విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఈశాన్య భారతంలో జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద కేంద్ర ఆర్థిక సహాయానికి మంత్రిమండలి ఆమోదం
Posted On:
28 AUG 2024 3:31PM by PIB Hyderabad
ఈశాన్య భారతంలో జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద కేంద్ర ఆర్థిక సహాయం (సిఎఫ్ఎ) అందించే దిశగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల సంయుక్త భాగస్వామ్యం (జెవి) కింద ఈ ప్రాజెక్టులు నిర్మించనుండగా, ఆ ప్రాంతంలోని వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వ వాటా పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం చేయాలన్న కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
ఈ పథకం 2024-25 నుంచి 2031-32 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో రూ.4136 కోట్ల అంచనా వ్యయంతో అమలు కానుంది. ఈశాన్య భారతంలోని వివిధ రాష్ట్రాల పరిధిలో నిర్మించే ఈ జల విద్యుత్ కేంద్రాల సంచిత ఉత్పాదక సామర్థ్యం దాదాపు 15000 మెగావాట్లదాకా ఉంటుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకుగల బడ్జెట్ కేటాయింపులలో ఈశాన్య ప్రాంతానికి ఉద్దేశించిన 10 శాతం స్థూల బడ్జెట్ మద్దతు (జిబిఎస్) ద్వారా వీటి నిర్మాణానికి నిధులు సమకూరుస్తారు.
ఈ ప్రాజెక్టులన్నిటి నిర్మాణం, రూపొందించిన పథకం నిర్దేశిస్తున్న మేరకు రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో ఒక సంయుక్త సంస్థ (జెవి) ఏర్పాటవుతుంది.
విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వాల వాటాను 24 శాతం... గరిష్ఠంగా రూ.750 కోట్లుగా నిర్ణయించిన నేపథ్యంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ఒకవేళ అంతకుమించి నిధులు అవసరమైన పక్షంలో ప్రతి ప్రాజెక్టుపైనా విడివిడిగా పునఃసమీక్షించి- గరిష్ఠ పరిమితిపై నిర్ణయం తీసుకుంటారు. ఇక సంయుక్త భాగస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ వాటాల నిష్పత్తిని గ్రాంటు అందజేసే సమయంలో ఖరారు చేస్తారు.
అయితే, గిట్టుబాటు కాగల జలవిద్యుత్ ప్రాజెక్టులకు మాత్రమే కేంద్ర ఆర్థిక సహాయం పరిమితం. ఆయా ప్రాజెక్టులు గిట్టబాటయ్యేవి కాగలగడంలో రాష్ట్రాలు తమవంతు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆ మేరకు ఉచిత విద్యుత్‌ను వదులుకోవడం/ సరఫరాలో విభజనసహా లేదా ‘ఎస్‌జిఎస్‌టి’ వాపసు వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
***
(Release ID: 2049482)
Visitor Counter : 81