వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఎన్ఐసిడిపి’ కింద 12 కొత్త పారిశ్రామిక నగరాలకు మంత్రిమండలి ఆమోదం


భార‌త్‌ను ప్రపంచ తయారీ కూడలిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ₹28,602 కోట్ల పెట్టుబడి

Posted On: 30 AUG 2024 5:22PM by PIB Hyderabad

పరిచయం:

   భారత పట్టణ-పారిశ్రామికాభివృద్ధి ఉజ్వల భవిష్యత్తుకు ఉద్దేశించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమం (నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్-ఎన్ఐసిడిపి) అత్యంత ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల కల్పనకు నిదర్శనంగా నిలుస్తుంది. ఎంతో దూరదృష్టితో రూపుదిద్దిన ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త పారిశ్రామిక నగరాలను ‘‘అత్యాధునిక నగరాలు’’గా తీర్చిదిద్దుతారు. వివిధ మౌలిక సదుపాయాల రంగాల్లో నవతరం సాంకేతిక పరిజ్ఞానాలన్నీ ఈ నగరాలతో నిరంతర సంధానంలో ఉంటాయి. ఈ భవిష్యత్ పారిశ్రామిక కూడళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ అగ్రశ్రేణి తయారీ, పెట్టుబడి గమ్యాలకు దీటుగా భార‌త్‌ను ప్రపంచంలో అగ్రస్థానాన నిలపాలన్నది ప్రభుత్వ సంకల్పం.

   తయారీ రంగంలో వృద్ధిని వేగిరపరచడం, క్రమబద్ధ పట్టణీకరణను ప్రోత్సహించడమే  సమీకృత పారిశ్రామిక కారిడార్ల నిర్మాణ వ్యూహంలో ప్రధానాంశాలు. బలమైన బహుళ రవాణా సదుపాయాలతో అనుసంధానిస్తూ రూపొందే ఈ కారిడార్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాల సృష్టి, ఆర్థిక వృద్ధి సహా సర్వతోముఖ సామాజికార్థిక ప్రగతికి ఇవి సారథ్యం వహిస్తాయి.

నేపథ్యం

   ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ (డిఎంఐసి) ప్రారంభంతో జాతీయ పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమం (ఎన్ఐసిడిపి) శ్రీకారం చుట్టుకుంది. ఈ మేరకు 2008 జనవరి 7న ఒక స్వయంప్రతిపత్త ప్రత్యేక సంస్థ (ఎస్‌పివి)గా ‘ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ (డిఎంఐసిడిసి) ఏర్పడింది. ఇది వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) పాలన నియంత్రణలో పనిచేస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ కార్యకలాపాల పర్యవేక్షణతోపాటు ‘డిఎంఐసి’ పరిధిలో అమలయ్యే వివిధ కార్యక్రమాలను సమన్వయం చేయడం దీని ప్రాథమిక కర్తవ్యం.

   అయితే, 2016 డిసెంబరులో ‘డిఎంఐసి’ ట్రస్ట్ పరిధిని విస్తరింపజేసి, ‘నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్’ (ఎన్ఐసిడిఐటి)గా పునర్వ్యవస్థీకరించారు. అంతిమంగా 2020 ఫిబ్రవరిలో ‘డిఎంఐసిడిసి’ పేరును నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఐసిడిసి)గా మార్చారు. దేశవ్యాప్తంగా బహుళ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టుల నిర్మాణ సారథ్య బాధ్యతను దీనికి అప్పగించడంతో భారత ప్రతిష్టాత్మక ‘జాతీయ పారిశ్రామిక కారిడార్ కార్యక్రమం’లో ఈ మార్పు కీలక మలుపుగా నిలిచింది.

   పెట్టుబడికి అనువైన రంగాలు, పారిశ్రామిక ప్రాంతాలు, ఆర్థిక మండలాలు, పారిశ్రామిక సంగమాలు, శివారు పట్టణాలు, సమీకృత తయారీ సముదాయాలు, స్వతంత్ర లేదా ప్రారంభ దశలోగల ప్రాజెక్టులు సహా అనేక కార్యక్రమాల సంబంధిత అభివృద్ధి కార్యకలాపాలన్నీ ‘ఎన్ఐసిడిసి’ బాధ్యతలలో భాగంగా ఉంటాయి. ఈ కృషిలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది అత్యావశ్యక తోడ్పాటునిస్తుంది.

