అరిహంత్ శ్రేణి కి చెందిన రెండో జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ ను రక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ఈ రోజున విశాఖపట్నంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో భారతీయ నౌకా దళానికి అప్పగించారు. రక్షణ మంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ‘అరిఘాత్’ భారతదేశ పరమాణు త్రివిధ శక్తి (న్యూక్లియర్ ట్రయేడ్) ని మరింతగా బలపరచగలదన్నారు. అంతేకాకుండా పరమాణు సంబంధి నిరోధక శక్తి ని ఇది పెంచుతుందని, ప్రాంతీయంగా వ్యూహాత్మక సమతుల్యతను, శాంతిని నెలకొల్పడంలో సహాయకారిగా ఉంటుందని, దేశ భద్రత పరిరక్షణలో నిర్ణాయక పాత్రను పోషిస్తుందని మంత్రి అన్నారు. ఇది దేశం దృష్టిలో ఓ కార్యసాధన అని, రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ అచంచల సంకల్పానికి సూచికగా ఉందంటూ శ్రీ రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు.
ఈ సామర్థ్యాన్ని సంపాదించడంలో భారతీయ నౌకాదళం, డీఆర్ డీఓ , పరిశ్రమ.. ఈ మూడూ వాటి కఠోర శ్రమను, సమన్వయాన్ని చాటిచెప్పాయని మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ తరహా ఆత్మనిర్భరత స్వీయ శక్తి కి పునాదిని వేసిందని ఆయన పేర్కొన్నారు. దేశ పారిశ్రమిక రంగం, ప్రత్యేకించి స్థూల, సూక్ష్మ, మధ్యతరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ స్) ఈ ప్రాజెక్టు తో భారీ ఉత్తేజాన్ని అందుకొన్నాయని, అంతేకాక చాలా ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయని ఆయన మెచ్చుకొన్నారు.
భారతదేశాన్ని ఒక పరమాణు అస్త్రం కలిగిన దేశం తో సమానంగా నిలబెట్టిన మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్ పేయీ రాజకీయ సంకల్పాన్ని రక్షణ మంత్రి గుర్తు చేస్తూ, ‘‘ప్రస్తుతం, భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశం గా ముందడుగు వేస్తోంది. రక్షణ సహా ప్రతి ఒక్క రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందడం, ప్రత్యేకించి నేటి భౌగోళిక రాజకీయ స్థితిగతులను పరిశీలించినప్పుడు మనకు అనివార్యం. మన జవానులు భారతదేశ గడ్డ మీద రూపొందించిన ఉత్తమ నాణ్యతతో కూడిన ఆయుధాలను, ప్లాట్ ఫార్మ్ లను కలిగివుండేటట్టు చూడడానికి మా ప్రభుత్వం ఉద్యమ తరహాలో పనిచేస్తోంది’’ అన్నారు.
ఐఎన్ఎస్ అరిఘాత్ నిర్మాణంలో ఉన్నత రూపురేఖలు, తయారీ సంబంధి సాంకేతికత, విస్తృత పరిశోధన- అభివృద్ధి, ప్రత్యేక పదార్థాల ఉపయోగం, క్లిష్టమైన ఇంజినీరింగ్ ప్రక్రియల అండదండలతో పాటు అధిక ప్రావీణ్యం ఇమిడిన పనితనం.. ఇవి అన్నీ కీలకంగా నిలిచాయి. దేశీయ వ్యవస్థల తో పాటు ఇతరత్రా సామగ్రి హంగులు దీనిలోని విశిష్టత అని చెప్పాలి. వాటిని భారతదేశ శాస్త్రవేత్తలు, పరిశ్రమ, నౌకాదళ సిబ్బంది ఆలోచించి, ఆకృతులను ఇచ్చి, తయారు చేసి, ఒక చోటులో కూర్చారు.
ఈ జలాంతర్గామి విషయంలో దేశీయంగా అమలుపరచిన పురోగామి సాంకేతికతలు దీనిని దీని కన్నా ముందటి జలాంతర్గామి అయిన అరిహంత్ కంటే చాలా ఉన్నతమైందిగా నిలబెట్టాయి. ఐఎన్ఎస్ అరిహంత్ మరియు ఐఎన్ఎస్ అరిఘాత్ లు రెండిటి ఉనికి సంభావ్య విరోధులను నిలువరించడంలో భారతదేశం సామర్థ్యాన్ని ఇనుమడింపచేయడమే కాక భారత జాతీయ ప్రయోజనాలను కూడా పరిరక్షించ గలుగుతుంది.
***