ఉప రాష్ట్రపతి సచివాలయం
డెహ్రాడూన్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాలలో ఉపరాష్ట్రపతి ప్రసంగపాఠం
प्रविष्टि तिथि:
01 SEP 2024 1:19PM by PIB Hyderabad
మీ అందరికీ శుభోదయం.
ఒక్కసారిగా నేను 60 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాను. చిత్తోడ్ ఘడ్ సైనిక పాఠశాలలో నేను చేరిన రోజులు గుర్తొస్తున్నాయి. నేను ఇక్కడికి రావడానికి కారణం మీరే. చిత్తోడ్ ఘడ్ సైనిక పాఠశాలకు వెళ్లినపుడు, అంటే, 60 ఏళ్ల కిందట నేను కూడా మీలో ఒకడిని. ఏమన్నాను? పుట్టడమైతే నేను ఝంఝ్ను జిల్లా కిథానా గ్రామంలో పుట్టానే కానీ, నిజంగా కళ్లు తెరిచింది మాత్రం చిత్తోడ్ ఘడ్ సైనిక పాఠశాలలోనే.
నేనీ రోజు ఇలా ఉండటానికి కారణం నా తల్లిదండ్రులు, తాతామామ్మలు, నా ఉపాధ్యాయులు, అంతకు మించి నా మాతృ విద్యాసంస్థ. ఈ బంధం ఆజన్మాంతం కొనసాగుతుంది. నా శ్వాస ఆగినా, దేవుని దయ వల్లనైనా, ఈ బంధం తెగిపోదని నేను బలంగా విశ్వసిస్తాను. అబ్బాయిలూ, అమ్మాయిలూ, మీకూ ఈ బంధం చిరకాలం ఉండిపోతుంది. మీరిక్కడ సంపాదించుకున్నది మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.
‘ఏక్ పేడ్ మా కే నామ్’.కామాండెంట్ కు నాదో విన్నపం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు విద్యార్ధులందరినీ అనుమతించండి. వారి వారి స్వస్థాలకు ఈ ప్రచారాన్ని వారు తీసుకుని వెళతారు. గౌరవనీయులైన మన ప్రధానమంత్రి ఇచ్చిన ఈ మహత్తరమైన పిలుపు ఎంతో అర్థవంతమైంది. వాతావరణ మార్పుల మహమ్మారిని అడ్డుకునే దిశగా ఇచ్చింది. కారణం చాలా చిన్నది. మనం నివశించదగిన మరో గ్రహం ఏదీ లేదు. ఇపుడు మీరుంటున్న ఈ స్థానం ప్రాముఖ్యత గురించి నేను వివరంగా చెప్పాల్సిన పని లేదు. ఇది నాకు లభించిన అదృష్టంగానే భావిస్తాను. వందేళ్ల చరిత్ర ఉన్న అరుదైన, సాటిలేని ఈ గొప్ప సంస్థ గురించి నా తుదిశ్వాస వరకూ గుర్తుంచుకుంటాను. 1922లో ఈ సంస్థను ప్రారంభించి, నాటి 33 మంది క్యాడెట్లను ఉద్దేశించి వేల్స్ యువరాజు ప్రసంగిస్తూ ఈ సంస్థ దృక్పథాన్ని ముందే నిర్దేశించారు. ‘‘జీవితం అనే దాగలిపై పడే తొలి సమ్మెట దెబ్బలు, నీ ప్రస్థానాన్నీ, నీ వ్యక్తిత్వాన్నీ నిర్ణయిస్తాయి. తర్వాత జరిగే జీవన పోరాటంలో నిన్ను ఒక మానవ ఆయుధంగా మలుస్తాయి’’. క్యాంపస్ లో ‘‘జీవితం అనే దాగలిపై పడిన ఈ కొద్దిపాటి దెబ్బలు’’ నీకు ప్రతిష్ఠను తెచ్చిపెడతాయి. సంస్థకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి.
ఆసక్తికరమైన సంఘటన ఏమంటే, భారతీయ సంస్కృతిలో భాగమైన గురు-శిష్య పరంపరను యువరాజు కూడా గుర్తించారు. మన సంస్కృతి, మన విలువల ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరని చెప్పడానికి ఇదే ఉదాహరణ.