   బృహత్ ప్రణాళికలు, సాధ్యాసాధ్యాల నివేదికలు, సవివర ప్రాజెక్టు నివేదికలు సహా వాటి సమగ్ర అభివృద్ధి కూడా ‘ఎన్ఐసిడిసి’ బాధ్యతలలో కీలక భాగంగా మారింది. అంతేకాకుండా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన-నిర్మాణం, ఆర్థిక ఉపకరణాల సృష్టి-పంపిణీ సౌలభ్యం, రుణ సంప్రదింపులు, వనరుల సమీకరణ, మౌలిక సదుపాయాలకు రుణాల కోసం పథకాల రూపకల్పన వగైరాలలో కీలక మధ్యవర్తిగానూ వ్యవహరిస్తుంది.

జాతీయ పారిశ్రామిక కారిడార్లు

జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సముదాయంలో 11 కారిడార్లు

1.    ఢిల్లీ - ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (డిఎంఐసి)

2.  అమృత్‌సర్ - కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్ (ఎకెఐసి)

3.  చెన్నై - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సిబిఐసి)

4.  విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (విసిఐసి)

5.  బెంగళూరు - ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (బిఎంఐసి)

6.  ఒడిషా ఎకనమిక్ కారిడార్ (ఒఇసి)

7.  హైదరాబాద్ - నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ (హెచ్ఎన్ఐసి)

8.  హైదరాబాద్ - వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ (హెచ్‌డ‌బ్ల్యుఐసి)

9.  హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (హెచ్‌బిఐసి)

10. కోయంబత్తూర్ మీదుగా కొచ్చివరకూ ‘సిబిఐసి’ పొడిగింపు

11.   ఢిల్లీ - నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ (డిఎన్ఐసి)

కార్యక్రమ కీలకాంశాలు:

వ్యూహాత్మక పెట్టుబడులు: దేశంలో శక్తిమంతమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు ప్రోత్సాహం లక్ష్యంగా ‘ఎన్ఐసిడిపి’కి ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనికింద భారీ ‘యాంకర్’ పరిశ్రమలతోపాటు సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) రెండింటిలోనూ పెట్టుబడుల సౌలభ్యం కల్పిస్తుంది. భారత్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం సాధించడంలో ఈ పారిశ్రామిక సంగమాలు ఉత్ప్రేరకాలుగా తోడ్పడతాయి. అంతర్జాతీయ స్థాయిలో స్వావలంబన, పోటీతత్వం ప్రదర్శించగల భార‌త్‌ను రూపొందించడంలో ప్రభుత్వ దార్శనికతను ఇవి ప్రతిబింబిస్తాయి.

అత్యాధునిక నగరాలు-ఆధునిక మౌలిక సదుపాయాలు: ఈ సరికొత్త అత్యాధునిక పారిశ్రామిక నగరాలకు ‘‘డిమాండ్ ఏర్పడేలోపే’’ అవి ‘ప్లగ్-న్-ప్లే’, ‘వాక్-టు-వర్క్’ విధానంలో ప్రపంచ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటాయి. ఈ విధానంతో నగరాలు సుస్థిర, సమర్థ పారిశ్రామిక కార్యకలాపాలకు మద్దతిచ్చే అధునాతన మౌలిక సదుపాయాలు సమకూరుతాయి.

పిఎం గతిశక్తి కింద రంగాలవారీ విధానం: ‘పిఎం గతిశక్తి’ జాతీయ బృహత్ ప్రణాళికతో ముడిపడిన ప్రాజెక్టులలో బహుళ రవాణా, అనుసంధాన మౌలిక సదుపాయాలు ఉంటాయి. తద్వారా ప్రజలతోపాటు వస్తు రవాణా, సేవల ప్రదానం నిరంతరంగా సాగేందుకు భరోసా లభిస్తుంది. ఈ పారిశ్రామిక నగరాలు ఆయా ప్రాంతాల సమూల పరివర్తనలో వృద్ధి కేంద్రాలుగా తోడ్పడతాయి.

