ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విదేశాలకు వెళ్లే భారతీయులు ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ (ఐటిసిసి) పొందడం తప్పనిసరి కాదు


అవాస్తవ ప్రచారంపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) స్పష్టీకరణ

Posted On: 20 AUG 2024 9:19PM by PIB Hyderabad

   ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 230 (1ఎ) నిబంధన భారతదేశంలో నివసించే పౌరులు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందటానికి సబంధించినది.  ఇది ఫైనాన్స్ యాక్ట్-2003 కింద 1.6.2003 నుంచి అమలులోకి వచ్చింది. అయితే, ఫైనాన్స్ యాక్ట్ (నం.2)-2024 కింద సెక్షన్ 230(1ఎ)కి కేవలం ఒక సవరణ చేశారు. దీని ప్రకారం- పన్ను విధింపు చట్టం-2015 (‘‘ది బ్లాక్ మనీ యాక్ట్’’) కింద నల్లధనం (వెల్లడించని విదేశీ ఆదాయం/ఆస్తులు)పై పన్ను విధింపు సంబంధిత అంశాన్ని చేర్చారు. అంటే- ఆదాయపు పన్ను చట్టం-1961, ప్రత్యక్ష పన్నుల సంబంధిత ఇతర చట్టాలకు అనుగుణంగా నల్లధనం చట్ట నిబంధనల వర్తింపును సెక్షన్ 230(1ఎ) పరిధిలో చేరుస్తూ ఈ సవరణ తెచ్చారు.

   అయితే, ఈ సవరణకు అనుచిత భాష్యం చెబుతూ, తప్పుదోవ పట్టించే వివరణ ప్రచారంలోకి వచ్చింది. ఆ మేరకు భారత పౌరులెవరైనా విదేశాలకు వెళ్లేముందు ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ (ఐటిసిసి) పొందడం తప్పనిసరి అంటూ అవాస్తవ ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదు.

   ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 230 ప్రకారం ప్రతి ఒక్కరూ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాల్సిన అవసరం లేదు. ‘ఐటిసిసి’  పొందాల్సిన పరిస్థితుల పరిధిలోగల నిర్దిష్ట వ్యక్తులు మాత్రమే ఆ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన 2003 నుంచే చట్టంలో ఉంది. అంతేకాకుండా ఫైనాన్స్ (నం.2) యాక్ట్-2024 కింద సవరణ చేసినప్పటికీ దాని అమలు స్వభావం మారదు.

   ఈ మేరకు ‘సిబిడిటి’ తేదీ: 05.02.2004న జారీ చేసిన సూచనాత్మక ఆదేశం నం.1/2004 ప్రకారం భారతదేశంలో నివసించే వ్యక్తులు మాత్రమే చట్టంలోని సెక్షన్ 230(1ఎ) కింద ‘ఐటిసిసి’ని దిగువన పేర్కొన్న పరిస్థితులలో పొందాల్సి ఉంటుంది:

     i.        ఎవరైనా వ్యక్తి తీవ్ర ఆర్థిక అక్రమాలకు పాల్పడి, ఆదాయపు పన్ను చట్టం లేదా సంపద పన్ను చట్టం కింద కేసుల దర్యాప్తులో వారి హాజరీ అవసరం ఉన్నపుడు సదరు వ్యక్తులపై పన్ను విధింపు నోటీసు జారీకి అవకాశం ఉన్నపుడు

లేదా...

    ii.        ఎవరైనా వ్యక్తి రూ.10 లక్షలకు మించి ప్రత్యక్ష పన్ను బకాయి ఉన్నపుడు, సదరు బకాయిల వసూలుపై ఏ అధికార వ్యవస్థ నిలుపుదల ఉత్తర్వు ఇవ్వని పక్షంలో ‘ఐటిసిసి’ పొందాల్సిన అవసరం ఉంటుంది.

అంతేకాకుండా ‘ఐటిసిసి’ కోరడానికిగల కారణాలను వివరించిన తర్వాత, ఆదాయపు పన్ను విభాగం - ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా ఆ విభాగం చీఫ్ కమిషనర్ నుంచి అనుమతితో మాత్రమే పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలని సదరు వ్యక్తిని ఆదేశించే వీలుంటుంది.

 

****

 

(Release ID: 2048528) Visitor Counter : 151