సహజంగానే, ఇదిప్పుడు ప్రపంచ వ్యాప్త ఆకర్షణ. దార్శనికతతో కూడిన నాయకత్వానికి కతజ్ఞతలు.
మిలిటరీ సర్వీసుల్లో బ్రిటీషు అధికారులతో సమాన హోదా ఉండాలన్న డిమాండు నుంచి మహత్తరమైన ఈ సంస్థ పురుడు పోసుకున్నది.
బ్రిటీషు-ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ హోదా పదోన్నతి కోసం ఆరాటపడేవాళ్లు. అయితే దాదాపు 200 సంవత్సరాలపాటు దీనిని భారతీయులకు ఇవ్వ నిరాకరించారు. ఈ వెసులుబాటు ఒక్క బ్రిటీషు వాళ్లకు మాత్రమే పరిమితం.
మనల్ని బ్రిటీషు వాళ్లు పరిపాలించినప్పటికీ, సమానత్వం, జాతీయవాదం స్ఫూర్తితోనే ఈ సంస్థ ఎదగడం గొప్ప విశేషం.
భారతీయుల మనస్సుల్లో మండిన జాతీయ వాదం అనే అగ్గి నుంచే ఈ సంస్థ రూపుదిద్దుకున్నది. సైనిక పాఠశాలలు, మిలిటరీ విద్యా సంస్థల్ని స్థాపించి వందేళ్లయిన తర్వాత, జూలై, 2022లో అమ్మయిలను అనుమతించారు. ఇదొక గొప్ప మలుపు, పరిస్థితి మొత్తాన్నీ మార్చేసిన క్షణాలు. ఇదే దేశం మొత్తం నేడు ప్రతిఫలిస్తోంది.
నా యువ స్నేహితులారా, ఈ రెండిటికీ ఆలోచన ఒక్కటే. బాలికల్ని తీసుకోవడం అంటే, ఎలాంటి వివక్షకూ తావులేదని చెప్పడం. ఇదిప్పుడు రాజ్యాంగం అందిస్తున్న ప్రాథమిక హక్కుగా మారింది.
నా యువ స్నేహితులారా, ప్రపంచం కంటే మనమే ముందున్నందుకు గర్వించుదాం. ప్రపంచంలో ఎక్కువ మంది సివిల్ మహిళా పైలట్లున్న బృందం మనదే. మన మహిళలు నేడు యుద్ధ విమానాలు నడుపుతున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ముందు వరుసలో ఉన్నారు. ఒక యువతి... పేరు గుర్తులేదు. నన్ను కలిసుకున్న తర్వాత కేవలం 48 గంటల్లో నా గురించి నా కళ్లకు కట్టేలా వివరించడం నన్నెంతో ఆశ్చర్యానికి గురిచేసింది.
స్నేహితులారా, ఈ ఏడాది జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో నిర్వహించిన కర్తవ్యపథ్ లో నారీశక్తి విశ్వరూపాన్ని దేశం మొత్తం గమనించింది. ఎంత కన్నుల పండువగా జరిగింది! ప్రతి రంగంలోనూ నేడు మహిళలదే పైచేయిగా కనిపిస్తోంది. అన్ని రంగాల్లో నారీశక్తి ప్రభావం ఎక్కువగా ఉందన్నది తెలుస్తోంది. వారి కృషి అందించే ఫలితాలే మనల్ని 2047లో అభివృద్ధి పథంవైపుగా నడిపిస్తాయి.
నేను రాజ్యసభ ఛైర్మన్ గా ఉండగా, ఓ మహత్తర సంఘటనకు సాక్షిగా ఉండే అదృష్టం దక్కింది. లోక్ సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు... చిత్తశుద్ధితో చేసిన అనేక ప్రయత్నాల ఫలితం. తప్పకుండా ఇది ఓ మహత్తరమైన మార్పులకు శ్రీకారం చుడుతుంది. అబ్బాయిలూ, అమ్మాయిలూ, మీకు స్ఫూర్తి- రిమ్కోలియన్లు. అనేక రంగాలపై, ముఖ్యంగా డిఫెన్స్ సర్వీసుల్లో వారి ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చాలా మంది ఉన్నత శిఖరాలను అందుకున్నారు. స్వర్గీయ జనరల్ బిపిన్ రావత్ కూడా పేరుమోసిన ఒక రిమ్కోలియన్. రక్షణ దళాల (సీడీఎస్)కు తొలి అధిపతిగా గౌరవాన్ని పొందారు. ఆయన ఈ ప్రాంతం నుంచే వచ్చారు.
