నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2024 6:16PM by PIB Hyderabad
ఓ ఆరోగ్య యోధపై ఆగష్టు 9న జరిగిన హింస అత్యంత అనాగరికమైన చర్య అని, అది మానవీయతకు జరిగిన అవమానమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. రిషికేశ్ ఏఐఐఎంఎస్ లో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆదివారం ఆయన మాట్లాడారు. అలాంటి ఆటవిక ఘటనలు నాగరిక సమాజానికి సిగ్గుచేటని, భారతీయ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేస్తాయని అన్నారు.
ఇది ‘రోగ లక్షణం’ అంటూ కొందరు విచ్చలవిడిగా మాట్లాడడంపై విచారం వ్యక్తంచేస్తూ, ఇలాంటి ప్రకటనలు బాధను తీవ్రతరం చేస్తాయని, పుండు మీద కారం చల్లుతాయని అన్నారు.
“అమానవీయ ఘటనలు జరిగినప్పుడు కొందరు విచ్చలవిడిగా మాట్లాడడం ఆందోళన కలిగిస్తోంది. అవి మన బాధను మరింత తీవ్రతరం చేస్తాయి. ఇంకా చెప్పాలంటే, ఇప్పటికే గాయపడిన మన మనస్సులను వారు ఇంకా బాధిస్తున్నారు. అది అనారోగ్యాన్ని సూచించే రోగలక్షణమట, అలాంటి ఘటన సాధారణమే అని వారంటున్నారు. ఓ పార్లమెంటు సభ్యుడు, సీనియర్ న్యాయవాదిగా ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం మరీ తప్పు. ఇటువంటి పైశాచిక ఆలోచనలు క్షమార్హం కావు. దారి తప్పిన అలాంటి వ్యక్తులు తమ ఆలోచనలను పునఃసమీక్షించుకోవాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాను. ఇది మీరు రాజకీయ కోణంలో చూడవలసిన సందర్భం కాదు. ఈ రాజకీయ దృక్కోణం ప్రమాదకరమైనది, అది మీ నిష్పాక్షికతను హరిస్తుంది” అని ఆయన అన్నారు.
దేశంలోని వైద్య బృందానికి, దేశ మహిళలకు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తన జవాబుదారీతనాన్ని అంగీకరిస్తూ, “నిజానికి రాజ్యాంగ పదవిలో మీ ముందున్న నేను నా జవాబుదారీతనాన్ని చూపాలి. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్ గా నా పదవికి న్యాయం చేయాలి’’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.
“ఇలాంటి ఘటనలు మన హృదయాన్ని గాయపరుస్తాయి. మన మనస్సు రోధిస్తోంది. అంతరాత్మ జవాబుదారీతనాన్ని అడుగుతోంది” అని ఆయన అన్నారు.
శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఫలితం ఆశించకుండా, కర్తవ్యాన్నే నిర్వర్తించే ‘నిష్కామ సేవ’గా వైద్య నిపుణుల కృషిని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. వైద్యులపై ఏ రూపంలోనైనా హింసాత్మక చర్యలను ఉపరాష్ట్రపతి ఖండించారు.
పని ప్రదేశాల్లో వైద్యుల భద్రత దృష్ట్యా, ఆరోగ్య యోధులను అన్నివిధాలా రక్షించేలా యంత్రాంగాన్ని రూపొందించాలని ఆయన స్పష్టంచేశారు.
“వైద్యుడు ఓ పరిమితి వరకూ సహాయపడగలడు. వైద్యుడు దేవుడు కాలేడు. దేవుడి తర్వాతే వైద్యుడు. ఎవరైనా మరణించిన సందర్భాల్లో భావోద్వేగాలు, అనియంత్రిత భావాల వల్ల వైద్యులతో సరిగ్గా వ్యవహరించడం లేదు. వైద్యులు, నర్సులు, కాంపౌండర్లు, ఆరోగ్య యోధులకు తగిన రక్షణ కల్పించాలి’’ అని ఆయన అన్నారు.
కావాలని మౌనం వహిస్తున్న కొన్ని ఎన్జీవోల వైఖరిని తప్పుపడుతూ, ‘‘చిన్నచిన్న ఘటనలకే వెంటనే రోడ్డెక్కే అనేక ఎన్జీవోలు చప్పుడు చేయడం లేదు. మనం వారిని ప్రశ్నించాలి. వారి మౌనం ఈ దారుణానికి ఒడిగట్టిన నేరస్తుల చర్య కన్నా దారుణమైనది. రాజకీయాలు చేసి స్వలాభం పొందజూస్తున్న వారు తమ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకోవడం లేదు’’ అని శ్రీ ధన్కడ్ అన్నారు.
ఇలాంటి సంఘటనలను నివారించి, మహిళల కోసం సురక్షిత యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడంలో సమాజ బాధ్యతను ప్రస్తావిస్తూ, “ఎవరు తప్పు చేసినా వారు బాధ్యులే. కానీ సమాజం కూడా జవాబుదారీగా ఉండాలి. సమాజం తన బాధ్యతను విస్మరించలేదు. దీనిని ప్రభుత్వానికి సంబంధించిన విషయంగానో, రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశంగానో చూడాలని నేను అనుకోవడం లేదు. ఇది సామాజిక అంశం, ఇది మన అస్తిత్వానికి సవాలు. ఇది మన అస్తిత్వ పునాదినే కదిలిపోయేలా చేసింది. వేల ఏళ్ల భారత్ నిలుపుకొన్న ఆదర్శాలను ఇది ప్రశ్నార్థకం చేసింది’’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
***