బొగ్గు మంత్రిత్వ శాఖ

2024-25లో 7.12 శాతం వృద్ధితో 370 మిలియన్ టన్నులకు చేరిన దేశీయ బొగ్గు ఉత్పత్తి


36.2 శాతం వృద్ధితో 121.57 మిలియన్ టన్నులకు చేరిన బొగ్గు నిల్వలు

Posted On: 27 AUG 2024 6:11PM by PIB Hyderabad

2024 ఆగస్టు 25 వరకు నమోదైన లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఆ శాఖ పురోగతి సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి అగస్టు 25 నాటికి సంచిత బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగి 370.67 మిలియన్ టన్నులకు చేరుకుంది. 2023-24లో ఇదే కాలంలో నమోదైన 346.02 మిలియన్ టన్నుల ఉత్పత్తితో పోల్చితే ఇది 7.12% వృద్ధికి సమానం.

మొత్తం బొగ్గు పంపిణీ కూడా గణనీయంగా పెరిగింది. 2024-25లో ఆగస్టు 25 నాటికి ఇది 397.06 మిలియన్ టన్నులకు చేరుకుంది. అందుకు ముందు ఏడాది పంపిణీ అయిన 376.44 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 5.48 శాతం వృద్ధిని నమోదు చేసింది.

2024-25లో ఆగస్టు 25 నాటికి 325.97 మిలియన్ టన్నులు బొగ్గు.. విద్యుత్ రంగానికి పంపిణీ అయింది. అంతకుముందు సంవత్సరం ఇదే సమయంలో ఇది 313.44 మిలియన్ టన్నులుగా ఉంది. 01 ఏప్రిల్ 24 నాటికి టీపీపీల వద్ద 47 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వతో ఆర్థిక సంవత్సరం ప్రారంభించినప్పటికీ ఈ వృద్ధి నమోదు కావటం విశేషం. దీనివల్ల విద్యుత్ రంగ ఇంధన అవసరాలకు అనుగుణంగా బొగ్గు సరఫరా స్థిరంగా జరగనుంది.

2024 ఆగస్టు 25 నాటికి గనుల వద్ద, టీపీపీలు, రవాణాలో ఉన్న బొగ్గు మొత్తం నిల్వ 121.57 మిలియన్ టన్నులకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన 89.28 మిలియన్ టన్నుల నిల్వతో పోలిస్తే ఇది 36.2 శాతం అధికం. ఆగస్టు 25 నాటికి టీపీపీ(డీసీబీ)ల వద్ద బొగ్గు నిల్వలు 37.55 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరం 29.47 మిలియన్ టన్నుల నిల్వతో పోలిస్తే 27.41% గణనీయమైన వృద్ధిని తెలుపుతోంది.

అధికంగా ఉన్న ఈ బొగ్గు నిల్వలను చూసినపుడు, నల్ల బంగారం సరఫరా పుష్కలంగా ఉండాలన్న బొగ్గు మంత్రిత్వ శాఖ నిబద్ధతను తెలియజేస్తోంది. ఉత్పత్తి, పంపిణీ, నిల్వ స్థాయుల్లో నిరంతర పెరుగుదల దేశ ఇంధన భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తూనే విశ్వసనీయమైన ఇంధన సరఫరా ఉండేలా చూసేందుకు మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను నొక్కిచెబుతోంది.

 

***



(Release ID: 2049236) Visitor Counter : 57