుళ్లు, వ్యాధుల నిర్వహణ, నీటిపారుదల అవసరాలు, మన రైతులకు సాధ్యమైనంత ఉత్తమమైన, సమయానుకూల మార్గదర్శకత్వం, సేవలను అందజేసేందుకు భరోసా ఇస్తుంది.
***
(Release ID: 2051126)
Visitor Counter : 182