దేశసేవ కోసం యువతను అన్నిరకాలుగా తీర్చిదిద్దుతున్న ప్రతిష్ఠాత్మక సంస్థ- ఆర్ఐఎంసీ. దేశానికి లభించిన గొప్ప ఆస్తి. ఈ సంస్థ నెలకొల్పిన ప్రమాణాలను ఇదే తరహా విద్యా సంస్థలు ఆదర్శంగా తీసుకోవచ్చు.
యువ స్నేహితులారా, 1972లో జరిగిన ఆర్ఐఎంసీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసంలో అప్పటి రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి చెప్పిన గొప్ప మాటల్ని మీకోసారి గుర్తు చేస్తాను.
‘‘యువ క్యాడెట్లారా, మీ జీవితాల్లో చక్కగా ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకునే గొప్ప సమయం. మీ కాళ్లపై మీరు నిలబడేలా, అలాగే, ఈ దేశపు గొప్ప సైనికులుగా మారేందుకు మీ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించండి. తద్వారా మీపైన మేం పెట్టుకున్న ఆశల్ని నెరవేర్చండి. మీ కళాశాల ఆదర్శం- बल विवेक కు మారుపేరుగా నిలబడండి. బలం, వివేకం- ఈ రెండింటినీ మీలో నింపుకుని జీవితంలో కూడా పోరాడండి. కష్టపడి పని చేయండి. మన సైనిక దళాల సంస్కృతిని పరిరక్షించండి. దేశాన్ని పరిపుష్ఠం చేయండి. యుద్ధం, శాంతి సమయాల్లో- ఆమె గౌరవాన్ని కాపాడండి’’.
ఈ సంస్థ ప్రతి క్యాడెట్ లోనూ నింపిన, ఎన్నటికీ నిలిచి ఉండే విలువలు, ప్రమాణాలతో ఆయన మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
మీరు మీ జీవితం ప్రథమార్థంలో ఉన్నారు. మున్ముందు మీ జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడూ, అవకాశాలు తలుపు తట్టినప్పుడూ ఈ మాటల్లోని వివేచన మీకు మార్గదర్శనం చేస్తుంది. అవకాశాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ప్రపంచం దీనిని గుర్తించింది. స్వర్గీయ వి.వి.గిరి గారు చెప్పిన మాటలు మీ చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ప్రతిభ కోసం వెదుకుతున్నపుడు ఒక ధృవ నక్షత్రంలా, సవాళ్లు ఎదురైనప్పుడు దీప స్తంభంలా దారి చూపిస్తాయి.
క్రమం తప్పకుండా, దేశసేవ కోసం నాయకుల్నీ, దేశభక్తుల్నీ ఆర్ఐఎంసీ తయారు చేయడాన్ని ఈ మాటలు గుర్తు చేస్తున్నాయి.
పాఠశాల గొప్పదనం- పుస్తకాల్లోని జ్ఞానాన్ని ప్రసారం చేయడంలోనూ, పిల్లవాడిని విద్యాపారంగతుడిగా తయారు చేయడంలోనూ, దేహదారుఢ్యంగల వాడిగా తయారు చేయడంలోనూ లేదు. ఆర్ఐఎంసీ వంటి రెసిడెన్షియల్ పాఠశాల పిల్లవాడికి పూర్తిస్థాయి అనుభవాన్ని అందిస్తుంది. అందించాలి కూడా. ఆర్ఐఎంసీ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ మాటల్లో ఇదే వ్యక్తం అయింది. ఈ కారణంగానే ఆర్ఐఎంసీ కొనసాగింది.
గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ కూడా మిలిటరీ నుంచే వచ్చారు. 2022లో జరిగిన వందేళ్ల పండుగ నాటి ప్రసంగంలో ప్రతి క్యాడెట్ లోనూ, రిమ్కోలియన్ లోనూ ఉన్న సేవానిరతిని మెచ్చకున్నారు. ఈ సంస్థ పూర్వ విద్యార్ధులందరూ మేథోబృందంగా యువతలో ఒక వైపు జాతీయ భావాన్ని నింపుతూ, మరోవైపు జాతివ్యతిరేక శక్తుల్నీ, వారి కుట్రలనూ నిర్వీర్యం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. బేషరతుగా, మనతోపాటు ఈ కర్తవ్య నిర్వహణకు రిమ్కోలియన్లందరూ ప్రచారకర్తలుగా జాతీయవాదాన్ని ముందుకు తీసుకుపోతారు.
ముఖ్యంగా ఎక్కువగా యువతరంతో నిండిన మన దేశంలో వారికి ఇదో గొప్ప అవకాశం. దేశంలో యువత శాతం ఎక్కువగా ఉండటం ప్రపంచంలో అరుదు. అందువల్ల అభివృద్ధి కూడా వేగంగా జరిగిపోతున్నది. ప్రపంచ వ్యాప్తంగా దేశానికి పేరు రావడానికీ, దేశ ఆర్థికాభివృద్ధిశరవేగంగా ముందుకు సాగిపోవడానికీ ఇదే కారణం. ఇలాంటి జైత్ర యాత్రను నా తరం వాళ్లు కలలో కూడా ఊహించలేదు.
యువ స్నేహితులారా, ఆర్ఐఎంసీ క్యాడెట్లుగా మీరు గొప్ప వారసత్వానికి ప్రతినిధులు. ఇన్నేళ్లుగా...సాధించుకున్న ఈ వారసత్వం గొప్పది. మీలో నింపుకున్న ఈ విలువలూ, ఇక్కడ మీరు తీసుకునే శిక్షణ, ఇక్కడ మీరు సంపాదించుకునే బంధాలు... అన్నీ మిమ్మల్ని అత్యున్నతమైన దేశభక్తులుగా తయారు చేస్తాయి.
యువ క్యాడెట్లారా,
మీ వ్యక్తిగత, వృత్తిగత ప్రయాణంలో మీకు ఎన్నో అగ్నిపరీక్షలు ఎదురవుతాయి. మీలో సహనం నశించి, నిస్సత్తువ ఆవరించిన క్షణాలు కూడా ఉంటాయి. ఇక్కడి శిక్షణా కాలంలోనూ, రాబోయే కాలంలోనూ, మీతోనే మీరు సంఘర్షించుకునే స్థితి కూడా వస్తుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు ఎవరు ధీరుడుగా వాటిని ఎదుర్కొంటారో, ఎవరు కష్టాలను చూసి చలించరో వారు మాత్రమే ధీరత్వానికీ, కార్యశీలతకూ, నాయకత్వానికీ ప్రతినిధులుగా ఉంటారు.
నేను చెబుతున్నవి ఉత్తుత్తి మాటలు కాదనీ, జీవితంలో ఎదగడానికి ఉపయోగపడే ప్రాథమిక సత్యమనీ మీకు మెల్ల మెల్లగా సాకారం అవుతుంది. ఇక్కడ మీరు అలవరుచుకునే క్రమశిక్షణా, చలించని మనస్తత్వం- మీరు భవిష్యత్తులో చేయబోయే యుద్ధాల్లో మీకు లభించే ఆయుధాలుగా ఉంటాయి. ఒక సాంకేతికతను మింగేస్తున్న మరో సాంకేతికత వల్ల- ప్రజా జీవితంలో అవకాశాలు నేడు ఒక వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
నా యువ స్నేహితులారా, ఇంత నాణ్యమైన విద్యను అందుకుంటున్న మీరెంతో అదృష్టవంతులు. నేడు చట్టం ముందు అందరూ సమానం అన్నదీ వచ్చింది, అలాగే అధికారంతోపాటు బాధ్యత కూడా వచ్చింది. మేమున్నది సవాళ్లతో కూడిన ప్రపంచమైతే, మీరున్నది అవకాశాల మెండుగా ఉన్న ప్రపంచం. నేడు అందరం చట్టానికి కట్టుబడి ఉండాల్సిందే. ‘‘నువ్వు ఎంత ఎత్తులోనైనా ఉండు. చట్టం దానికంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది’’ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి.
