విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఎస్‌జెవిఎన్ సంస్థకు ప్రతిష్ఠాత్మక నవరత్న హోదా
Posted On:
31 AUG 2024 8:48PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థల విభాగం ఎస్‌జెవిఎన్ సంస్థకు ప్రతిష్ఠాత్మక నవరత్న హోదాను అందించింది. ఎస్‌జెవిఎన్ 36 సంవత్సరాల ప్రయాణంలో ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. దేశ 25 వ నవరత్న సంస్థగా ఇది కీలకమైన మైలురాయి దాటింది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి ఎస్‌జెవిఎన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుశీల్ శర్మ, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ల నిరంతర మార్గదర్శకత్వం, అచంచల మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈక్విటీ భాగస్వామిగా సంస్థకు ఎల్లప్పుడూ సహాయం చేస్తున్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి సుశీల్ శర్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గణనీయమైన ఆర్థిక పనితీరు, స్థిర నిర్వహణా సామర్థ్యాన్ని ప్రదర్శించిన ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా కల్పిస్తున్నట్లు శ్రీ శర్మ తెలిపారు. ఇది సంస్థ వ్యాపార ప్రయోజనాలను పెంచడానికి, దేశ ఇంధన భద్రతకు దోహదం చేయడానికి మరింత ఆర్థిక, నిర్వహణ స్వేచ్ఛను కల్పిస్తుంది.ఎస్‌జెవిఎన్ గత విజయాలను గుర్తించడమే కాకుండా, భవిష్యత్తులో పెద్ద ప్రాజెక్టులను చేపట్టడానికి, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడానికి నవరత్న హోదాతో వీలు కలుగుతుంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే ప్రభుత్వ దార్శనికతకు మరింత దోహదం చేయడానికి సంస్థకు వీలు కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఎస్‌జెవిఎన్ ఈ హోదా తో ఇకనుంచి ఎటువంటి ఆర్థిక పరిమితి లేకుండా తన ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టవచ్చు, తద్వారా సంస్థ వృద్ధి గణనీయంగా పెరుగుతుంది. అదనంగా, సంస్థ నికర విలువలో ఏడాదికి 30 శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ఎస్‌జెవిఎన్ విస్తరణ ప్రణాళికలకు మరింత ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది. ఈ హోదాతో సంక్రమించిన స్వయంప్రతిపత్తి నిర్ణయాల ద్వారా ఉమ్మడి వెంచర్లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది, అదేవిధంగా విదేశీ అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయవచ్చు. సంస్థాగత పునర్నిర్మాణాన్ని చేపట్టడానికి అనుమతిస్తుంది.
ఎస్‌జేవీఎన్ సంస్థకు 2008లో ప్రతిష్టాత్మక మినీరత్న హోదా లభించింది. ప్రస్తుతం ఎస్‌జెవిఎన్ చేతిలో 56,802.4 మెగావాట్ల ప్రాజెక్టు పనులు ఉన్నాయి. మొత్తం పదమూడు ప్రాజెక్టులు 2466.5 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. హైడ్రో, సోలార్, విండ్, థర్మల్, ట్రాన్స్‌మిషన్ లైన్లలో వివిధ దశలలో 75 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. 1988 లో భారత ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఉమ్మడి వెంచర్‌గా ఏర్పాటైన ఈ సంస్థ భారత్, నేపాల్ లలో తన కార్యకలాపాలను విస్తరించి బహుళ శక్తి సంస్థగా అభివృద్ధి చెందింది.
***
(Release ID: 2050678)
Visitor Counter : 109