‘వికసిత భారత్’ కోసం విశిష్ట దృక్కోణం: ‘వికసిత భారత్’- అభివృద్ధి చెందిన భారతదేశం స్వప్న సాకారంలో ఈ ప్రాజెక్టుల ఆమోదం ఒక ముందడుగు. ఈ దృక్కోణంతో ‘ఎన్ఐసిడిపి’ కింద రూపొందే ప్రాజెక్టులు పెట్టుబడిదారులకు తక్షణ భూ కేటాయింపు వెసులుబాటుతో అంతర్జాతీయ విలువ శ్రేణి (జివిసి)లో భారత్ పాత్రను సుస్థిరం చేస్తాయి. తద్వారా దేశవిదేశీ పెట్టుబడిదారులు భార‌త్‌లో తయారీ యూనిట్ల ఏర్పాటు చేయడం సులభమవుతుంది. ‘స్వయం సమృద్ధ భారతం’ లేదా స్వావలంబిత భారతదేశానికి ఇది నిర్దిష్ట రూపమిస్తుంది. మెరుగైన పారిశ్రామికోత్పత్తి, ఉపాధి కల్పన ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించే విస్తృత లక్ష్య సాధనకు దోహదం చేస్తుంది.

ఆర్థిక ప్రభావం - ఉపాధి సృష్టి: ‘ఎన్ఐసిడిపి’ కింద ప్రణాళికబద్ధ పారిశ్రామికీకరణ ద్వారా 10 లక్షల ప్రత్యక్ష, 30 లక్షల పరోక్ష ఉద్యోగాలతో గణనీయ ఉపాధి అవకాశాలు అందివస్తాయని అంచనా. తద్వారా జీవనోపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఆయా ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి కూడా ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయి.

సుస్థిర ప్రగతిపై నిబద్ధత: దేశంలో సుస్థిరత, ‘ఐసిటి’ ఆధారిత సదుపాయాలు/హరిత సాంకేతిక పరిజ్ఞానాలతో పర్యావరణ ప్రభావాల తగ్గింపుపై దృష్టి సారిస్తూ ‘ఎన్ఐసిడిపి’ ప్రాజెక్టులు రూపొందాయి. అంతేకాకుండా నాణ్యమైన, విశ్వసనీయ, సుస్థిర మౌలిక సదుపాయాలతో పారిశ్రామిక నగరాల సృష్టి లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇవి ఆర్థిక కార్యకలాపాలకు కూడళ్లుగా మాత్రమేగాక పర్యావరణ పరిరక్షణకు అనుసరణీయ నమూనాలుగా కూడా ఉంటాయి.

రూపుదిద్దుకోనున్న సరికొత్త అత్యాధునిక నగరాలు

ధోలేరా ప్రత్యేక పెట్టుబడుల పారిశ్రామిక వాడ, గుజరాత్ (డిఎస్ఐఆర్)

   అహ్మదాబాద్ నగరానికి నైరుతి దిశగా 100 కిలోమీటర్ల దూరంలో రూపుదిద్దుకోనున్న సరికొత్త అత్యాధునిక పారిశ్రామిక నగరమే ‘ధోలేరా ప్రత్యేక పెట్టుబడుల పారిశ్రామిక వాడ’. పారిశ్రామికాభివృద్ధి, తయారీ రంగ కూడలిగా భారత్ రూపొందాలన్న లక్ష్యంతో దీనికి రూపకల్పన చేశారు. దేశంలో తొలి ప్లాటినం రేటింగ్ గల పారిశ్రామిక స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం ఆగ్నేయాసియాలోనే ఎక్కడా లేనంత భూ లభ్యతగల ప్రదేశం. రక్షణ,  విమానయానం, అత్యాధునిక సాంకేతికతలు, ఔషధ తయారీ వంటి కీలక రంగాల ఏర్పాటు దీని లక్ష్యం. ఇది 2016లో ‘ధోలేరా ఇండస్ట్రియల్ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (డిఐసిడిఎల్) పేరిట గుజరాత్ ప్రభుత్వంతో సంయుక్తంగా ఏర్పడిన స్వయంప్రతిపత్త ప్రత్యేక సంస్థ (ఎస్‌పివి). ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ‘డిఐఎస్ఆర్‌డిఎ’ ద్వారా 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి ‘ఎన్ఐసిడిసి’ ట్రస్టు ద్వారా 49 శాతం వాటా ఉంటుంది. ప్రాంతీయ, జాతీయాభివృద్ధికి సారథ్యం వహిస్తూ సుస్థిర, కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుపై ఈ ‘ఎస్‌పివి’ దృష్టి సారిస్తుంది.

ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ లిమిటెడ్మహారాష్ట్ర (ఎయుఆర్ఐసి)

   ఢిల్లీ - ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (డిఎంఐసి)లో భాగంగా మహారాష్ట్రలో 10,000 ఎకరాలలో విస్తరించిన సరికొత్త అత్యాధునిక పారిశ్రామిక నగరమిది. ఔరంగాబాద్ సమీపాన షెండ్రా-బిడ్కిన్ వద్దగల ‘ఎయుఆర్ఐసి’ని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడిసి), ‘ఎన్ఐసిడిసి’  ట్రస్టు సంయుక్త స్వయంప్రతిపత్త ప్రత్యేక సంస్థ (ఎస్‌పివి) ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ లిమిటెడ్ (ఎఐటిఎల్) నిర్వహిస్తుంది. ఈ ‘ఎయుఆర్ఐసి’ నగరంలో 60 శాతం భూమిని పారిశ్రామిక అవసరాలకు, 40 శాతాన్ని నివాస, వాణిజ్య, వినోద సౌకర్యాల కోసం కేటాయించారు.

సమీకృత పారిశ్రామిక శివారు పట్టణం, గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్

‘డిఎంఐసి’ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ గ్రేటర్ నోయిడా లిమిటెడ్ (డిఎంఐసి-ఐఐటిజిఎన్ఎల్) ఒక స్వయంప్రతిపత్త ప్రత్యేక సంస్థ (ఎస్‌పివి). ఇది ‘ఎన్ఐసిడిఐటి’, గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (జిఎన్ఐడిఎ)ల మధ్య 50:50 శాతం భాగస్వామ్యంతో ఏర్పడిన సంయుక్త కంపెనీ.

సమీకృత పారిశ్రామిక శివారు పట్టణం, విక్రమ్ ఉద్యోగ్ పురి, మధ్యప్రదేశ్

నాణ్యమైన పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉపాధి, పారిశ్రామికోత్పత్తి, ప్రాంతీయ ఎగుమతుల వృద్ధి లక్ష్యంగా ఢిల్లీ - ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ విక్రమ్ ఉద్యోగ్‌పురి లిమిటెడ్ (డిఎంఐసివియుఎల్) ఏర్పాటైంది. తయారీ రంగంపై నిశిత దృష్టితో సుస్థిర ఆర్థిక పునాది సృష్టి లక్ష్యంగా విక్రమ్ ఉద్యోగపురి (యువి) ప్రాజెక్ట్ రూపొందింది. సంస్థాగత, ఆవాస, వాణిజ్య కార్యకలాపాలకు ఇది తోడ్పాటునిస్తుంది. ఉజ్జయిని నుంచి 8 కిలోమీటర్లు, దేవాస్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోగల నార్వార్ గ్రామంలో 442.3 హెక్టార్ల (1,096 ఎకరాలు)లో ఈ ప్రాజెక్టు ఏర్పాటైంది. అలాగే ‘డిఎంఐసి’ ప్రాంతం పొడవునా రాష్ట్ర రహదారి 18 (ఎస్‌హెచ్‌-18) వెంబడి వ్యూహాత్మక అధునాతన మౌలిక సదుపాయాలతోపాటు సామాజిక, భౌతిక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.

పది రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక సంగమాలు/నగరాలకు మంత్రిమండలి ఆమోదం

   నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌ఐసిడిపి) కింద 12 కొత్త ప్రాజెక్ట్ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సిసిఇఎ) ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో గణనీయ స్థాయిలో పారిశ్రామిక పరివర్తనకు భారత్ చేరువవుతోంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన ‘సిసిఇఎ’ సమావేశంలో తీసుకున్న ఈ కీలక నిర్ణయం మేరకు 28,602 కోట్ల పెట్టుబడితో ఇవి రూపుదిద్దుకుంటాయి. పారిశ్రామిక సంగమాలు, నగరాల బలమైన నెట్‌వర్క్‌ ద్వారా ఆర్థిక వృద్ధికి సారథ్యం వహించడం, ప్రపంచంలో భారత్ ప్రపంచ పోటీతత్వం పెంపు ఈ వినూత్న నిర్ణయం లక్ష్యం. దేశంలోని పది రాష్ట్రాల పరిధిలో ఆరు ప్రధాన కారిడార్ల వెంబడి ఈ 12 పారిశ్రామిక ప్రాంతాల విస్తరణకు వ్యూహాత్మక ప్రణాళిక రచించారు. భారత్ తన తయారీ సామర్థ్యంతోపాటు ఆర్థిక వృద్ధిని పెంచుకునే దిశగా సాగే కృషిలో గణనీయ పురోగతిని ఇవి ప్రతిబింబిస్తాయి. ఈ మేరకు ఆమోదం పొందిన నగరాల జాబితా కిందివిధంగా ఉంది:

ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా

పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా

మహారాష్ట్రలోని డిఘి

కేరళలోని పాలక్కాడ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రా,

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్రయాగ్‌రాజ్

బీహార్‌లోని గయ

తెలంగాణలోని జహీరాబాద్

ఆంధ్రప్ర‌దేశ్‌లోని ఓర్వకల్,

ఆంధ్రప్ర‌దేశ్‌లోని కొప్పర్తి

రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్-పాలి

   ప్రపంచ తయారీ రంగంలో గణనీయ శక్తిగా రూపొందే లక్ష్యంతో సాగుతున్న భారత్ ప్రయాణంలో ‘ఎన్‌ఐసిడిపి’ కింద 12 కొత్త పారిశ్రామిక సంగమాలకు ఆమోదాన్ని ఓ కీలక మలుపుగా పరిగణించవచ్చు. అలాగే సమగ్రాభివృద్ధి, సుస్థిర మౌలిక సదుపాయాలు, నిరంతర అనుసంధానంపై ఇవి వ్యూహాత్మకంగా దృష్టి సారిస్తాయి. ఆ మేరకు భారత పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక పరివర్తన తేవడం ద్వారా భారత భవిష్యత్ ఆర్థిక వృద్ధికి చోదకాలు కాగలవు.

   ఈ కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలపడానికి ముందుగానే ‘ఎన్ఐసిడిపి’ కింద ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులు పూర్తికాగా, మరో నాలుగు నిర్మాణ దశలో ఉన్నాయి. దేశ పారిశ్రామిక రంగాన్ని పరివర్తనాత్మకం చేయడంతోపాటు శక్తియుత, సుస్థిర, సార్వజనీన ఆర్థిక వాతావరణాన్ని పోత్సహించడంలో ప్రభుత్వ అంకితభావాన్ని ఈ నిరంతర పురోగమనం చాటిచెబుతుంది.

ముగింపు

   భారత పారిశ్రామిక రంగ స్వరూపాన్ని పునర్వ్యవస్థీకరించి, తయారీ రంగంలో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలిపే దిశగా పరివర్తనాత్మక ప్రణాళికగా జాతీయ పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమాన్ని (ఎన్ఐసిడిపి) పేర్కొనవచ్చు. ఆర్థిక వృద్ధి పెంపు, ఉపాధి అవకాశాల సృష్టి, సుస్థిర ప్రగతిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వ అకుంఠిత నిబద్ధతకు దేశవ్యాప్తంగా 12 కొత్త పారిశ్రామిక సంగమాల నిర్మాణానికి ఇటీవల కేబినెట్ ఆమోదం ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టులు భారత తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ప్రాంతీయ ఆర్థిక ప్రగతికి ఉత్ప్రేరకాలు కాగలవు. దేశాన్ని స్వావలంబిత, వికసిత భారత్ దిశగానూ నడిపిస్తాయి. మన ఆర్థిక వ్యవస్థ ఉజ్వల భవిష్యత్తు  రూపకల్పన, ప్రపంచంలో భారత్ పోటీతత్వం పెంపు, దేశానికి దీర్ఘకాలిక శ్రేయస్సుకు భరోసాలో ఈ పారిశ్రామిక కారిడార్ల విజయం కీలక పాత్ర పోషిస్తుంది.

 

***


(Release ID: 2050522) Visitor Counter : 197


Read this release in: English , Urdu , Hindi , Manipuri