ఇలా చెప్పింది... విఖ్యాత బ్రిటన్ న్యాయమూర్తి లార్డ్ డెనింగ్. వాస్తవంగా చెప్పాలంటే, 1933ల నాటి డాక్టర్ థామస్ పుల్లర్ రచనల ద్వారా ఆయన స్ఫూర్తి పొందారు. భారతదేశంలో ఇలాంటి స్థితి ఉందా లేదా అన్న సంశయం ఒకనాడు ఉండేది కానీ, నేడది ముమ్మాటికీ నిజం. అందరూ సమానులే అన్న భావనకు మించిన ఆనందం, అంతకు మించిన సాంత్వన, అంతకు మించి ఆరోగ్యాన్నిచ్చే అంశం యువతకు మరొకటి ఉండదు.
తాను భిన్నమైన తరగతికి చెందినవాడిని కనుక, తెలివితేటలు అక్కర్లేదని భావిస్తూ ఎవరూ ముందుకు వెళ్లిపోవడం లేదు. ప్రజాస్వామ్యంలో కీలక భాగస్వామ్యం మీదేనని, మరీ మఖ్యంగా వికసిత్ భారత్ -2047 దిశగా దేశం దుసుకుపోతున్న దశలో, నేను ఈ సంగతి చెప్పదలచుకున్నాను. మీరు గొప్పగా స్థిరపడటమే కాకుండా, వికసిత్ భారత్ దిశగా మీరు మీ సేవల్ని మహత్తర స్థాయిలో అందిస్తారు.
నేను మీకు ఒకటే చెప్పదలచుకున్నాను. భయం, ఒత్తిడి, మానసిక నిస్త్రాణ గుప్పిట ఎన్నడూ చిక్కవద్దు. భయం ఎదుగుదలను తొక్కేస్తుంది. భయం కార్యశీలతను మీ నుంచి దూరం చేస్తుంది. బలవంతుడిని బలహీనుడిగా మార్చుతుంది. అనుకున్న దానికంటే చాలా తక్కువ సార్లే భయం మనల్ని ఆవహించవచ్చు. కానీ, దాన్నిచూసి ఎక్కువగా ఊహించుకుంటాం. చాలాసార్లు భయానికి సరైన కారణాలే ఉండవు. భయాన్ని ఊబి లాంటిదని అనుకుంటాం. ఓటమి గురించి వెరపు ఎన్నడూ వద్దు. జీవనయాత్రలో ఓటమి కూడా సహజ భాగస్వామి. ఓటమిని చూసి కుంగిపోయినా, ఒక లక్ష్యాన్ని సాధించాలని అనుకున్న వారు చెదరిపోయినా, నాగరికత ఇంత వరకూ వచ్చేదే కాదు. నేను స్వానుభవంతో చెబుతున్నాను. ఓటమి వచ్చినపుడు నువ్వు రెండేళ్లు వెనక్కి వెళ్లి చూసుకుంటే విజయానికి ఓటమి తొలి మెట్టు అన్నది అర్థం అవుతుంది. ఓటమి కేవలం కల్పితం. అదే సమయంలో మరో విషయం గుర్తుపెట్టుకోండి. మన ఎదుగుదల క్రమంలో భయంపాత్ర కూడా ఉంటుంది.
చరిత్రాత్మక చంద్రయాన్ ప్రయోగాలనే తీసుకోండి. చంద్రయాన్-2 దాదాపు విజయవంతం అయింది కానీ పూర్తిగా కాలేదు. దీనిని కొంత మంది ఓటమి అని అనుకున్నారు. తెలివిగల వాళ్లు అలా ఎందుకు భావిస్తారు? దానిని విజయాన్ని అందుకునే దారిలో ఒక దశ అని మాత్రమే అనుకుంటారు. ఆగస్టు 23, 2023 ఓగొప్ప అనుభూతికి గుర్తు. అదే ఎప్పటికీ మనం అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించుకునే రోజుగా మారింది.
చంద్రయాన్-3 విజయం మన అభివృద్ధి పథంలో ఓ చెరిగిపోని ముద్రను వేసింది. చంద్రుడి ఉత్తర ధృవాన్ని అందుకున్నాం. చంద్రయాన్-2కి సంబంధించిన తిరంగా పాయింట్ లేకపోతే, చంద్రయాన్-3 ద్వారా శివశక్తిని చేరుకుని ఉండేవాళ్లం కాదు. చంద్రయాన్-3 విజయం సాకారం అయ్యేది కాదు.
యువ మిత్రులారా,
దేశం ఒక దశ నుంచి మరో దశలోకి మారుతున్న గొప్ప సమయంలో మీరు ఉన్నారు. ఎక్కడ చూసినా ఆశాభావం వెల్లివిరుస్తోంది. వేగంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా మనం కూడా మారిపోతున్నాం. ఒక సాంకేతిక వ్యవస్థను మింగివేసే మరో వ్యవస్థ వస్తోంది. యువత వెన్వెంటనే ఇలాంటివాటిని అందిపుచ్చుకోగలుగుతున్నది, ఉపయోగించుకోగలుగుతున్నది. సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటున్నది.
మనం సాధిస్తున్న విజయాలను ప్రపంచం గుర్తిస్తున్నది. ప్రపంచ స్థాయి సంస్థలు మనల్ని మెచ్చుకుంటున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ భూమిపై పని చేస్తున్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఎలాంటి శషభిషలూ లేకుండా పెద్ద అంగలు వేసుకుంటూ ప్రపంచ నేతగా తన పాత్రను పోషించేందుకు మున్ముందుకు దూసుకుపోతున్నది. మన ఆర్థికాభివృద్ధి ప్రపంచాన్ని ప్రభావితం చేయడంతోపాటు ప్రపంచస్థాయి మౌలిక వ్యవస్థలను అందరినీ ఆశ్చర్యానికి
గురిచేస్తున్నాయి.
1962 డిసెంబరు 10వ తేదీన ఆర్ఐఎంసీలో ఇచ్చిన సందేశంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన ముత్యాల్లాంటి రెండు మాటల్ని మీకు చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను.
‘‘వీర భాగ్య వసుంధర గురించి మన పురాణాల్లో ఉంది. అది ఏమంటే: ఈ భూమి వీరులది. ఆత్మస్థైర్యం గలవాళ్లది. అంతేకానీ, ఈ భూమి సోమరిపోతులదీకాదు, బద్ధకస్తులదీ కాదు. మరీ ముఖ్యంగా నిర్వీర్యమైపోయిన వాళ్లది అంతకంటే కాదు. పోటీతత్వం, నువ్వా, నేనా అన్న పోటీ వాతావనణంలో మనలో ప్రతి ఒక్కరికీ స్వీయ నియంత్రణనీ, త్యాగనిరతినీ అలవరుచుకోవాలి. జీవితం ఈ గొప్ప లక్షణాలను పుణికిపుచ్చుకోవాలి’’
భయానికి తావులేకుండా, గొప్పగా ఈ దేశానికి మీరంతా సేవ చేయాలన్నదే నేను ఇస్తున్న సందేశం. భారత మాత ప్రభావం మీపైన ఉంటుంది. ఈ దేశపు బాధ్యత మీ భుజస్కంధాలపైన ఉన్నది. దేశావసరాలే మీకు ప్రథమ ప్రాధమ్యం కావాలి. మీ పనితీరు క్రమశిక్షణలో, స్థితప్రజ్ఞతలో, ప్రేమలో దేదీప్యం కావాలి.
మీ సంస్థ పెట్టుకున్న ఆదర్శం- బల్ వివేక్ ఎన్నడూ వమ్ము చేయకండి. దారుఢ్యం, వివేచన- ఈ రెండింటి మిశ్రమం కష్టకాలంలో మీకు తోడు అవుతుంది.
భారతదేశం సేవకు అంకితం అవ్వండి. ఇదే మీకు లభించే ఆశీర్వచనం!
ధ్యాంక్యూ. జై హింద్!
***
(रिलीज़ आईडी: 2050842)
आगंतुक पटल : 76